సంక్షిప్త వార్తలు

అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణ ప్రణాళికలో భాగంగా టైటన్‌ కంపెనీ బంగ్లాదేశ్‌లో తన ఆభరణాల బ్రాండ్‌ తనిష్క్‌ను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది.

Published : 30 Jun 2024 03:06 IST

బంగ్లాదేశ్‌లో తనిష్క్‌ సేవలు

దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణ ప్రణాళికలో భాగంగా టైటన్‌ కంపెనీ బంగ్లాదేశ్‌లో తన ఆభరణాల బ్రాండ్‌ తనిష్క్‌ను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఆ మేరకు రిథమ్‌ గ్రూప్‌తో ఒక సంయుక్త సంస్థ(జేవీ) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బంగ్లాదేశ్‌లోని నారాయణగంజ్‌లో తయారీ ప్లాంటు ప్రారంభంతో ఈ సంయుక్త సంస్థ ప్రారంభమవుతుందని ఒక సంయుక్త ప్రకటనలో ఆ కంపెనీలు తెలిపాయి.


సీబీడీటీ ఛైర్మన్‌గా రవి అగర్వాల్‌

దిల్లీ: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)కు కొత్త ఛైర్మన్‌గా రవి అగర్వాల్‌ నియమితులయ్యారు. ఈయన 1988 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి. 2025 జూన్‌ వరకు రవి అగర్వాల్‌ సీబీడీటీ ఛైర్మన్‌గా కొనసాగుతారని నియామకాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ కమిటీ జారీ చేసిన ఆదేశాల ఆధారంగా తెలుస్తోంది. వాస్తవానికి అగర్వాల్‌ సెప్టెంబరులో పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే వచ్చే ఏడాది జూన్‌ వరకు ‘కాంట్రాక్టు పద్ధతిలో పునర్నియామకం’ ప్రకారం ఆయన ఈ హోదాలో కొనసాగుతారని ఆ ఆదేశాల్లో ఉంది. ప్రస్తుతం సీబీడీటీ ఛైర్మన్‌గా ఉన్న నితిన్‌ గుప్తా స్థానంలో అగర్వాల్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. నితిన్‌ గుప్తా 2022 జూన్‌లో సీబీడీటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. గతేడాది సెప్టెంబరులో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. తొమ్మిది నెలలు అంటే ఈ ఏడాది జూన్‌ 30 వరకు పొడిగింపు ఇచ్చారు. 


డిజిటల్‌ రుణాలు 49% పెరిగాయ్‌
2023-24పై పరిశ్రమ సమాఖ్య ‘ఫేస్‌’

ముంబయి: డిజిటల్‌ రుణాలపై ఒకవైపు ఆందోళనలు కొనసాగుతున్నా, 2023-24లో ఇవి 49 శాతం మేర పెరిగి రూ.1.46 లక్షల కోట్లకు చేరాయని 37 సభ్య సంస్థలు కలిగి ఉన్న పరిశ్రమ సమాఖ్య ఫిన్‌టెక్‌ అసోసియేషన్‌ ఫర్‌ కన్జూమర్‌ ఎంపవర్‌మెంట్‌(ఫేస్‌) వెల్లడించింది. సంఖ్యా పరంగా పంపిణీ చేసిన రుణాలు కూడా 35 శాతం మేర పెరిగి 10 కోట్లకు పైగా చేరాయని తెలిపింది. మార్చి త్రైమాసికంలో కంపెనీలు రూ.40,322 కోట్ల (సంఖ్యా పరంగా 2.69 కోట్లు) రుణాలను పంపిణీ చేశాయి. సగటు రుణ పరిమాణం రూ.13,418గా ఉంది. మొత్తం ఆర్థిక సంవత్సరం (2023-24)లో సగటు రుణ పరిమాణం రూ.12,648గా నమోదైంది. 2022-23లో ఈ పరిమాణం రూ.11,094గా ఉంది. మొత్తం పంపిణీ చేసిన రుణాల్లో 70 శాతం 28 కంపెనీలవేనని, ఇవన్నీ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు)గా నమోదయ్యాయని లేదా ఇన్‌-హౌస్‌ ఎన్‌బీఎఫ్‌సీని కలిగి ఉన్నాయని ఫేస్‌ తెలిపింది. వీటి వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని