Offices: ఆకర్షణీయంగా ఆఫీస్‌లు

ఉద్యోగుల వలసలను ఆపడంతో పాటు.. కార్యాలయాలకు వచ్చేలా వారిని ఆకర్షించేందుకు ‘ఆఫీస్‌ పీకాకింగ్‌’నకు పలు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి.

Updated : 05 Jul 2024 06:52 IST

ఉద్యోగులను రప్పించేందుకు కంపెనీల చర్యలు
వలసలకూ అడ్డుకట్ట

ముంబయి: ఉద్యోగుల వలసలను ఆపడంతో పాటు.. కార్యాలయాలకు వచ్చేలా వారిని ఆకర్షించేందుకు ‘ఆఫీస్‌ పీకాకింగ్‌’నకు పలు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. ‘పని ప్రదేశాలను అందంగా ముస్తాబు చేయడమే కాకుండా.. ఆకర్షణీయ డిజైన్‌లతో సౌకర్యవంతంగా తీర్చిదిద్దడాన్నే’ ఆఫీస్‌ పీకాకింగ్‌గా వ్యవహరిస్తుంటారు. ఇందుకోసం భారీ మొత్తాలనే కంపెనీలు ఖర్చు చేస్తున్నాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ‘కొవిడ్‌-19 పరిణామాల తర్వాత, ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ఆఫీస్‌ పీకాకింగ్‌ విధానానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కొవిడ్‌-19 పరిణామాల్లో ఎక్కడి నుంచైనా పని చేసే వెసులుబాటును ఉద్యోగులకు పలు కంపెనీలు కల్పించాయి. కొవిడ్‌ పరిణామాలు ముగిశాకా, ఈ ధోరణి కొనసాగింది. ఇంటి నుంచి పని చేస్తున్న మాదిరి, సౌకర్యవంతంగా ఉందనే భావనను ఉద్యోగుల్లో కలిగించేందుకు కార్యాలయాల రూపురేఖలను మార్చాల్సిన అవసరం కంపెనీలకు ఏర్పడింద’ని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ సీఈఓ (స్టాఫింగ్‌) కార్తీక్‌ నారాయణ్‌ తెలిపారు. ఇందుకోసం పని ప్రదేశాల్లో ఆకర్షణీయ అలంకరణలు చేస్తున్నారు. వినూత్న శైలి ఫర్నిచర్, ప్రశాంతంగా సేదదీరే ఏర్పాట్లు, సూర్యకాంతిని అనుభవించేలా తీర్చిదిద్దుతున్నారు. ఉద్యోగుల్లో ఉల్లాసాన్ని నింపడమే దీని వెనక ఉద్దేశమని వివరించారు. 

ఆ రంగాల్లో అత్యధికంగా.. 

ఉద్యోగులకు మానసికోల్లాసం కలిగించి, ఉత్పాదకత పెంచేందుకు కంపెనీలు పీకాకింగ్‌ను వ్యూహాత్మకంగా వాడుకుంటున్నాయని నారాయణ్‌ తెలిపారు. అత్యంత ప్రతిభావంతులను తమ కార్యాలయాలకు ఆకర్షించేందుకు ఈ తరహా కార్యకలాపాలపై దిగ్గజ సాంకేతిక కంపెనీలు రూ.కోట్లల్లో ఖర్చు చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘నిపుణులను ఆకర్షించే విషయంలో అత్యంత పోటీ నెలకొన్న ఐటీ- టెక్నాలజీ, ఆర్థిక, కన్సల్టింగ్‌ రంగాల్లోని కంపెనీలు ఎక్కువగా ఆఫీస్‌ పీకాకింగ్‌ను చేపడుతున్నాయి’ అని ఆయన అన్నారు. హైబ్రిడ్‌ (కొన్ని రోజులు ఇంటి నుంచి - మరికొన్ని రోజులు ఆఫీస్‌కు వచ్చి) పని విధానం కొనసాగినంత వరకు.. ఆఫీస్‌ పీకాకింగ్‌ పెరుగుతూనే ఉంటుందని తెలిపారు. బెంగళూరు, ముంబయి, దిల్లీ ఎన్‌సీఆర్, హైదరాబాద్‌ లాంటి నగరాల్లో ఆఫీస్‌ పీకాకింగ్‌ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని