Pawan Munjal: హీరో మోటోకార్ప్‌ ఛైర్మన్‌ పవన్‌ ముంజాల్‌ రూ.25 కోట్ల ఆస్తులు జప్తు

Pawan Munjal: మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగానే పవన్‌ ముంజాల్‌పై చర్యలకు ఉపక్రమించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వెల్లడించింది. 

Published : 10 Nov 2023 13:55 IST

దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పవన్‌ ముంజాల్‌కు (Pawan Munjal) చెందిన రూ.24.95 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) తెలిపింది. ఆయనపై నమోదైన మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు శుక్రవారం వెల్లడించింది. భారత్‌ నుంచి విదేశీ కరెన్సీని అక్రమంగా తరలించారంటూ పవన్‌ ముంజాల్‌ సహా మరికొందరిపై ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI)’ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే దర్యాప్తు చేపట్టినట్లు ఈడీ తెలిపింది.

రూ.54 కోట్ల విలువ చేసే విదేశీ కరెన్సీని పవన్‌ ముంజాల్‌ భారత్‌ నుంచి బయటకు తరలించారని డీఆర్‌ఐ తమ ఫిర్యాదులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరపగా పవన్‌ ముంజాల్‌ (Pawan Munjal) ఈ కరెన్సీని ఇతరుల పేరు మీద జారీచేసి.. తర్వాత దాన్ని ఆయన విదేశాల్లో తన వ్యక్తిగత ఖర్చులకు వాడుకున్నట్లు ఈడీ తెలిపింది. ఈ విదేశీ నిధులను ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ తమ ఉద్యోగుల పేరు మీద వివిధ డీలర్ల నుంచి విత్‌డ్రా చేసినట్లు పేర్కొంది. సదరు కంపెనీ ఈ మొత్తాన్ని పవన్‌ ముంజాల్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌కు ఇచ్చినట్లు తెలిపింది. ఆయన దీన్ని పలు బిజినెస్‌ ట్రిప్పుల్లో విదేశాలకు వెళ్లినప్పుడు సీక్రెట్‌గా తీసుకెళ్లినట్లు వివరించింది. రెమిటెన్స్‌ స్కీమ్‌ ప్రకారం.. ఒక వ్యక్తి ఒక ఏడాదిలో 2.5 లక్షల డాలర్లు మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఈ పరిమితిని దాటవేయడంలో భాగంగానే పవన్‌ ముంజాల్‌ ఈ చర్యలకు పాల్పడ్డట్లు ఆరోపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని