అదానీ రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూపు తన వ్యాపార కంపెనీల్లో రూ.1.3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని ప్రణాళికగా పెట్టుకుంది.

Published : 26 Jun 2024 02:15 IST

2024-25లో గ్రూపు కంపెనీలపై  వెచ్చించాలని ప్రణాళిక: సీఎఫ్‌ఓ

అహ్మదాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూపు తన వ్యాపార కంపెనీల్లో రూ.1.3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని ప్రణాళికగా పెట్టుకుంది. ఓడరేవుల దగ్గర నుంచి ఇంధనం, విమానాశ్రయాలు, కమొడిటీలు, సిమెంటు, మీడియా.. ఇలా పలు వ్యాపారాలను అదానీ గ్రూపు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాపారాల వృద్ధి నిమిత్తం రాబోయే 7-10 ఏళ్లలో 100 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8,30,000 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టాలని ఇప్పటికే అదానీ గ్రూపు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఈ నిధులను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 70 శాతం నిధులను అంతర్గతంగా సమీకరించనుండగా.. మిగిలిన మొత్తం రుణ రూపేణా ఉంటుందని అదానీ గ్రూపు ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ) జుగేషిందర్‌ రాబీ సింగ్‌ తెలిపారు. ఈ ఏడాదిలో గడువు తీరిపోనున్న 3-4 బిలియన్‌ డాలర్ల రుణాన్ని కూడా రీఫైనాన్స్‌ చేసేందుకు గ్రూపు యోచన చేస్తోందని పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ కింద 1 బిలియన్‌ డాలర్ల రుణాన్ని తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది పలు ప్రాజెక్టుల్లో చాలా వరకు పూర్తవుతాయని సింగ్‌ తెలిపారు. పునరుత్పాదక విద్యుత్‌ సంస్థ అదానీ గ్రీన్‌ 6-7 గిగావాట్ల ప్రాజెక్టును పూర్తి చేయనుండగా.. సోలార్‌ వేఫర్‌ తయారీ యూనిట్‌ కార్యకలాపాలూ మొదలయ్యాయి. ముంబయిలో కొత్త విమానాశ్రయం కూడా పూర్తవుతుందని ఆయన తెలిపారు.  

పునరుత్పాదక విద్యుత్‌పై రూ.2 లక్షల కోట్లు: 2030 నాటికి అదనంగా 40 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించేందుకు రూ.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూపు భావిస్తోంది. ప్రస్తుతం సౌర, పనవ విద్యుత్‌ లాంటి పునరుత్పాదక మార్గాల ద్వారా 10 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఏటా 6-7 గిగావాట్ల మేర పెంచుతూ 2030 కల్లా తన మొత్తం పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యాన్ని 50 గిగావాట్లకు చేర్చనుంది. ఒక్కో మెగావాట్‌కు రూ.5 కోట్లు చొప్పున ఖర్చవుతుందని భావించి 40 గిగావాట్లకు రూ.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నట్లు అదానీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాగర్‌ అదానీ తెలిపారు. 2030 కల్లా తొలివిడతలో కనీసం 5000 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు (పీఎస్‌పీ) సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగ్‌ తెలిపారు. తొలి 500 మెగావాట్ల పీఎస్‌పీ నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభం అయ్యిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని