Foreign investors: 3 వారాల్లో ₹44500 కోట్ల విదేశీ పెట్టుబడులు

జులై నుంచి భారత ఈక్విటీ మార్కెట్‌పై తిరిగి ఆసక్తి కనబరుస్తున్న విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులను కుమ్మరిస్తున్నారు....

Published : 21 Aug 2022 12:27 IST

దిల్లీ: జులై నుంచి భారత ఈక్విటీ మార్కెట్‌పై తిరిగి ఆసక్తి కనబరుస్తున్న విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులను కుమ్మరిస్తున్నారు. ఆగస్టులో ఇప్పటి వరకు రూ.44,500 కోట్లను భారత మార్కెట్‌లోకి మళ్లించారు. అమెరికాలో ద్రవ్యోల్బణం క్రమంగా కిందకు దిగిరావడం, డాలర్‌ ఇండెక్స్‌ పడిపోవడం వంటి కారణాలు ఎఫ్‌ఐఐల కొనుగోళ్లకు ప్రధాన కారణం. జులై మొత్తంలో రూ.5,000 కోట్ల విలువ చేసే కొనుగోళ్లు మాత్రమే చేపట్టిన మదుపర్లు ఆగస్టులో జోరును పెంచారు.

వరుసగా తొమ్మిది నెలల పాటు భారత్‌ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకున్న ఎఫ్ఐఐలు.. జులైలో మొదటిసారి నికర కొనుగోలుదారులుగా నిలిచారు. 2021 అక్టోబరు - 2022 జూన్‌ మధ్య రూ.2.46 లక్షల కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అయితే, ద్రవ్యోల్బణ భయాలు క్రమంగా కనుమరుగవుతుండడం; బలమైన కార్పొరేట్‌ ఫలితాలు; కఠిన ద్రవ్య విధాన వైఖరిలో సానుకూల మార్పు వంటి పరిణామాలు రానున్న రోజుల్లో ఎఫ్‌ఐఐల పెట్టుబడులను మరింత ఆకర్షించడానికి దోహదం చేస్తాయని కొటాక్‌ సెక్యూరిటీస్‌లో ఈక్విటీ రీసెర్చ్‌ (రిటైల్‌) విభాగాధిపతి శ్రీకాంత్‌ చౌహాన్‌ అభిప్రాయపడ్డారు.

మరోవైపు డాలర్‌ కదలికలపైనే ఎఫ్‌ఐఐల పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వి.కె.విజయ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు విదేశీ మదుపర్ల పెట్టుబడుల వెల్లువ ప్రారంభమైన తర్వాతే.. మార్కెట్లలో లాభాల జోరు ఆరంభమైందని పేర్కొన్నారు. భారత్‌తో పాటు ఇండోనేషియా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌ వంటి వర్ధమాన మార్కెట్లలోకి కూడా విదేశీ పెట్టుబడులు జోరందుకున్నాయి. ఫిలిప్పైన్స్‌, తైవాన్‌లోకి మాత్రం ఎఫ్‌ఐఐలు ఇంకా తిరోగమన బాటలోనే ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని