IPOs: నేడే 2 ఐపీఓలు ప్రారంభం.. రూ.550 కోట్ల సమీకరణ.. పూర్తి వివరాలివే

IPOs: పైపింగ్‌ సొల్యూషన్స్‌ అందించే డీ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్స్‌తో పాటు బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీ ఎక్మే ఫిన్‌ట్రేడ్‌ ఐపీఓలు బుధవారం ప్రారంభమయ్యాయి. వీటి షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ జూన్‌ 21న ముగియనుంది.

Published : 19 Jun 2024 11:40 IST

ముంబయి: పైపింగ్‌ సొల్యూషన్స్‌ అందించే డీ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ (Dee Development IPO) బుధవారం ప్రారంభమైంది. రూ.418 కోట్ల సమీకరణే లక్ష్యంతో వస్తున్న ఈ పబ్లిక్‌ ఇష్యూ 21న ముగియనుంది. షేరు ధరల శ్రేణి రూ.193-203. రిటైల్‌ మదుపర్లు కనీసం 73 షేర్ల కోసం రూ.14,819 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.

తాజా ఐపీఓలో (IPO) డీ డెవలప్‌మెంట్‌ రూ.325 కోట్లు విలువ చేసే కొత్త షేర్లను జారీ చేస్తోంది. మరో 45.82 లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తున్నారు. కొత్త షేర్ల ద్వారా సమీకరించిన నిధుల నుంచి రూ.175 కోట్లు రుణ చెల్లింపులు, రూ.75 కోట్లు నిర్వహణ మూలధనం, రూ.75 కోట్లు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో సమీర్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

ఐపీఓలో (Dee Development IPO) అందుబాటులో ఉన్న షేర్లలో సగం అర్హత గల సంస్థాగత మదుపర్ల (QIBs)కు, 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు (NIIs) కేటాయించారు. డీ డెవలప్‌మెంట్‌ ఒక ఇంజినీరింగ్‌ కంపెనీ. చమురు, గ్యాస్‌, విద్యుత్తు, రసాయనాల కంపెనీలకు కావాల్సిన పైపింగ్‌ సొల్యూషన్స్‌ను అందిస్తుంది. ఈ కంపెనీకి మొత్తం ఏడు తయారీ కేంద్రాలున్నాయి. వీటిలో ఒకటి బ్యాంకాక్‌లో ఉంది. జేజీసీ కార్పొరేషన్‌, నూటర్‌ ఎరిక్సెన్‌, మ్యాన్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ ఎస్‌ఈ, మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌, జాన్‌ కాకెరిల్‌ ఎస్‌ఏ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌పీసీఎల్‌, తోషిబా జేఎస్‌డబ్ల్యూ పవర్‌ సిస్టమ్స్ వంటి కంపెనీలు డీ డెవలప్‌మెంట్‌ కస్టమర్ల జాబితాలో ఉన్నాయి.

ఎక్మే ఫిన్‌ట్రేడ్‌ ఐపీఓ

బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీ ఎక్మే ఫిన్‌ట్రేడ్‌ (ఇండియా) లిమిటెడ్‌ ఐపీఓ (Akme Fintrade IPO) సైతం ఈరోజే ప్రారంభమైంది. 21వ తేదీ వరకు షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. షేరు ధరల శ్రేణి రూ.114-120. గరిష్ఠ ధర వద్ద ముదుపర్లు కనీసం రూ.15,000తో 125 షేర్లకు బిడ్‌ వేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ పరిమాణం రూ.132 కోట్లు. దీంట్లో 1.1 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేస్తోంది.

ఎక్మే ఫిన్‌ట్రేడ్‌ ఉదయ్‌పుర్‌ కేంద్రంగా పనిచేస్తోంది. రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లోని కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. ప్రధానంగా వాహన, చిరు వ్యాపారులకు వ్యాపార రుణాలను సమకూరుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని