Foxconn: ఫాక్స్‌కాన్‌లో వివాహిత మహిళలకు ఉద్యోగాల నిరాకరణ.? నివేదిక కోరిన కేంద్రం

భారత్‌లో ఐఫోన్‌ తయారుచేసే సంస్థ ఫాక్స్‌కాన్‌ (Foxconn)పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేంద్ర కార్మికశాఖ అప్రమత్తమైంది. తమిళనాడు ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించాలని కోరింది. 

Updated : 27 Jun 2024 12:40 IST

ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌లో టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఉత్పత్తుల సప్లయర్‌గా ఉన్న ఫాక్స్‌కాన్‌ (Foxconn) ఓ అనైతిక నిర్వాకానికి పాల్పడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికొచ్చింది. ఈ కంపెనీలో వివాహిత మహిళలకు కొలువులు నిరాకరిస్తున్నట్లు ఆంగ్లవార్తా సంస్థ రాయిటార్స్‌ ఇటీవల ఓ కథనంలో వెల్లడించింది. దీనిపై కేంద్ర కార్మికశాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఈ అంశంపై సంపూర్ణ నివేదికను తమకు సమర్పించాలని తమిళనాడు లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ను కోరింది. ప్రాంతీయ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ను దీనిలో వాస్తవాలను పరిశీలించి తమకు తెలియజేయాలని పేర్కొంది. సమానవేతన చట్టం 1976 ప్రకారం ఉద్యోగ నియామకాల సమయంలో లింగవివక్ష అస్సలు చూపకూడదని గుర్తు చేసింది.

ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ ప్లాంట్ల ఉద్యోగాల్లోని వివాహిత మహిళలను ఓ పద్ధతి ప్రకారం ఫాక్స్‌కాన్‌ తప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అవివాహితులతో పోలిస్తే ఆ గృహిణులకు అదనపు బాధ్యతలు ఉండటాన్ని ఇందుకు సాకుగా చూపుతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ రిక్రూటింగ్‌ ఏజెంట్లు, హెచ్‌ఆర్‌ సిబ్బంది వెల్లడించినట్లు సదరు వార్తాసంస్థ తెలిపింది. దీనిపై యాపిల్‌, ఫాక్స్‌కాన్‌ స్పందిస్తూ.. 2022లో నియామకాల సమయంలో హెచ్‌ఆర్‌ పాలసీలో లోపాలు ఉన్నాయని పేర్కొన్నాయి. వాటిని మెరుగుపర్చామని వెల్లడించాయి. అంతేకానీ, 2023, 2024 నియామకాల్లో లోపాలపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం ఈ అంశంపై అధికారికంగా స్పందించలేదు. 

‘‘ఫాక్స్‌కాన్‌ నియామక ప్రక్రియలో లోపాలున్నట్లు 2022లో తెలియగానే చర్యలు తీసుకొన్నాం. మా పంపిణీదారుతో కలిసి సమస్యలపై నెలవారీ ఆడిట్‌ నిర్వహించాము. ఉన్నత ప్రమాణాలు నెలకొనేటట్లు చూసుకొన్నాం’’ అని యాపిల్‌ పేర్కొంది.

25శాతం కొత్త ఉద్యోగులు వివాహిత మహిళలే

తమపై వస్తున్న ఆరోపణలకు ఫాక్స్‌కాన్‌ సంస్థ స్పందించింది. తమ వద్ద ఉన్న కొత్త ఉద్యోగుల్లో 25శాతం మంది వివాహిత మహిళలేనని ప్రభుత్వానికి వెల్లడించింది. ఇక తమిళనాడులోని ఫ్యాక్టరీలోని మొత్తం ఉద్యోగుల్లో 70శాతం మహిళలే అని పేర్కొంది. ఈ నిష్పత్తి భారత్‌లో తమ రంగానికి సరిగ్గా సరిపోతుందని చెప్పింది. పురుషులు కేవలం 30శాతం మాత్రమేనని తెలిపింది. కాకపోతే వారి భద్రతా ప్రమాణాలను అనుసరించి స్త్రీ,పురుషులు, మతాలకు సంబంధం లేకుండా ఎవరైనా సరే శరీరంపై లోహపు వస్తువులను ఉంచుకోకూడదని పేర్కొన్నట్లు ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని