Hero MotoCorp: నిధుల మళ్లింపు ఆరోపణలు.. హీరో మోటోకార్ప్‌పై విచారణ!

నిధుల మళ్లింపు ఆరోపణలపై కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ హీరో మోటోకార్ప్‌పై విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు నష్టపోయాయి.

Updated : 15 Jun 2023 18:28 IST

దిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌పై (Hero MotoCorp) కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. నిధుల తరలింపునకు సంబంధించి ఓ థర్డ్‌పార్టీ వెండర్‌తో హీరో మోటోకార్ప్‌కు ఉన్న సంబంధాలపై ఈ విచారణకు ఆదేశించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు. ఈ వార్తల నేపథ్యంలో హీరో మోటోకార్ప్‌ షేర్లు నష్టపోయాయి.

హీరో మోటోకార్ప్‌ షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి నిధులు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ కంపెనీతో హీరో మోటో కార్ప్‌కు ఉన్న సంబంధాలపై విచారణకు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు తెలిపింది. అయితే, దీనిపై తమకెలాంటి సమాచారం రాలేదని హీరో మోటోకార్ప్‌ తెలిపింది. ఒకవేళ దర్యాప్తు సంస్థలు సంప్రదిస్తే తగిన సమాచారాన్ని అందిస్తామని తెలిపింది.

హీరో మోటోకార్ప్‌పై విచారణకు ఆదేశించారన్న వార్తల నేపథ్యంలో కంపెనీ మోటోకార్ప్‌ షేర్లపై ప్రభావం పడింది. గురువారం మధ్యాహ్నం కంపెనీ షేర్లు ఓ దశలో 4 శాతం వరకు నష్టపోయాయి. చివరికి ఎన్‌ఎస్‌ఈలో షేరు విలువ 2.99 శాతం క్షీణించి రూ.2,842 వద్ద ముగిసింది. గతేడాది సైతం పన్ను ఎగవేత ఆరోపణలతో హీరో మోటోకార్ప్‌పై ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. అయితే, రొటీన్‌ ఎంక్వైరీలో భాగంగానే ఈ సోదాలు జరిగాయని అప్పట్లో హీరో మోటోకార్ప్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని