సత్వ గ్రూప్‌ రూ.12,000-14,000 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్‌లో 2.5 కోట్ల చదరపు అడుగుల వాణిజ్య నిర్మాణాల్ని పూర్తి చేసిన స్థిరాస్తి సంస్థ సత్వ గ్రూప్‌ వచ్చే మూడేళ్లలో రూ.12,000-14,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు తెలిపింది.

Published : 26 Jun 2024 02:13 IST

రీట్‌ను ప్రారంభించేందుకు బ్లాక్‌స్టోన్‌తో చర్చలు

బెంగళూరు: హైదరాబాద్‌లో 2.5 కోట్ల చదరపు అడుగుల వాణిజ్య నిర్మాణాల్ని పూర్తి చేసిన స్థిరాస్తి సంస్థ సత్వ గ్రూప్‌ వచ్చే మూడేళ్లలో రూ.12,000-14,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు తెలిపింది. హైటెక్‌ సిటీలో మరో 30 లక్షల చదరపు అడుగుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. హౌసింగ్, కార్యాలయాలు, హోటల్‌ ప్రాజెక్టుల్లో తాజా పెట్టుబడులను వినియోగించనుంది. అలాగే వాణిజ్య ఆస్తుల నగదీకరణ కోసం రీట్‌ (రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌)ను ప్రారంభించేందుకు దిగ్గజ పీఈ (ప్రైవేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) సంస్థ బ్లాక్‌స్టోన్‌తో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సత్వ గ్రూప్‌ ఇప్పటికే 140 ప్రాజెక్టులు పూర్తి చేసింది. గత 30 ఏళ్లలో 8 కోట్ల చ.అ.  నిర్మాణాలు చేపట్టింది. 2.3 కోట్ల చ.అ. స్థలంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. మరో 6.5 కోట్ల చ.అ. మేర ప్రాజెక్టులు భవిష్యత్‌లో రాబోతున్నాయి. వచ్చే 2-3 ఏళ్లలో తమ కోవర్కింగ్, కోలివింగ్‌ వ్యాపారాలను పబ్లిక్‌ ఇష్యూకు తీసుకొచ్చి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయబోతున్నామని సత్వ గ్రూప్‌ ఎండీ బిజయ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. సింప్లీవర్క్, కోలివ్‌ రెండింటిలో సత్వ గ్రూప్‌నకు 50 శాతానికి పైగా వాటా ఉంది. రీట్‌ ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్న బ్లాక్‌స్టోన్‌తో కలిపి 3.2 కోట్ల చ.అ. సంయుక్త పోర్ట్‌ఫోలియోను సత్వ గ్రూప్‌ నిర్వహిస్తోంది. ఇందులో ఇప్పటికే 1.8 కోట్ల చ.అ. ప్రాజెక్టుల్ని పూర్తి చేసింది.

రూ.650 కోట్లు సమీకరించిన మైండ్‌స్పేస్‌ రీట్‌: సస్టెయినబిలిటీ లింక్డ్‌ బాండ్లను ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు జారీ చేసి మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌ రూ.650 కోట్ల నిధుల్ని సమీకరించింది. ప్రస్తుత రుణాలను రీఫైనాన్స్‌ చేసేందుకు ప్రధానంగా ఈ నిధులను వినియోగించనున్నట్లు  ఎక్స్ఛేంజీలకు మైండ్‌స్పేస్‌ రీట్‌ సమాచారమిచ్చింది. ఈ బాండ్లు ఏడేళ్ల కాల వ్యవధితో జారీ చేసింది. కె.రహేజా గ్రూప్‌ స్పాన్సర్‌ చేసిన సంస్థే మైండ్‌స్పేస్‌ రీట్‌. ఇది 3.32 కోట్ల చదరపు అడుగుల పోర్ట్‌ఫోలియో కలిగి ఉండగా, ఇందులో 2.63 కోట్ల చ.అ. నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని