EV sales: జూన్‌లో తగ్గిన ఈవీ విక్రయాలు.. కారణం ఇదేనా..?

EV sales: దేశంలో జూన్‌ నెలలో విద్యుత్‌ వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి.

Published : 01 Jul 2024 16:46 IST

EV sales | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో విద్యుత్‌ వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మే నెలతో పోలిస్తే జూన్‌ నెలలో 14 శాతం తక్కువ విక్రయాలు నమోదయ్యాయి. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన వాహన్‌ పోర్టల్‌లోని డేటా ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ క్యాలెండర్‌ సంవత్సరంలో ఇప్పటివరకు 8,39,545 విద్యుత్‌ వాహనాలు (కార్లు, స్కూటర్లు) అమ్ముడయ్యాయి. మొత్తం వాహన విక్రయాల్లో ఈ సంఖ్య 6.69 శాతం కాగా.. ఈవీ విక్రయాల్లో టూవీలర్ల వాటా 57 శాతంగా ఉంది. విక్రయాలు చూస్తే.. మే నెలలో 1,23,704 వాహన విక్రయాలు నమోదుకాగా.. జూన్‌లో ఆ సంఖ్య 1,06,081కు తగ్గింది.

విద్యుత్ ద్విచక్ర వాహనాలకు ఇచ్చే సబ్సిడీలో గతేడాది ప్రభుత్వం కోత పెట్టింది. గరిష్ఠంగా ఇచ్చే సబ్సిడీని రూ.60వేల నుంచి రూ.22,500కు కుదించింది. దీంతో విద్యుత్‌ ద్విచక్ర వాహన సంస్థలు జూన్‌ నెల నుంచి ధరలు పెంచాయి. దీంతో అప్పట్లో కొనుగోళ్లు క్షీణించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరోసారి విద్యుత్‌ వాహనాలకు ఇచ్చే సబ్సిడీని కేంద్రం సగానికి కుదించింది. ఫేమ్‌-2 స్థానంలో కొత్తగా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ద్విచక్ర వాహనానికి గరిష్ఠంగా ఇచ్చే సబ్సిడీని రూ.10వేలకే పరిమితం చేసింది. త్రిచక్ర వాహనాల సబ్సిడీలోనూ కోత పెట్టింది. ఓవైపు సబ్సిడీలో కోత పడడం, మరోవైపు హైబ్రిడ్‌ వాహనాలపై ఆసక్తి చూపుతుండడంతో ఈ ఏడాది జూన్‌లో ఈవీ సేల్స్‌ తగ్గుముఖం పట్టడానికి కారణంగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని