Home Loan: ఇంటి రుణ వడ్డీ రేట్లు ఎందుకు, ఎలా మారతాయి?

ఇంటి రుణంపై.. రుణ మొత్తం తర్వాత వడ్డీ రేటు చాలా కీలకమైంది. ఇవి ఈఎంఐను నిర్ణయిస్తాయి. అయితే ఫ్లోటింగ్‌ ఇంటి రుణాలపై కొన్ని సార్లు వడ్డీ రేట్లు మారుతుంటాయి. ఎందుకు..?

Published : 25 Jun 2024 17:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక వ్యక్తి తన జీవితకాలంలో తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఇంటి కొనుగోలు ఒకటి. భారత్‌లోని చాలా మంది వ్యక్తులు ఇంటి కలను సాకారం చేసుకోవడానికి బ్యాంకుల వద్ద గృహ రుణం తీసుకుంటారు. ఇంటి రుణాలు అనేక వాటితో ముడిపడి ఉన్నప్పటికీ, కీలకమైంది వడ్డీ రేటు అనే చెప్పాలి. ఇది వినియోగదారుడి ఆర్థిక ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. రుణగ్రహీతలు ఈ రుణాలపై వడ్డీ రేటు మార్పుల ప్రభావాన్ని గమనించాలి.

ఆర్‌బీఐ

ఇంటి రుణాలపై వడ్డీ రేట్లను ప్రభావితం చేయడంలో ఆర్‌బీఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలభ్యత, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్‌బీఐ రెపో రేటును ఒక సాధనంగా ఉపయోగిస్తుంది. రెపోరేటుపై ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలు నేరుగా వడ్డీ రేట్లపై ప్రభావితం చూపిస్తాయి. ఆర్‌బీఐ రెపోరేటును పెంచినప్పుడు బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచుతాయి. వడ్డీ రేట్లు పెరగడం వల్ల రుణాలు మరింత ఖరీదవుతాయి. దీనికి విరుద్ధంగా రెపోరేటును తగ్గించినప్పుడు రుణ రేట్లు తగ్గింపునకు దారితీస్తుంది. ఆర్‌బీఐ..ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని పెంచాలనుకుంటే రెపో రేటును తగ్గించవచ్చు. లిక్విడిటీని తగ్గించాలనుకుంటే రెపో రేటును పెంచవచ్చు. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, ప్రపంచ ఆర్థిక పరిస్థితులతో సహా అనే ఆర్థిక అంశాలు ఆర్‌బీఐ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి.

ఎంసీఎల్‌ఆర్‌

ఆర్‌బీఐ.. బ్యాంకుల కోసం స్థిరమైన అంతర్గత సూచన రేటును సెట్‌ చేస్తుంది. వివిధ రకాల రుణాలకు వర్తించే కనీస వడ్డీ రేటును ఆర్‌బీఐ నియంత్రణలో ఉన్న బ్యాంకులు పాటిస్తాయి. దేశ ఆర్థిక కార్యకలాపాల్లో తీవ్రమైన మార్పు వచ్చినప్పుడు ఈ రేటును ఆర్‌బీఐ సవరిస్తుంది. ఎంసీఎల్‌ఆర్‌ (MCLR) అని పిలిచే ఈ రేటు కంటే తక్కువ రేటుకు బ్యాంకులు రుణం ఇవ్వవు. బ్యాంకులు కూడా నగదు కొరత సమయంలో ఆర్‌బీఐ నుంచి డబ్బును తీసుకుంటాయి. దీనిపై ఆర్‌బీఐకు వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ఈ వడ్డీ రేటును రెపో రేటు అంటారు. సాంకేతికంగా రెపో అంటే రీ పర్చేజింగ్‌ ఆప్షన్‌ లేదా రీ పర్చేజ్‌ అగ్రిమెంట్‌. అలాగే, ఒకోసారి అత్యవసర సమయాల్లో RBIకు కూడా నగదు అవసరం పడొచ్చు. అలాంటప్పుడు బ్యాంకుల వద్ద కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుంటుంది. దీనిపై వర్తించే వడ్డీ రేటునే రివర్స్‌ రెపోరేటు అంటారు. ప్రస్తుత రెపోరేటు 6.50%, రివర్స్‌ రెపోరేటు 3.35% వద్ద ఉంది.  

వడ్డీ రేట్ల పాత్ర

ఇంటి రుణం విషయంలో వడ్డీ రేట్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఫ్లోటింగ్‌/వేరియబుల్‌ రేటు అనేది ఆర్‌బీఐ రెపో రేటు లేదా మార్జినల్‌ కాస్ట్‌ ఆప్‌ ఫండ్స్‌-బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌) వంటి బెంచ్‌మార్క్‌తో లింక్ అయి ఉంటుంది. ఈ బెంచ్‌మార్క్ రేటు మారినప్పుడు రుణ వడ్డీ రేటుతో సహా నెలవారీ చెల్లింపులు మారతాయి. వడ్డీ రేటు మార్పులు రుణ కాలవ్యవధిలో చెల్లించే మొత్తం వడ్డీని ప్రభావితం చేయొచ్చు. అందుచేత ఇంటిపై రుణాన్ని ఖరారు చేసే ముందు వివిధ బ్యాంకులు వసూలుజేసే వడ్డీ రేట్లను పరిశోధించి సరిపోల్చాలి. రేట్లలో చిన్న వ్యత్యాసం కూడా రుణ కాలవ్యవధి/వడ్డీ మొత్తంలో గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. RBI మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు వడ్డీ రేటు తగ్గింపు ప్రయోజనాన్ని వీలైనంత త్వరగా వినియోగదారులకు బదిలీ చేయాలి.

వడ్డీ రేటు పెరిగితే..

ఇంటిపై రుణం తీసుకునేటప్పుడు దరఖాస్తుదారులు..రుణ మొత్తం, ఈఎంఐ, వడ్డీ రేటు, కాలవ్యవధిని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తీసుకున్న ఇంటి రుణం మొత్తం రూ.30 లక్షలు అనుకుందాం. కాలవ్యవధి 20 ఏళ్లు (240 నెలలు). వడ్డీ రేటు 9%. EMI రూ.26,992. ఇదే ఈఎంఐతో రుణాన్ని 10 ఏళ్లు చెల్లిస్తే.. ఇంకా అప్పటికీ రూ.21,30,777 బకాయి ఉంటుంది. అయితే, ఆ తర్వాత ఆర్‌బీఐ రెపోరేటు పెంచడం వల్ల సవరించిన ఇంటి రుణ వడ్డీ రేటు 9.25% అయ్యింది. దాంతో మిగతా 10 ఏళ్ల కాలవ్యవధికి EMI రూ.26,992 నుంచి రూ.27,281కు పెరుగుతుంది. వడ్డీ రేటు 0.25% పెరగడం వల్ల 120 నెలల్లో చెల్లించాల్సిన మొత్తం రూ.34,680 పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని