Shein brand: జుడియో, మింత్రాకు పోటీగా.. భారత్‌లోకి షీయెన్‌ బ్రాండ్ రీఎంట్రీ!

Shein brand: దేశీయ ఫాస్ట్‌ ఫ్యాషన్‌ మార్కెట్లోకి చైనాకు చెందిన షీయెన్‌ బ్రాండ్‌ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఏడాదిక్రితం ఈమేరకు రిలయన్స్‌తో ఆ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Published : 04 Jul 2024 16:18 IST

Shein brand | ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన ఫాస్ట్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ షీయెన్‌.. మళ్లీ భారత్‌లోకి అడుగుపెట్టనుంది. రిలయన్స్‌ రిటైల్ వెంచర్స్‌తో ఏడాదిక్రితం కుదిరిన ఒప్పందం నేపథ్యంలో మరికొన్ని వారాల్లో ఈ బ్రాండ్‌ దుస్తులు మళ్లీ దర్శనమివ్వనున్నాయి. రిలయన్స్ రిటైల్‌ సంస్థ వీటిని ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ స్టోర్లలో విక్రయించనుంది. దేశీయంగా ఈ ఫాస్ట్‌ ఫ్యాషన్‌ విభాగంలో మింత్రా, టాటా గ్రూపునకు చెందిన జుడియో ఆధిపత్యం కొనసాగుతోంది. ఈనేపథ్యంలో షెయిన్‌ బ్రాండ్‌ను రిలయన్స్‌ తీసుకొస్తుండడం గమనార్హం. ఈ విభాగంలో షీయెన్‌ ఇప్పటికే గ్లోబల్‌ లీడర్‌గా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన షీయెన్‌ బ్రాండ్‌ను క్రిస్‌ జు 2008లో చైనాలో స్థాపించారు. భారత్‌తో పాటు ప్రపంచదేశాల్లో ఈ దుస్తులు బాగా ప్రాచుర్యం పొందాయి. 2020లో చైనాతో సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో ఈ బ్రాండ్‌ను భారత్‌ నిషేధించింది. సరిగ్గా నాలుగేళ్ల విరామం తర్వాత రిలయన్స్‌ రిటైల్‌ భాగస్వామ్యంతో ఈ బ్రాండ్‌ మళ్లీ భారత్‌లోకి అడుగుపెట్టనుంది.

బజాజ్‌ నుంచి సీఎన్‌జీ బైక్‌.. రిలీజ్‌కు ముందే వివరాలు లీక్!

దేశీయంగా ఈ బ్రాండ్‌ కార్యకలాపాలన్నీ రిలయన్స్‌ రిటైలే చూడనుంది. షెయిన్‌ ఎలాంటి పెట్టుబడులూ పెట్టడం లేదు. కంపెనీ లాభాల్లో వాటా మాత్రమే లైసెన్సు ఫీజుగా రిలయన్స్‌ చెల్లించనుంది. డేటా కూడా దేశీయంగానే స్టోర్‌ చేస్తారు. దీనిపై షీయెన్‌కు ఎలాంటి కంట్రోల్‌ ఉండదు. దేశీయంగా ఫాస్ట్‌ ఫ్యాషన్‌ మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం 10 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఈ వ్యాపారం.. 2030-31 నాటికి 50 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుత ఫ్యాషన్‌ ట్రెండ్స్‌కు అనుగుణంగా తక్కువ సమయంలోనే దుస్తులు రూపొందించి, వాటిని అందుబాటు ధరల్లో విక్రయించడం ఈ ఫాస్ట్‌ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ముఖ్య ఉద్దేశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని