pension Policy: పింఛను పాలసీ తీసుకోవచ్చా?

బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే కార్పొరేట్‌ బాండ్లు కాస్త అధిక రాబడిని ఇచ్చే మాట వాస్తవమే. కానీ, పెద్ద కంపెనీలు, క్రెడిట్‌ రేటింగ్‌ బాగున్న వాటినే ఎంచుకోవాలి.

Published : 05 Jul 2024 00:37 IST

నా దగ్గరున్న రూ.3 లక్షలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేద్దామని అనుకుంటున్నాను. దీనికి బదులుగా కార్పొరేట్‌ బాండ్లలో మదుపు చేస్తే అధిక రాబడి వస్తుందని విన్నాను. నిజమేనా? వీటిని ఎంచుకోవచ్చా?

దేవేందర్‌

  • బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే కార్పొరేట్‌ బాండ్లు కాస్త అధిక రాబడిని ఇచ్చే మాట వాస్తవమే. కానీ, పెద్ద కంపెనీలు, క్రెడిట్‌ రేటింగ్‌ బాగున్న వాటినే ఎంచుకోవాలి. మంచి క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్న బాండ్లు కాస్త సురక్షితమని చెప్పొచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే అధిక రాబడిని ఆశ చూపించే బాండ్లు తక్కువ క్రెడిట్‌ రేటింగ్‌తో ఉంటాయి. కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు పెట్టుబడికి నష్టభయం ఉంటుందని మర్చిపోవద్దు. నష్టం వచ్చినా భరించగలిగే సామర్థ్యం ఉన్నప్పుడే వీటిని ఎంచుకోవాలి. లేకపోతే సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే మేలు. 

మా పిల్లల పేరుమీద నెలకు రూ.20 వేల వరకూ పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. కనీసం 15 ఏళ్ల పాటు మదుపు చేయడానికి అనువైన పథకాలు ఏమున్నాయి. ఎంత మొత్తం జమ అవుతుంది?

ప్రసన్న

  • విద్యా ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది. పిల్లల ఆర్థిక అవసరాలకూ తగిన భద్రత కల్పించాల్సిన అవసరమూ ఉంది. కాబట్టి, ముందుగా కుటుంబ పెద్ద పేరుమీద తగినంత జీవిత బీమా పాలసీ తీసుకోండి. మీరు మదుపు చేసే మొత్తంపై వచ్చే రాబడి విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి ఉండాలి. దీనికి డైవర్సిఫైడ్‌ మ్యూచువల్‌ ఫండ్లు తోడ్పడతాయి. నెలకు రూ.20వేల చొప్పున 15 ఏళ్లపాటు క్రమం తప్పకుండా మదుపు చేస్తే, 13 శాతం వార్షిక సగటు రాబడితో, రూ.97,00,191 అయ్యేందుకు అవకాశం ఉంది. 

ఇటీవలే ఒక స్థలం విక్రయించాం. ఇందులో కొంత మొత్తాన్ని అత్యవసర నిధిగా అందుబాటులో ఉంచుకోవాలని అనుకుంటున్నాం. దీనికోసం మంచి రాబడినిచ్చే పథకాలు ఏమున్నాయి?

చంద్ర

  • అత్యవసర నిధిని ఎప్పుడూ సురక్షిత పెట్టుబడి పథకాల్లోనే జమ చేయాలి. కావాల్సినప్పుడు వెంటనే వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉండాలి. బ్యాంకులు ఫ్లెక్సీ డిపాజిట్ల పేరుతో ప్రత్యేక ఖాతాలను అందిస్తున్నాయి. వీటిలో జమ చేసినప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు లభించే వడ్డీని అందుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పొదుపు ఖాతాలోని డబ్బులాగానే వెనక్కి తీసుకోవచ్చు. వీటికి ప్రత్యామ్నాయంగా షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్లనూ పరిశీలించవచ్చు. సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోనూ జమ చేయొచ్చు. ఇవన్నీ మీకు 7-8 శాతం వరకూ రాబడిని అందిస్తాయి.

నేను నాలుగేళ్ల క్రితం ఒక ఎండోమెంట్‌ పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని స్వాధీనం చేసి, కొత్తగా పింఛను (యాన్యుటీ) పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా? నా వయసు 49. పాలసీలకన్నా మ్యూచువల్‌ ఫండ్లు మేలా?

సత్య

  • సాధారణంగా ఎండోమెంట్‌ పాలసీల్లో 4-6 శాతం మధ్యలో మెచ్యురిటీ రాబడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు దీన్ని స్వాధీనం చేస్తే చెల్లించిన మొత్తం ప్రీమియంలో 40-60 శాతం మధ్యలో వెనక్కి వస్తుంది. డిఫర్డ్‌ యాన్యుటీ పాలసీ తీసుకున్నా, ఎండోమెంట్‌ పాలసీ తరహా రాబడే అందుకుంటారు. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్లు ఉండేలా జీవిత బీమా పాలసీ తీసుకోండి. మీరు జమ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నెలనెలా క్రమానుగత పెట్టుబడి విధానంలో ఈక్విటీ ఆధారిత ఫండ్లలో మదుపు చేయండి. దీర్ఘకాలంలో ఎండోమెంట్, పింఛను పాలసీలకు మించి రాబడి అందుకునే వీలుంది.

తుమ్మ బాల్‌రాజ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని