Maruti Suzuki: జూన్‌లో కార్ల విక్రయాలు 4% పెరిగాయ్‌

ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు గత నెలలో 4% పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ అధికంగా ఉండటంతో, విక్రయాలపై ప్రభావం పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.

Updated : 02 Jul 2024 01:52 IST

ఈవీల అమ్మకాలు 1,06,081

దిల్లీ: ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు గత నెలలో 4% పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ అధికంగా ఉండటంతో, విక్రయాలపై ప్రభావం పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. 2023 జూన్‌లో 3,28,710 పీవీలు విక్రయమవ్వగా, 2024 జూన్‌లో 3.67% వృద్ధితో 3,40,784కు చేరాయి. అయితే విద్యుత్తు వాహనాల విక్రయాలు మాత్రం ఈ ఏడాది మే నాటి 1,23,704తో పోలిస్తే 14% తగ్గి 1,06,081కు పరిమితమయ్యాయి. అయితే 2023 జూన్‌తో పోలిస్తే మాత్రం ఈవీల అమ్మకాలు 20% పెరిగాయి. ఈవీలపై ప్రభుత్వ ప్రోత్సాహకాలు తగ్గడానికితోడు కొనుగోలుదార్లు ఇంధనం, విద్యుత్తుతో నడిచే హైబ్రిడ్‌ వాహనాలకు మొగ్గుచూపడం ఇందుకు కారణమని వివరిస్తున్నారు. 

  • మార్కెట్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా దేశీయ విక్రయాలు 1,33,027 నుంచి 3% పెరిగి 1,37,160కి చేరాయి. చిన్న కార్లయిన ఆల్టో, ఎస్‌-ప్రెసో విక్రయాలు 14,504 నుంచి 9,395కు పరిమితమయ్యాయి. కాంపాక్ట్‌ విభాగంలోని బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్‌ ఎస్, వ్యాగన్‌ఆర్‌ కార్ల విక్రయాలు 64,471 నుంచి 64,049కు తగ్గాయి. యుటిలిటీ విభాగంలోని బ్రెజా, గ్రాండ్‌ విటారా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌ 6 విక్రయాలు 43,404 నుంచి 52,373కు పెరిగాయి. దేశ వ్యాప్తంగా 37-38 రోజులకు సరిపోయేలా నిల్వలు డీలర్ల వద్ద ఉన్నట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి (మార్కెటింగ్, విక్రయాలు) పార్థో బెనర్జీ వెల్లడించారు.
  • హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా దేశీయ విక్రయాలు 50,001 నుంచి 50,103కు పెరిగాయి. టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహన (విద్యుత్‌ వాహనాలతో కలిపి) దేశీయ విక్రయాలు 47,359 నుంచి 8% తగ్గి 43,624కు పరిమితమయ్యాయి. మే, జూన్‌ వాహన విక్రయాలపై సార్వత్రిక ఎన్నికలు, ఎండల ప్రభావం పడిందని టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహనాల ఎండీ శైలేష్‌ చంద్ర పేర్కొన్నారు. గత 2 నెలల్లో రిటైల్‌ విక్రయాలు తగ్గినా, కొత్త వాహనం కొనుగోలుకు విచారణలు  బలంగా ఉన్నందున, గిరాకీ పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఆగస్టు నుంచి పండుగల సీజన్‌ మొదలైతే పరిశ్రమ మళ్లీ గాడిలో పడుతుందని తెలిపారు.
  • మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రయాణికుల వాహన దేశీయ విక్రయాలు 32,588 నుంచి 23% పెరిగి 40,022కు చేరాయి. టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేసింది. 2023 జూన్‌లో డీలర్లకు 19,608 వాహనాలను సంస్థ సరఫరా చేయగా, గత నెలలో 40% వృద్ధితో 27,474 వాహనాలను అందించింది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా రిటైల్‌ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 5,125 నుంచి 9% తగ్గి 4,644కు పరిమితమయ్యాయి.
  • ద్విచక్ర వాహనాలకొస్తే బజాజ్‌ ఆటో దేశీయ విక్రయాలు 1,99,983 నుంచి 8% పెరిగి 2,16,451కు చేరాయి. టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ దేశీయ ద్విచక్ర వాహన టోకు విక్రయాలు 2,35,833 నుంచి 8%  పెరిగి 2,55,734కు చేరాయి. సుజుకీ మోటార్‌సైకిల్‌ దేశీయ విక్రయాలు 13% వృద్ధితో 71,086కు పెరిగాయి. 

14% తగ్గిన ఈవీల విక్రయాలు 

విద్యుత్‌ వాహనాల (ఈవీల) విక్రయాలు ఈ ఏడాది మేతో పోలిస్తే జూన్‌లో 14 శాతం తగ్గాయి. 2023 జూన్‌ విక్రయాలతో పోలిస్తే మాత్రం గత నెలలో 20 శాతానికి పైగా పెరిగాయి. ప్రభుత్వ ఈవీ విధానాల్లో మార్పులు, హైబ్రిడ్‌ వాహనాలపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో, గత నెలలో ఈవీల విక్రయాలు తగ్గాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మేలో 1,23,704 ఈవీలు విక్రయం కాగా, గత నెలలో 1,06,081కు తగ్గాయి. ఈ క్యాలెండర్‌ ఏడాదిలో ఇదే అత్యల్పం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 8,39,545 ఈవీలను విక్రయించారు. మొత్తం వాహన విక్రయాలు 1,25,41,684తో పోలిస్తే, ఈవీల వాటా 6.69 శాతంగా ఉంది.


సబ్సిడీ తగ్గించారు

విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు గరిష్ఠ సబ్సిడీని రూ.60,000 నుంచి రూ.22,500కు తగ్గిస్తూ గత ఏడాది కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో వీటి ధరలను కంపెనీలు సుమారు 20 శాతానికి పైగా పెంచాయి. ఫలితంగా విద్యుత్‌ ద్విచక్ర వాహనాల సగటు ధర రూ.80,000-1,50,000కు చేరింది. ఫలితంగా వినియోగదార్ల కొనుగోలు నిర్ణయాలు మారిపోయాయి. ఈ ఏడాది విక్రయించిన మొత్తం విద్యుత్‌ వాహనాల్లో 57% వాటా ద్విచక్ర వాహనాలదే. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ద్విచక్ర వాహనాల సబ్సిడీని రూ.10,000కు, త్రిచక్ర వాహనాల సబ్సిడీని రూ.1,11,505 నుంచి రూ.50,000కు తగ్గించడంతో విక్రయాలపై ప్రభావం పడిందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని