Credit card rule: క్రెడ్‌, ఫోన్‌పేలో క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపులు నిలిచిపోనున్నాయా?

Credit card: క్రెడ్‌, ఫోన్ పే వంటి యాప్స్‌ ద్వారా క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపులు జులై 1 నుంచి నిలిచిపోయే అవకాశం ఉంది.

Published : 24 Jun 2024 18:30 IST

Credit card bill payment | ఇంటర్నెట్‌ డెస్క్: క్రెడిట్ కార్డు బిల్లు (Credit card) చెల్లింపుల కోసం చాలా మంది ఫోన్‌ పే (Phonepe), క్రెడ్‌ (CRED) వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ను వాడుతుంటారు. రివార్డు పాయింట్లు వస్తాయనో, బిల్లు చెల్లింపులన్నీ ఒక చోట ఉంటాయనో.. చాలా మంది వీటిని వినియోగిస్తుంటారు. ఒకవేళ మీరూ ఇలానే క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లిస్తుంటే జూన్‌ 30 తర్వాత అవాంతరాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్‌బీఐ తీసుకొచ్చిన నిబంధనలే దీనికి కారణం.

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపులన్నీ భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (BBPS) ద్వారానే జరగాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. జులై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బిల్లు చెల్లింపుల్లో సమర్థత, భద్రతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంకులు భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కోటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ వంటి 8 బ్యాంకులు మాత్రమే ఈ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసుకున్నాయి.

Byjus: బైజూస్‌లో ₹4 వేల కోట్ల పెట్టుబడి.. ఇప్పుడు సున్నా..!

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి ప్రధాన బ్యాంకులు ఇంకా ఈ పేమెంట్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసుకోలేదు. అతి ఎక్కువ క్రెడిట్‌ కార్డులు జారీ చేసిన సంస్థలు కూడా ఇవే కావడం గమనార్హం. ఆయా బ్యాంకులు భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసుకోకపోవడం వల్ల ఫోన్ పే, క్రెడ్‌ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్‌ కార్డుల బిల్లులను ప్రాసెస్‌ చేయలేవు. దీనివల్ల ఆయా యాప్స్‌లో క్రెడిట్‌ కార్డు బిల్లులను చెల్లించడం వీలు పడదు. అయితే, బ్యాంక్‌ వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా యథావిధిగా చెల్లింపులు చేయడంలో ఎలాంటి ఇబ్బందులూ లేవు. దీనికి సంబంధించిన గడువు పొడిగించాలని పరిశ్రమ వర్గాలు ఆర్‌బీఐని కోరుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు