చిన్ని మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్‌

వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా రెండో త్రైమాసికమూ ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది.

Published : 29 Jun 2024 02:57 IST

దిల్లీ: వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా రెండో త్రైమాసికమూ ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. 2024 జులై 1తో ప్రారంభమయ్యే త్రైమాసికానికి ప్రస్తుత వడ్డీ రేట్లే ఉంటాయని ఆర్థిక శాఖ తెలిపింది. ‘వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలకు 2024-25 మొదటి త్రైమాసికానికి (మార్చి-జూన్‌) నోటిఫై చేసిన వడ్డీ రేట్లే 2024 జులై-సెప్టెంబరు  త్రైమాసికానికీ వర్తిస్తాయ’ని ఒక నోటిఫికేషన్‌లో తెలియజేసింది. ఈ ప్రకారంగా సుకన్య సమృద్ధి పథకం కింద చేసే డిపాజిట్‌కు 8.2 శాతం వడ్డీ రేటు ఉంటుంది. మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లకు 7.1 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది. పీపీఎఫ్, పోస్టాఫీస్‌ పొదుపు డిపాజిట్లకు వడ్డీ రేట్లు కూడా ఎలాంటి మార్పు లేకుండా వరుసగా 7.1 శాతం, 4 శాతంగా ఉండనున్నాయి. కిసాన్‌ వికాస్‌ పత్ర పథకానికి వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంటుంది. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ పథకానికి జులై- సెప్టెంబరు (2024)లో ప్రస్తుతం మాదిరే 7.7 శాతం వడ్డీని చెల్లించనున్నారు. 

జాతీయ పింఛన్‌ పథకం (ఎన్‌పీఎస్‌) చందాదార్లకు జులై 1 నుంచి టీ+0 సెటిల్‌మెంట్‌ విధానాన్ని (అదే రోజు చెల్లింపు) అమలు చేసేందుకు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అనుమతినిచ్చింది. ‘ఏ సెటిల్‌మెంట్‌ రోజైనా ట్రస్టీ బ్యాంక్‌కు ఉదయం 11 గంటల వరకు చేరిన ఎన్‌పీఎస్‌ చందాను అదే రోజు మదుపు చేస్తారు. చందాదార్లకు అదే రోజు ఉన్న ఎన్‌ఏవీ (నెట్‌ అసెట్‌ వ్యాల్యూ) ప్రయోజనం లభిస్తుంద’ని పీఎఫ్‌ఆర్‌డీఏ ఒక ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని