సంక్షిప్త వార్తలు(7)

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. జులై 3 నుంచి మొబైల్‌ సేవల టారిఫ్‌లను 12-27 శాతం పెంచుతున్నట్లు రిలయన్స్‌ జియో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం.

Updated : 29 Jun 2024 12:48 IST

రిలయన్స్‌ @ రూ.21 లక్షల కోట్లు

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. జులై 3 నుంచి మొబైల్‌ సేవల టారిఫ్‌లను 12-27 శాతం పెంచుతున్నట్లు రిలయన్స్‌ జియో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం. బీఎస్‌ఈలో ఇంట్రాడేలో 3.27% పెరిగిన షేరు రూ.3,161.45 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.31 శాతం లాభంతో రూ.3,131.85 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 షేర్లలో ఎక్కువగా లాభపడిన షేరు ఇదే. ట్రేడింగ్‌ ముగిసేసరికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.47,777.47 కోట్లు పెరిగి రూ.21.18 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 21.16 శాతం దూసుకెళ్లింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న రూ.20 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను సాధించిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌ తర్వాత ఎక్కువ మార్కెట్‌ విలువ ఉన్న కంపెనీల్లో టీసీఎస్‌ (రూ.14.12 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (రూ.12.80 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌ (రూ.8.44 లక్షల కోట్లు), భారతీ ఎయిర్‌టెల్‌ (రూ.8.22 లక్షల కోట్లు) ఉన్నాయి.


కిమ్స్‌ హాస్పిటల్స్‌ షేర్ల విభజన 

ఈనాడు, హైదరాబాద్‌: కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్టా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ఈక్విటీ షేర్లను విభజించాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో షేరు ముఖ విలువ రూ.10 కాగా, దీన్ని రూ.2 ముఖ విలువ గల 5 షేర్లుగా విభజిస్తారు. వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో వాటాదార్ల అనుమతి తీసుకొని ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. షేరు విభజించటం వల్ల లిక్విడిటీ పెరుగుతుంది. ఎక్కువ మంది మదుపరులు క్రయవిక్రయాలు సాగించేందుకు వీలు కలుగుతుంది.  


కేంద్రం అప్పులు రూ.171.78 లక్షల కోట్లు

ఆర్థిక శాఖ వెల్లడి 

దిల్లీ: మార్చి 2024 చివరికల్లా కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.171.78 లక్షల కోట్లకు పెరిగాయని ప్రభుత్వ అప్పుల నిర్వహణ త్రైమాసిక నివేదిక(జనవరి-మార్చి 2024) పేర్కొంది. డిసెంబరు చివర్లోని రూ.166.14 కోట్లతో పోలిస్తే ఇవి 3.4 శాతం అధికమని ఆర్థిక శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో వాణిజ్య బ్యాంకుల వాటా 37.7%గా ఉన్నాయి. ఇక బీమా కంపెనీల వాటా 26%, ఎఫ్‌పీఐల వాటా 2.3 శాతంగా నమోదైంది. ఆర్‌బీఐ వాటా 12.3 శాతానికి పరిమితమైంది.


ఎల్‌ఎఫ్‌ఎస్‌ బ్రోకింగ్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు 

ఎండీపై 5 ఏళ్ల నిషేధం 

దిల్లీ: ఎల్‌ఎఫ్‌ఎస్‌ బ్రోకింగ్‌ రిజిస్ట్రేషన్‌ను మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ రద్దు చేసింది. ఆ కంపెనీ ఎండీ సయ్యద్‌ జియాజుర్‌ రెహమాన్‌ను ఏ నమోదిత ఇంటర్మీడియటరీలో చేరకుండా లేదా సంబంధాలు ఉండకుండా 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఎల్‌ఎఫ్‌ఎస్‌ బ్రోకింగ్‌కు ఉన్న స్టాక్‌బ్రోకర్, పోర్ట్‌ఫోలియో మేనేజర్, డిపాజిటరీ పార్టిసిపెంట్, రీసెర్చ్‌ అనలిస్ట్‌.. రిజిస్ట్రేషన్లన్నింటినీ సెబీ రద్దు చేసింది. ‘రెహమాన్‌ నిజాయతీ, నైతికత, విలువలతో కానీ, న్యాయంగా కానీ వ్యవహరించలేదు. మార్కెట్‌ నిబంధనలను ఉల్లంఘించార’ని 56 పేజీల ఆదేశాల్లో సెబీ పేర్కొంది. నిధులను అక్రమ పద్ధతుల్లో మళ్లించి మదుపర్లను మోసం చేశారనీ తెలిపింది. ఇక ఎల్‌ఎఫ్‌ఎస్‌ బ్రోకింగ్‌ తన రిజిస్ట్రేషన్‌ను దుర్వినియోగం చేసి ఎల్‌ఎఫ్‌ఎస్‌-పీఎమ్‌ఎస్, మరో రిజిస్టర్‌కాని సంస్థ ఎమ్‌ఓఎల్‌ కమొడిటీస్‌ను ప్రమోట్‌ చేసిందని సెబీ దర్యాప్తులో వెల్లడైంది.


సిగ్నిటీలో మెజార్టీ వాటా కొనుగోలుకు కోఫోర్జ్‌కు సీసీఐ అనుమతి 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ టెస్టింగ్‌ సేవల సంస్థ అయిన సిగ్నిటీ టెక్నాలజీస్‌లో మెజార్టీ వాటా కొనుగోలు చేయటానికి కోఫోర్జ్‌ లిమిటెడ్‌కు మార్గం సుగమం అయింది. ఈ ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అనుమతి ఇచ్చింది. సిగ్నిటీలో ప్రమోటర్లు, కొందరు ఇతర వాటాదార్ల నుంచి 54 శాతం వాటా కొనుగోలు చేయటానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోఫోర్జ్‌ మే 2న ప్రకటించిన విషయం విదితమే. తదనంతరం సెబీ నిబంధనల ప్రకారం సిగ్నిటీలోని సాధారణ వాటాదార్ల నుంచి మరో 25 శాతం వాటాను రూ.1,415 షేరు ధరకు కొనుగోలు చేయటానికి ‘ఓపెన్‌ ఆఫర్‌’ కూడా ప్రకటించింది. అదే సమయంలో దీనికి కాంపిటీషన్‌ చట్టం ప్రకారం సీసీఐ నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసింది. సీసీఐ నుంచి ఈ నెల 25న అనుమతి వచ్చినట్లు తాజాగా కోఫోర్జ్‌ లిమిటెడ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది.


యూకే కంపెనీని కొనుగోలు చేసిన అరబిందో ఫార్మా 

ఈనాడు, హైదరాబాద్‌: యూకేలోని ఏస్‌ లేబొరేటరీస్‌ అనే సంస్థను అరబిందో ఫార్మా సొంతం చేసుకుంది. నెదర్లాండ్స్‌లోని తన స్టెప్‌-డౌన్‌ సబ్సిడరీ కంపెనీ అయిన ఎజైల్‌ ఫార్మా బీవీ ద్వారా ఏస్‌ లేబొరేటరీస్‌ 100 శాతం ఈక్విటీని రూ.17.91 కోట్లకు కొనుగోలు చేసినట్లు అరబిందో ఫార్మా శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. ఏస్‌ లేబొరేటరీస్‌ కెమికల్, బయోలాజికల్‌ మందులకు క్వాలిటీ కంట్రోల్, టెస్టింగ్‌- అనలైటికల్‌ డెవలప్‌మెంట్‌ సేవలు అందిస్తోంది. ఈ సంస్థ జూన్‌ 30, 2023తో ముగిసిన 12 నెలల కాలానికి రూ.8.95 కోట్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించింది. మరోపక్క, అరబిందో ఫార్మాకు చెందిన యూగియా ఎస్‌ఈజడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే స్టెప్‌-డౌన్‌ సబ్సిడరీకి హైదరాబాద్‌ సమీపంలోని జడ్చర్ల వద్ద ఉన్న ఇంజక్టబుల్‌ ఔషధాల యూనిట్‌ను యూఎస్‌ఎఫ్‌డీఏ బృందం నాలుగు నెలల క్రితం తనిఖీ చేసింది. ఈ యూనిట్‌కు తాజాగా యూఎస్‌ఎఫ్‌డీఏ వీఏఐ(వలంటరీ యాక్షన్‌ ఇండికేటెడ్‌)గా వర్గీకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని