term policy: కొత్త టర్మ్‌ పాలసీ తీసుకోవచ్చా?

ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీ రేట్లు కాస్త అధికంగానే ఉన్నాయి. మీకు వచ్చిన మొత్తంలో రూ.6 లక్షలను బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకోండి. నెలనెలా వడ్డీ తీసుకునేందుకు వీలుగా నాన్‌ క్యుములేటివ్‌ డిపాజిట్‌ చేయండి.

Published : 21 Jun 2024 00:25 IST

నా వయసు 58. వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నాను. పీఎఫ్, ఇతర ప్రయోజనాలు కలిపి రూ.10లక్షల వరకూ వస్తాయి. వీటిని నెలనెలా వడ్డీ అందుకునేలా ఎక్కడ మదుపు చేయాలి? 

వెంకటేశ్వర్లు

  • ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీ రేట్లు కాస్త అధికంగానే ఉన్నాయి. మీకు వచ్చిన మొత్తంలో రూ.6 లక్షలను బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకోండి. నెలనెలా వడ్డీ తీసుకునేందుకు వీలుగా నాన్‌ క్యుములేటివ్‌ డిపాజిట్‌ చేయండి. మీకు 60 ఏళ్లు వచ్చాక ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకొని, పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ స్కీంలోకి మార్చుకోవచ్చు. ఇందులో ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ వస్తోంది. మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. మిగతా రూ.4లక్షలను రెండు మంచి పనితీరున్న బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసి, సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ ద్వారా నెలకు రూ.2,500 చొప్పున వెనక్కి తీసుకోండి. దీర్ఘకాలంలో మీ పెట్టుబడి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. రూ.10లక్షలపైన వచ్చే ఆదాయం మీ ఖర్చులకు సరిపోకపోవచ్చు. కాబట్టి, ఇతర ఆదాయ వనరుల గురించి మీరు కచ్చితంగా ఆలోచించాలి.

మా అమ్మాయి వయసు 13. తన పేరుమీద నెలకు రూ.20వేల వరకూ మదుపు చేయాలని అనుకుంటున్నాం. కనీసం 10 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తాం. దీనికోసం ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? ఎంత మొత్తం జమవుతుంది?

దీపిక

  • మీ అమ్మాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించేందుకు కుటుంబ పెద్ద పేరుపైన తగినంత మొత్తానికి జీవిత బీమా పాలసీని తీసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.20వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. పదేళ్ల పాటు నెలకు రూ.20వేలు క్రమం తప్పకుండా మదుపు చేస్తే.. 12 శాతం వార్షిక రాబడి అంచనాతో రూ.42,11,696 అయ్యేందుకు అవకాశం ఉంటుంది. 

మరో రెండేళ్ల తర్వాత ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నాం. దీనికోసం ఇప్పటి నుంచీ నెలకు రూ.45 వేల చొప్పున దాచి పెట్టాలని చూస్తున్నాం. మా 
ప్రణాళిక ఎలా ఉండాలి?

వేణు

  • మీకు రెండేళ్లలోనే డబ్బు అవసరం అవుతుంది కాబట్టి, మీ పెట్టుబడిపై ఎలాంటి నష్టభయం లేకుండా చూసుకోవాలి. సురక్షితమైన పెట్టుబడులను ఎంచుకోవడమే మేలు. మీరు జమ చేయాలనుకుంటున్న మొత్తాన్ని పెద్ద బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ చేయండి. ఇంటి కోసం గృహరుణం తీసుకున్నప్పుడు కచ్చితంగా మార్టిగేజ్‌ ఇన్సూరెన్స్‌ చేయండి. లేదా మీ పేరుమీద ఒక టర్మ్‌ పాలసీ తీసుకోవడం మర్చిపోవద్దు. 

మూడేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో రూ.50 లక్షల టర్మ్‌ పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు నా వయసు 45. నా వార్షికాదాయం రూ.14 లక్షల వరకూ ఉంటుంది. కొత్తగా మరో 
రూ.50 లక్షల పాలసీ తీసుకోవచ్చా? 

మహేందర్‌

  • బీమా పాలసీ ఎప్పుడూ వార్షికాదాయానికి 10-12 రెట్లు ఉండేలా చూసుకోవాలి. రెండు మూడేళ్లకోసారైనా సమీక్షించుకోవాలి. ఇప్పుడు మీకు అదనంగా రూ.కోటి వరకూ జీవిత బీమా అవసరం ఉంది. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న కంపెనీని ఎంచుకొని, బీమా తీసుకోండి. మీ బాధ్యతలు తీరే వరకూ వ్యవధిని పెట్టుకోండి. కొత్త పాలసీని తీసుకునేటప్పుడు పాత పాలసీ వివరాలు తెలియజేయడం తప్పనిసరి.

తుమ్మ బాల్‌రాజ్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు