Password: కాంటాక్టుల్లో పాస్‌వర్డులు.. ఇతరులతో షేరింగ్‌లు.. ఇదీ మన గోప్యత తీరు!

Password: పాస్‌వర్డుల వాడకంలో ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన ఉండడం లేదు. తాజాగా వెల్లడైన సర్వేనే ఇందుకు నిదర్శనం.

Published : 03 Jul 2024 00:05 IST

Password | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫోన్‌, కంప్యూటర్‌, బ్యాంక్‌ అకౌంట్‌.. ఇలా ప్రతి దానికీ ఒక్కో పాస్‌వర్డ్‌ పెట్టుకుంటాం. అందులోని సమాచారం బయటి వ్యక్తులు యాక్సెస్‌ చేయకుండా ఉండేందుకు చేసుకున్న ఏర్పాటు ఇది. కానీ, అలాంటి సున్నితమైన సమాచారం ఎంత వరకు గోప్యంగా ఉంచుతున్నాం? అనే ప్రశ్నకు కొందరి వద్ద సమాధానం ఉండడం లేదు. మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను కూడా అసురక్షిత పద్ధతుల్లో భద్రపరుస్తున్నట్లు తాజాగా ఓ సర్వేలో తేలింది. 367 జిల్లాల పరిధిలో 48 వేల మందిపై లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ సర్వే నిర్వహించి పాస్‌వర్డ్‌లకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

బ్యాంకు అకౌంట్‌, డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు, యాప్‌ స్టోర్‌లకు సంబంధించిన ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను 17 శాతం మంది అసురక్షిత పద్ధతుల్లో సేవ్‌ చేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. అంటే వీరంతా ఫోన్‌ కాంటాక్టుగానో, మొబైల్‌ నోట్స్‌లోనో సేవ్‌ చేస్తున్నట్లు సర్వే సంస్థ తెలిసింది. పొరపాటున ఏదైనా డేటా చౌర్యం జరిగితే సున్నితమైన సమాచారం సైబర్‌ నేరగాళ్ల పాలవ్వాల్సిందే. గడిచిన రెండేళ్లలో బ్యాంక్‌ సంబంధిత మోసాలు 300 శాతం మేర పెరిగినట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నా.. కొందరు కళ్లు తెరవడం లేదు.

అంతే కాదు 34 శాతం మంది ఏకంగా తమ పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకుంటామని చెప్పుకురావడం గమనార్హం. సర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతు మంది ఎంతో గోప్యంగా ఉంచాల్సిన పాస్‌వర్డ్‌లను పక్కవారితో పంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం కుటుంబ సభ్యులే కాకుండా ఆఫీసు సిబ్బంది, స్నేహితులతో సైతం వీటిని షేర్‌ చేసుకుంటున్నట్లు వారు బదులివ్వడం గమనార్హం. మిగిలిన వారు మాత్రమే పాస్‌వర్డ్‌లను తమ వద్ద మాత్రమే గోప్యంగా ఉంచుకుంటున్నారు. ఇదే సర్వేలో మరో ఆసక్తికర విషయమూ వెలుగుచూసింది. తమకు తెలిసిన వారో, తమ దగ్గరి బంధువుల్లో ఒకరు ఆర్థిక మోసాలకు గురైనట్లు ఏకంగా 53 మంది సర్వేలో పాల్గొన్న వ్యక్తులు తెలపడం గమనార్హం. అంటే మన చుట్టూ మోసాలు జరుగుతున్నాయని తెలిసినా జాగ్రత్తతో వ్యవహరించడం లేదన్నది ఈ సర్వే తేటతెల్లం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని