కార్డ్‌ నెట్‌వర్క్‌ ఎంపిక.. వినియోగదార్ల ఇష్టం

డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల జారీ సమయంలో కార్డ్‌ నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకునే అవకాశం అర్హులైన వినియోగదార్లకు కల్పించాలని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశించింది.

Updated : 07 Mar 2024 08:05 IST

బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం
ప్రస్తుత ఖాతాదార్లు రెన్యువల్‌ సమయంలో మార్చుకోవచ్చు

దిల్లీ: డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల జారీ సమయంలో కార్డ్‌ నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకునే అవకాశం అర్హులైన వినియోగదార్లకు కల్పించాలని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశించింది. కార్డ్‌ల వినియోగదారులకు ఈ నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది. వినియోగదార్లు ఇతర కార్డ్‌ నెట్‌వర్క్‌ల సేవలను పొందకుండా షరతులు విధించే కార్డ్‌ నెట్‌వర్క్‌లతో ఒప్పందాలు కుదుర్చుకోవద్దని కూడా క్రెడిట్‌ కార్డులు జారీ చేసే సంస్థలకు ఆర్‌బీఐ సూచించింది. ‘కార్డ్‌ నెట్‌వర్క్‌లు, కార్డ్‌లను జారీ సంస్థల మధ్య కుదురుతున్న కొన్ని రకాల ఒప్పందాల వల్ల, వినియోగదార్లు కార్డు నెట్‌వర్క్‌లను ఎంపిక చేసుకోవడానికి ప్రతిబంధకం అవుతున్నట్లు’ ఆర్‌బీఐ పేర్కొంది. చెల్లింపుల వ్యవస్థ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాజా ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత కార్డు వినియోగదార్లు, వాటి కాలావధి పూర్తయ్యాక..రెన్యువల్‌ చేసుకునే సమయంలో కావాల్సిన కార్డ్‌ నెట్‌వర్క్‌లను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే ఉన్న ఒప్పందాల్లో సవరణ లేదా రెన్యువల్‌ సమయంలోనూ, కొత్తగా ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఈ మార్గదర్శకాలను కార్డ్‌ జారీ సంస్థలు, నెట్‌వర్క్‌లు తప్పనిసరిగా పాటించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

  • ఇప్పటివరకు 10 లక్షలు అంతకంటే తక్కువ క్రెడిట్‌ కార్డులను జారీ చేసిన సంస్థలకు ఈ ఆదేశాలు వర్తించవు.
  • తమ సొంత అధీకృత కార్డ్‌ నెట్‌వర్క్‌ ద్వారా క్రెడిట్‌ కార్డులను జారీ చేసే సంస్థలకు కూడా ఈ ఆదేశాల నుంచి మినహాయింపు కల్పించారు. నీ అర్హులైన వినియోగదార్లకు కార్డు నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఆరు నెలల్లోగా అమల్లోకి తేవాలని ఆర్‌బీఐ పేర్కొంది.

వివిధ కార్డ్‌ నెట్‌వర్క్‌లు ఇవీ

  • అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంకింగ్‌ కార్ప్‌
  • డైనర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌
  • మాస్టర్‌ కార్డ్‌ ఏషియా/ పసిఫిక్‌ పీటీఈ లిమిటెడ్‌
  • నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-రూపే
  • వీసా వరల్డ్‌వైడ్‌ పీటీఈ లిమిటెడ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని