అధిక ద్రవ్యోల్బణ ప్రభావం గ్రామీణులపైనే ఎక్కువ

కొవిడ్‌-19 తర్వాత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకున్న మాదిరే భారత ద్రవ్యోల్బణం పుంజుకోవడమూ ‘కె- ఆకారం’లోనే సాగుతోందని, కొన్ని రంగాలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని విదేశీ బ్రోకరేజీ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ విశ్లేషించింది.

Published : 26 Jun 2024 02:11 IST

హెచ్‌ఎస్‌బీసీ విశ్లేషణ

దిల్లీ: కొవిడ్‌-19 తర్వాత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకున్న మాదిరే భారత ద్రవ్యోల్బణం పుంజుకోవడమూ ‘కె- ఆకారం’లోనే సాగుతోందని, కొన్ని రంగాలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని విదేశీ బ్రోకరేజీ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ విశ్లేషించింది. పట్టణాల్లోని వారితో పోలిస్తే గ్రామీణ వినియోగదారులపై ఈ అధిక ధరల ప్రభావం ఎక్కువగా ఉందని హెచ్‌ఎస్‌బీసీ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అధిక ఆహార ద్రవ్యోల్బణం వల్ల పట్టణ ప్రాంతం కంటే గ్రామీణ ప్రాంత ద్రవ్యోల్బణం 1.1 శాతం ఎక్కువగా ఉందని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, పంటలు దెబ్బతినడం వల్ల ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం అధిక ద్రవ్యోల్బణానికి దారి తీసిందని హెచ్‌ఎస్‌బీసీ నివేదిక తెలిపింది. ‘కొన్ని ఇంధన ధరలను తగ్గించడం ద్వారా అధిక ద్రవ్యోల్బణం నుంచి కొంత మేర ఊరటను ప్రభుత్వం కల్పించింది. అయితే పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ లాంటి ఇంధనాల వినియోగం పట్టణ ప్రాంతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలో తక్కువగానే ఉంటుంది. పట్టణాల్లో కంటే గ్రామాల్లో ద్రవ్యోల్బణం అధికంగా నమోదవ్వడానికే ఇది కారణమ’ని ఆ నివేదికలో పేర్కొంది. వర్షాలు పుంజుకోకుంటే.. ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించే అవకాశాలూ ఉండవని తెలిపింది. ‘జులై, ఆగస్టులో సాధారణ వర్షపాతం నమోదుకాకుంటే.. 2024లో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పరిస్థితి 2023 కంటే కూడా అధ్వానంగా మారొచ్చ’ని వివరించింది. ఒకవేళ వర్షపాతం మెరుగ్గా నమోదైతే.. ద్రవ్యోల్బణం గణనీయంగా దిగిరావచ్చు. దీంతో ఆర్‌బీఐ కూడా కీలక రేట్లను తగ్గించే అవకాశం ఉంది. 2025 మార్చి కల్లా కనీసం 0.50 శాతం మేర రెపో రేటును తగ్గించే వీలుంటుందని నివేదిక అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని