స్టీవ్‌ జాబ్స్‌తో కలిసి పనిచేసిన ఆ రోజులు మరిచిపోలేను: ఐఫోన్‌ మాజీ డిజైనర్‌

Steve Jobs: యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ నాయకత్వంలో పనిచేసిన రోజులు అద్భుతమైనవంటూ ఐఫోన్‌ మాజీ డిజైనర్‌ జోనీ ఐవ్‌ అన్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన స్టీవ్‌తో పనిచేసిన క్షణాల్ని గుర్తుకు తెచ్చుకున్నారు.

Updated : 04 Jul 2024 19:36 IST

Steve Jobs | ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘మేనేజ్‌మెంట్‌ అంటే.. ఉద్యోగులు చేయొద్దనుకున్న పనుల్ని ఎలాగైనా చేయించడం. ‘నేనెప్పటికీ చేయలేను’ అనుకునే వ్యక్తుల్లోనూ స్ఫూర్తి రగిలించి వారిని ప్రోత్సహించి ముందుకు నడిపించడం’’.. యాపిల్‌ (Apple) సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ (Steve Jobs) చెప్పిన మాటలివి. కేవలం మాటల్లోనే కాదు తన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లోనూ ఇలాంటి స్ఫూర్తి నింపుతూ ముందుకెళ్లారాయన. అందుకే స్టీవ్‌ జాబ్స్‌ సారథ్యంలో పనిచేసిన చాలా మంది ఉద్యోగులు ఆయనతో తమకు ఉన్న అనుభవాల్ని  పంచుకుంటుంటారు. తాజాగా ఐఫోన్‌ మాజీ డిజైనర్‌ జోనీ ఐవ్‌ కూడా నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు.

తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జోనీ ఐవ్‌.. స్టీవ్‌ జాబ్స్‌తో కలిసి యాపిల్‌లో పనిచేసిన కాలం తన జీవితంలో అత్యంత సంతృప్తికరమైందని చెప్పారు. తాను పనిచేసిన 15 ఏళ్లూ అసాధారణమైనవని పేర్కొన్నారు. 1992లో యాపిల్‌లో చేరగా.. దాదాపు ఐదేళ్ల తర్వాత స్టీవ్‌తో కలిసి పని చేసే ఛాన్స్‌ వచ్చిందన్నారు. వారిద్దరూ కలిసి పనిచేసిన మొదటి రోజు యాపిల్‌ డిజైన్‌ గురించి చర్చించిన విషయాన్ని షేర్‌ చేసుకుంటూ.. ‘‘స్టీవ్‌ జాబ్స్‌ నాయకత్వంలో ఏదైనా విషయాన్ని నేర్చుకోవడం విభిన్నంగా ఉండేది. అభ్యాసన ప్రక్రియ ఎంతో ఏకాగ్రతతో జరిగేది. సంక్లిష్టమైన ఆలోచనలు, భావాల్ని చాలా సులువుగా అందరికీ అర్థమయ్యేలా వివరించగలిగే అసాధారణ ప్రతిభ ఆయన సొంతం’’ అని స్టీవ్‌లోని నాయకత్వ పటిమను కొనియాడారు. తాను కలిసిన వారిలో స్టీవ్‌ జాబ్స్‌ ఓ అద్భుతమైన వ్యక్తి అన్నారు.

టీమ్‌ఇండియా కోసం ఆ విమానం పంపారా?.. ఎయిరిండియాను ఆరాతీసిన డీజీసీఏ

2011లో స్టీవ్‌ మరణం తనను వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని ఐవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్టీవ్‌ గురించి ఆలోచించని రోజు, ఆయనకు కృతజ్ఞతలు తెలపని క్షణమంటూ లేదని చెప్పుకొచ్చారు. జోనీ ఐవ్‌ గతంలో యాపిల్‌లో చీఫ్‌ డిజైన్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. మ్యాక్‌బుక్‌, ఐఫోన్‌, ఐప్యాడ్‌, యాపిల్‌ వాచ్‌.. వంటి ఉత్పత్తులను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 25 ఏళ్ల వయసులోనే యాపిల్‌లో చేరిన ఆయన స్టీవ్‌తో కలిసి కంపెనీ కొత్త ఆవిష్కరణలు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. తర్వాత 2019లో శాన్ ఫ్రాన్సిస్కోలో సొంతంగా డిజైన్ సంస్థ లవ్‌ఫ్రమ్‌ను నెలకొల్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని