Flipkart: ఆర్డర్‌ పెట్టిన ఆరేళ్లకు.. ఫ్లిప్‌కార్ట్ నుంచి యూజర్‌కు కాల్‌!

Online Order: ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన ఆరేళ్లకు దాని గురించి ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీ యూజర్‌కు ఫోన్‌ చేసింది. ముంబయికి చెందిన ఓ యూజర్‌కు ఎదురైందీ వింత అనుభవం. అసలేం జరిగిందంటే..?

Updated : 27 Jun 2024 16:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఏదైనా వస్తువును ఈ-కామర్స్‌ వేదికల్లో కొనుగోలు చేస్తే (Online Orders) ఒకట్రెండు రోజుల్లో దాన్ని డెలివరీ చేస్తారు. ఒక్కోసారి కస్టమర్‌ రష్‌ ఎక్కువగా ఉంటే మహాఅయితే వారం లేదా నెల రోజులు పట్టొచ్చు. కానీ, ఓ వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో చేసిన ఆర్డర్‌ను ఆరేళ్లయినా కంపెనీ డెలివరీ చేయలేదు సరికదా.. ఇన్నాళ్లకు యూజర్‌కు ఫోన్‌ చేసి ‘సమస్య ఏంటీ’ అని తాపీగా అడిగింది. తనకు ఎదురైన ఈ వింత అనుభవాన్ని ఆ కస్టమర్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

ముంబయి (Mumbai)కి చెందిన అహ్‌సన్‌ ఖర్‌బాయ్‌ 2018 మే 16న ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.485 చెప్పులను ఆర్డర్ (Order) చేశాడు. మూడు రోజుల తర్వాత వాటిని షిప్పింగ్‌ చేయగా.. అదే ఏడాది మే 20న డెలివరీ చేస్తామని వెబ్‌సైట్‌లో చూపించింది. అయితే, ఇప్పటికీ అవి యూజర్‌కు చేరలేదు. పైగా.. అప్పటినుంచి ప్రతిరోజు ఆర్డర్‌ స్టేటస్‌లో ఇంకా ‘ఈరోజు వస్తాయి (అరైవింగ్‌ టుడే)’ అనే చూపిస్తోందట..!

ఆ ఆర్డర్‌కు తాను ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ’ ఆప్షన్‌ను ఎంచుకున్నాడు. డబ్బులేం కట్టలేదు గనుక ఆర్డర్‌ రాలేదనే విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని, కస్టమర్‌ సర్వీస్‌కు కూడా ఫిర్యాదు చేయలేదని చెప్పాడు. క్యాన్సిల్‌ చేసే ఆప్షన్‌ కూడా లేకపోవడంతో దాన్ని క్లోజ్‌ చేసేందుకు ఇటీవల ప్రయత్నించాడు. ఆ మరుసటి రోజే ఫ్లిప్‌కార్ట్‌ నుంచి తనకు ఫోన్‌ వచ్చిందని, ఆర్డర్‌తో సమస్య ఏంటని వారు అడిగినట్లు కస్టమర్‌ (Flipkart Customer) తెలిపాడు. ఇందుకుగానూ కంపెనీ ప్రతినిధులు తనకు క్షమాపణలు చెప్పినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని