Classic Legends: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా మరో బైక్.. ఇండియాకు రానున్న బ్రిటీష్‌ బ్రాండ్‌

దేశీయ మార్కెట్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీనిచ్చేందుకు మరో అంతర్జాతీయ కంపెనీ దేశంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.

Published : 25 Jun 2024 15:09 IST

ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో రెట్రో లుక్‌తో మోటార్‌ సైకిళ్లకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతానికి ఈ విభాగంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌దే హవా. ఈ విభాగంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు (Royal Enfield) గట్టి పోటీనిచ్చేందుకు వివిధ కంపెనీలు ఆతరహా మోడళ్లను తీసుకొస్తున్నాయి. ట్రయంఫ్‌, హార్లే డేవిడ్‌ సన్‌ వంటి విదేశీ కంపెనీలతో బజాజ్‌, హీరో మోటోకార్ప్ జట్టు కట్టాయి. ఇప్పుడు మరో విదేశీ కంపెనీ భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. భారత్‌లో జావా, యజ్డీ బ్రాండ్లపై బైక్స్‌ తయారుచేసే బ్రిటీష్‌ కంపెనీ క్లాసిక్‌ లెజెండ్స్‌ (Classic Legends) భారత మార్కెట్లో కొత్త బైక్‌ను లాంచ్ చేయనుంది.

బీఎస్‌ఏ గోల్డ్‌ స్టార్‌ పేరుతో కొత్త మోటార్‌ సైకిల్‌ను తీసుకొచ్చేందుకు క్లాసిక్‌ లెజెండ్స్‌ సిద్ధమవుతోంది. త్వరలో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ టీజర్‌ విడుదల చేసింది. దీన్నిబట్టి 650 ఇంజిన్‌తో ఈ బైక్‌ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో బీఎస్‌ఏ గోల్డ్‌ స్టార్‌ను విక్రయిస్తున్నారు. దీన్నే ఇప్పుడు భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న దీన్ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక బీఎస్‌ఏ గోల్డ్‌ స్టార్‌ మోటార్‌సైకిల్‌ ప్రత్యేకతల విషయానికొస్తే.. 652 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో వస్తోంది. 45 బీహెచ్‌పీ పవర్‌, 55ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను ఇది విడుదల చేస్తుంది. రౌండ్‌ హెడ్‌ల్యాంప్‌, 6 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌, 12 లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్యూయల్‌ ట్యాంక్‌తో ఈ బైక్‌ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఏవైనా మార్పులు చేస్తారేమో చూడాలి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా తీసుకొస్తున్న ఈ బైక్‌ ధర రూ.3 లక్షల పైనే ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనాకు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని