ప్రాథమిక డీమ్యాట్‌ ఖాతా పరిమితి రూ.10 లక్షలకు పెంపు

సెక్యూరిటీల మార్కెట్‌లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యం పెంచేందుకు, ప్రాథమిక సేవల డీమ్యాట్‌ ఖాతా (బీఎస్‌డీఏ) పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సెబీ తెలిపింది.

Published : 29 Jun 2024 02:59 IST

దిల్లీ: సెక్యూరిటీల మార్కెట్‌లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యం పెంచేందుకు, ప్రాథమిక సేవల డీమ్యాట్‌ ఖాతా (బీఎస్‌డీఏ) పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సెబీ తెలిపింది. కొత్త మార్గదర్శకాలు సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని సర్క్యులర్‌లో పేర్కొంది. సాధారణ డీమ్యాట్‌ ఖాతాతో పోలిస్తే బీఎస్‌డీఏ పరిమాణం తక్కువగా ఉంటుంది. చిన్న పోర్ట్‌ఫోలియోలు కలిగిన మదుపర్లపై డీమ్యాట్‌ ఛార్జీల భారం తగ్గించేందుకు 2021లో సెబీ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అన్ని డిపాజిటరీల్లో ఒక పేరు మీద ఒకటే బీఎస్‌డీఏను అనుమతిస్తారు. ఇందులో డెట్, నాన్‌ డెట్‌ సెక్యూరిటీల విలువ రూ.10 లక్షలను మించకూడదు. ఇంతకు ముందు రూ.2 లక్షల వరకు డెట్‌ సెక్యూరిటీలకు అనుమతించేవారు. రూ.4 లక్షల వరకు పోర్ట్‌ఫోలియో విలువ ఉంటే ఎటువంటి వార్షిక నిర్వహణ ఛార్జీలు ఉండవు. రూ.4-10 లక్షల పోర్ట్‌ఫోలియో విలువపై రూ.100 ఛార్జీ వసూలు చేస్తారు. రూ.10 లక్షల విలువ దాటితే బీఎస్‌డీఏ ఖాతా ఆటోమేటిక్‌గా సాధారణ డీమ్యాట్‌ ఖాతాగా మారిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని