సంక్షిప్త వార్తలు

ఇప్పటికే జౌళి రంగం కోసం రూ.10,000 కోట్లకు పైగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం.. త్వరలో వస్త్ర రంగానికి సైతం ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోందని జౌళి మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Published : 26 Jun 2024 02:11 IST

వస్త్ర రంగానికీ పీఎల్‌ఐ పథకం! 

దిల్లీ: ఇప్పటికే జౌళి రంగం కోసం రూ.10,000 కోట్లకు పైగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం.. త్వరలో వస్త్ర రంగానికి సైతం ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోందని జౌళి మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు. మంగళవారమిక్కడ జరిగిన ఇండియా ఇంటర్నేషనల్‌ గార్మెంట్‌ ఫెయిర్‌(ఐఐజీఎఫ్‌)ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘భారీ అవకాశాలు మన ముందున్నాయి. రాబోయే కొద్ది సంవత్సరాల్లో 50 బి.డాలర్ల (సుమారు రూ.4.15 లక్షల కోట్లు) విలువైన ఎగుమతులను పరిశ్రమ తన లక్ష్యంగా పెట్టుకోవాల’ని సూచించారు. అయిదేళ్ల కాలానికి గాను రూ.10,683 కోట్ల పీఎల్‌ఐ పథకాన్ని జౌళి రంగం కోసం 2021లో ఆమోదం తెలిపిన విషయం విదితమే. ప్రస్తుతం భారత జౌళి పరిశ్రమ మార్కెట్‌ పరిమాణం 165 బి.డాలర్లుగా ఉందని.. దీనిని 350 బి.డాలర్లకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.


అధిక వడ్డీ రేట్లు వృద్ధికి అడ్డుపడట్లేదు: దాస్‌

ముంబయి: అధిక వడ్డీ రేట్లు వృద్ధికి అవరోధంగా నిలవట్లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని కిందకు తీసుకొని రావడం పైనే పరపతి విధాన కమిటీ ప్రధానంగా దృష్టి సారిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం దేశం తన వృద్ధి పథంలో కీలక వ్యవస్థాగత మార్పు దిశగా వెళ్తోంది. సుస్థిరమైన 8 శాతం వృద్ధిని సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఒకవేళ వృద్ధి స్థిరంగా ఉండి, మంచి వృద్ధిని నమోదు చేస్తే.. అప్పుడు పరపతి విధానం, వడ్డీ రేట్లు వృద్ధికి అవరోధంగా నిలవబోవన్నది స్పష్టమైన సంకేతమ’ని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దాస్‌ తెలిపారు. వడ్డీ రేట్లను తగ్గించాలనే ఉద్దేశంతో వృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారనడం సరికాదని తెలిపారు. అలాంటి ఆందోళనలు అక్కర్లేదని, వృద్ధి జోరు ప్రతి నెలా కొనసాగుతోందని వెల్లడించారు. వృద్ధిపై సానుకూల అంచనాలు ఉన్నప్పుడు ద్రవ్యోల్బణంపై దృష్టి సారించేందుకు అవసరమైన వెసులుబాటు తమకు లభిస్తుందని పేర్కొన్నారు.


తొలి రోజు స్పెక్ట్రమ్‌ వేలంలో రూ.11,000 కోట్ల విలువైన బిడ్‌లు

దిల్లీ: స్పెక్ట్రమ్‌ వేలం తొలి రోజున రూ.11,000 కోట్ల విలువైన బిడ్‌లను టెలికాం సంస్థలు సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఐదు రౌండ్లలో బిడ్డింగ్‌ ప్రక్రియ జరిగినట్లు తెలిపాయి. ప్రభుత్వం రూ.96,238 కోట్ల విలువైన 10,500 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను వేలానికి ఉంచింది. ‘తొలి రోజు టెలికాం సంస్థలు సుమారు రూ.11,000 కోట్ల విలువైన బిడ్‌లను వేశాయి. బుధవారం వేలం పునఃప్రారంభం అవుతుంద’ని ఈ పరిణామాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు తెలిపాయి. టెలికాం విభాగం(డాట్‌) జారీ చేసిన నివేదిక ప్రకారం.. మొదటి రోజు ప్రధానంగా 900 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్‌ల విభాగంలో బిడ్‌లు వచ్చాయి. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాలు ఈ వేలంలో పాల్గొంటున్నాయి.


ఎన్‌టీపీసీ రూ.12,000 కోట్ల సమీకరణ ప్రణాళికలు

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీలు) ద్వారా రూ.12,000 కోట్ల వరకు సమీకరించనుంది. ఈ నెల 29న జరగనున్న బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనను డైరెక్టర్లు పరిశీలించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. గత నెలలో ప్రకటించిన 2023-24 నాలుగో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ రూ.6,490 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.4,871.5 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 33 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.44,253.17 కోట్ల నుంచి 7.6 శాతం వృద్ధితో రూ.47,622.06 కోట్లకు చేరింది.


సిద్స్‌ ఫామ్‌కు  రూ.83 కోట్ల పెట్టుబడులు

దిల్లీ: డెయిరీ రంగంలోని హైదరాబాద్‌ అంకురం సిద్స్‌ ఫామ్‌ రూ.83 కోట్ల మేరకు పెట్టుబడులను సమీకరించింది. ఓమ్నివోర్, నరోత్తమ్‌ శిఖారియా ఫ్యామిలీ ఆఫీస్‌(ఎన్‌ఎస్‌ఎఫ్‌ఓ) ఈ పెట్టుబడులను అందించినట్లు సిద్స్‌ ఫామ్‌ మంగళవారం వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు, బెంగళూరులో విస్తరించేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపింది. నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. దీంతోపాటు ఈ రంగంలో నైపుణ్యం ఉన్న వారిని నియమించుకుంటామని తెలిపింది. తాజా, ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందించేందుకు తమ విస్తరణ ప్రణాళికకు ఈ నిధులు వినియోగించుకుంటామని సిద్స్‌ ఫామ్‌ వ్యవస్థాపకుడు కిశోర్‌ ఇందుకూరి వెల్లడించారు. రెండు నగరాల్లో ప్రస్తుతం 25,000 మంది వినియోగదారులకు సేవలు అందిస్తున్నామని, లక్ష మందికి చేరువయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు