డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి పెర్టుజుమ్యాబ్‌ బయోసిమిలర్‌ ఔషధం

రొమ్ము క్యాన్సర్‌ చికిత్సలో వినియోగించే పెర్టుజుమ్యాబ్‌ బయోసిమిలర్‌ ఔషధాన్ని మనదేశంలో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్, జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ ఉమ్మడిగా విక్రయించనున్నాయి.

Published : 29 Jun 2024 03:02 IST

రొమ్ము క్యాన్సర్‌ చికిత్సలో వినియోగం
జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌తో లైసెన్సింగ్‌ ఒప్పందం 

ఈనాడు, హైదరాబాద్‌: రొమ్ము క్యాన్సర్‌ చికిత్సలో వినియోగించే పెర్టుజుమ్యాబ్‌ బయోసిమిలర్‌ ఔషధాన్ని మనదేశంలో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్, జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ ఉమ్మడిగా విక్రయించనున్నాయి. దీనిపై రెండు కంపెనీల మధ్య లైసెన్సింగ్‌ ఒప్పందం కుదిరింది. ఈ బయోసిమిలర్‌ ఔషధాన్ని జైడస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (జడ్‌ఆర్‌సీ)లోని శాస్త్రవేత్తల బృందం సొంతంగా అభివృద్ధి చేసింది. రెండు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం డాక్టర్‌ రెడ్డీస్‌కు ఈ మందుపై జైడస్‌ నుంచి ‘సెమీ-ఎక్స్‌క్లూజివ్‌’ హక్కులు లభిస్తాయి. దీని కోసం జైడస్‌కు లైసెన్సింగ్‌ ఫీజును డాక్టర్‌ రెడ్డీస్‌ చెల్లిస్తుంది. పెర్టుజుమ్యాబ్‌ బయోసిమిలర్‌ ఔషధాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ ‘వుమ్యాబ్‌’ అనే బ్రాండుతో విక్రయిస్తుంది. అదే సమయంలో జైడస్‌ దీన్ని ‘సిగ్రిమా’ అనే పేరుతో విడుదల చేస్తుంది. రొమ్ము క్యాన్సర్‌ (హెర్‌2 పాజిటివ్‌) వచ్చిన వారికి కీమోథెరపీ, ట్రస్టుజుమ్యాబ్, పెర్టుజుమ్యాబ్‌ మందులు వినియోగిస్తారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ఇప్పటికే హెర్విక్టా అనే బ్రాండు పేరుతో ట్రస్టుజుమ్యాబ్‌ బయోసిమిలర్‌ ఔషధాన్ని విక్రయిస్తోంది. పెర్టుజుమ్యాబ్‌ మందును కూడా ఇప్పుడు అందుబాటులోకి తీసుకువస్తున్నందున రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు పూర్తి చికిత్సను తాము అందించినట్లు అవుతుందని డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది. సరైన చికిత్స తీసుకోని పక్షంలో హెర్‌2 పాజిటివ్‌ రొమ్ము క్యాన్సర్‌ వేగంగా విస్తరిస్తుంది. ఏటా 2 లక్షలకు పైగా రొమ్ము క్యాన్సర్‌ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 25 శాతం కేసులు హెర్‌2 పాజిటివ్‌ కేసులు ఉంటున్నాయి. జైడస్‌తో ఒప్పందం వల్ల మనదేశంలో ఎక్కువ మందికి పెర్టుజుమ్యాబ్‌ మందును అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఏర్పడినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని