Byjus Job Cuts: బైజూస్‌లో భారీ ఉద్యోగాల కోత.. కొత్త సీఈఓ ప్రణాళికల ఫలితం!

Byjus Job Cuts: బైజూస్‌ ఇండియాకు ఇటీవలే అర్జున్‌ మోహన్‌ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు.

Updated : 27 Sep 2023 12:12 IST

బెంగళూరు: దేశీయ అతిపెద్ద ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ (Byju's) భారీ పునర్‌వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా దాదాపు 3,500 మంది ఉద్యోగులను తొలగించే (Job Cuts) అవకాశం ఉందని సమాచారం. బైజూస్‌ (Byju's) ఇండియాకు ఇటీవలే కొత్త సీఈఓగా అర్జున్‌ మోహన్‌ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే భారీ మార్పులకు సంస్థ సిద్ధం కావడం గమనార్హం.

తొలగించబోయే ఉద్యోగుల్లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు సైతం ఉంటారని తెలుస్తోంది. ఫలితంగా ఉద్యోగుల వేతనాల కోసం వెచ్చిస్తున్న వ్యయాన్ని తగ్గించుకోవాలన్నది ప్రణాళిక. అలాగే వివిధ విభాగాలను విలీనం చేసి అన్నింటినీ బైజూస్‌ (Byju's) కిందకే తీసుకొచ్చేందుకు అర్జున్‌ మోహన్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మంగళవారం ఆయన కంపెనీలోని సీనియర్‌ ఉద్యోగులకు తెలియజేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు. ఈవారమే ఈ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిధుల ప్రవాహంలో ఇప్పటికే ఆటంకాలు ఎదురవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీలైనంత వేగంగా పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలను అమలు చేసి వ్యయాలను నియంత్రించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌.. రెండు విభాగాల్లో ఒకే స్టాఫ్‌ను ఉంచాలని బైజూస్‌ (Byju's) యోచిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా అదనంగా ఉన్నవారిని బయటకు పంపనున్నారు. అనుబంధ సంస్థ ‘ఆకాశ్‌’ సహా విదేశీ వ్యాపారాల్లో ఎలాంటి తొలగింపులు ఉండబోవని తెలుస్తోంది. బైజూస్‌ (Byju's)లో 2021లో అత్యధికంగా 52 వేల మంది ఉద్యోగులు పనిచేశారు. ఇప్పుడు ఆ సంఖ్య 35 వేలకు చేరి ఉంటుందని అంచనా. ఈ ఏడాది ఇప్పటికే పలుసార్లు ఉద్యోగులను ఇంటికి పంపిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు