Air India: టీమ్‌ఇండియా కోసం ఆ విమానం పంపారా?.. ఎయిరిండియాను ఆరాతీసిన డీజీసీఏ

Air India: బెరిల్‌ హరికేన్‌ కారణంగా బార్బడోస్‌లో చిక్కుకున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లు ప్రత్యేక ఎయిరిండియా విమానంలో భారత్‌కు చేరుకున్నారు. అయితే, వారికి పంపిన విమానం ముందస్తుగా షెడ్యూల్‌ చేసిందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై డీజీసీఏ వివరణ కోరింది.

Updated : 04 Jul 2024 12:39 IST

Air India | దిల్లీ: టీ20 వరల్డ్‌ కప్‌ (T20 World Cup) గెలిచిన టీమ్‌ఇండియా గురువారం ఉదయం భారత్‌కు చేరుకుంది. భీకర హరికేన్‌ కారణంగా వారు బార్బడోస్‌లో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎయిరిండియాకు (Air India) చెందిన ప్రత్యేక విమానాన్ని పంపి బీసీసీఐ వారిని స్వదేశానికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ విమానానికి సంబంధించిన అంశం కాస్త వివాదంగా మారింది. అది ముందుగా  ప్రయాణికుల కోసం కేటాయించిందని.. దాన్ని రద్దు చేసి బార్బడోస్‌కు పంపారని బుధవారం వార్తలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిసింది.

దీన్ని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ పరిగణనలోకి తీసుకుంది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఎయిరిండియాను (Air India) ఆదేశించింది. అమెరికాలోని ‘నెవార్క్‌ నుంచి దిల్లీ రావాల్సిన విమానాన్ని టీమ్‌ఇండియా కోసం పంపారా?’ అని ఆరా తీసింది. దీనిపై ఎయిరిండియాకు చెందిన ఓ అధికారి స్పందించారు. బార్బడోస్‌కు విమానం పంపడం వల్ల ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ముందస్తుగానే వారికి తెలియజేసినట్లు వివరించారు. అయినప్పటికీ.. కొంతమంది నెవార్క్‌కు రాగా.. వారిని న్యూయార్క్‌కు బస్సులో తీసుకెళ్లినట్లు చెప్పారు. అక్కడినుంచి మరో విమానంలో దిల్లీకి చేరేలా ఏర్పాట్లుచేశామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని