iOS: ఐఓఎస్‌ 18 డెవలపర్‌ బీటా 2 వెర్షన్‌ వచ్చేసింది.. కొత్త ఫీచర్లివే..!

iOS 18 developer beta 2: యాపిల్‌ మరిన్ని కొత్త ఫీచర్లతో ఐఓఎస్‌ 18 బీటా 2 వెర్షన్‌ను విడుదల చేసింది. కొత్త ఫీచర్లు ఏంటి? ఏయే ఫోన్లకు ఇది అందుబాటులో ఉందో చూద్దాం..!

Published : 25 Jun 2024 15:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ ఐఓఎస్‌ 18 డెవలపర్‌ బీటా 2 (iOS 18 developer beta 2) వెర్షన్‌ను సోమవారం విడుదల చేసింది. ఆ తర్వాత తరం ఐఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను జూన్‌ 10న తొలిసారి ‘వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌’లో పరిచయం చేసింది. అనంతరం నమోదిత డెవలపర్లకు పలు కొత్త ఫీచర్లతో బీటా-1ను విడుదల చేసింది. యాప్‌లు, ఫోల్డర్లు, విడ్జెట్‌ పేర్లను హోమ్‌స్క్రీన్‌లో కనపడకుండా ఉంచడం, ఫస్ట్‌ పార్టీ యాప్‌ ఐకాన్స్‌లో డార్క్‌ మోడ్‌ వంటి కొత్త ఫీచర్లను అందులో పరిచయం చేసింది. తాజాగా మరిన్ని ఫీచర్లను జత చేసి కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది

ఐఓఎస్‌ 18 డెవలపర్‌ బీటా 2 ఫీచర్లు..

ఐఫోన్‌ మిర్రరింగ్‌: ఈ ఫీచర్‌తో ఐఫోన్‌ స్క్రీన్‌ను మ్యాక్‌ కంప్యూటర్లలో చూడొచ్చు. తద్వారా రెండు డివైజ్‌ల మధ్య నిరంతరాయ కనెక్టివిటీ ఉంటుంది. నోటిఫికేషన్లు, కాల్స్‌ కూడా పొందొచ్చు. డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ ద్వారా ఫోల్డర్లను రెండు డివైజ్‌ల మధ్య ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మ్యాక్‌ఓఎస్‌ సెఖోయా బీటా2తో నడిచే మ్యాక్‌లన్నీ ఈ ఫీచర్‌ను సపోర్ట్‌ చేస్తాయి.

యాప్‌ స్టోర్‌: యాప్‌ స్టోర్‌ ఇకపై డార్క్‌ మోడ్‌ ఐకాన్‌తో కనిపించనుంది.

బహుళ భాషల కీబోర్డు: ఇప్పటికే బహుళ భాషల కీబోర్డు ఐఓఎస్‌లో అందుబాటులో ఉంది. దీన్ని తాజాగా మరిన్ని భాషలకు విస్తరించారు. ఒకేసారి మూడు భాషలను సపోర్ట్‌ చేసేలా తీర్చిదిద్దారు. వీటిలో ఇంగ్లిష్‌, హిందీ సహా మొత్తం 27 భారతీయ భాషలు ఉన్నాయి.

ఆర్‌సీఎస్‌ మెసేజింగ్‌: తాజా బీటా వెర్షన్‌లో ఆర్‌సీఎస్‌ మెసేజింగ్‌ సపోర్ట్‌ను యాడ్‌ చేశారు. కానీ, దీన్ని ఇంకా యాక్టివేట్‌ చేయలేదని సమాచారం.

డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు జాగ్రత్త..

బీటా వెర్షన్లను కొత్త ఓఎస్‌లో తమ యాప్‌ల పనితీరు ఎలాఉందో చూసి ఏమైనా లోపాలుంటే తెలియజేయడం కోసం డెవలపర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తారు. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ఏమైనా లోపాలుంటే ఫోన్‌ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. పెద్ద ప్రమాదమేమీ లేకపోయినప్పటికీ.. లోపాలను సవరించి మరింత భద్రతమైన వెర్షన్‌ను తీసుకొచ్చేవరకు ఫోన్‌ పనితీరు కాస్త మారొచ్చు. అందుకే డెవలపర్‌ బీటాను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు అప్రమత్తంగా ఉండాలి. మరికొన్ని రోజుల్లో మరింత స్థిరమైన ఐఓఎస్‌18 పబ్లిక్‌ బీటా అందుబాటులోకి వస్తుంది. కావాలనుకుంటే అప్పటివరకు వేచి ఉండొచ్చు.

ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి..

  • ఐఫోన్‌లో సెట్టింగ్స్‌ - జనరల్‌ - సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌కు వెళ్లాలి.
  • బీటా అప్‌డేట్స్‌పై క్లిక్‌ చేసి ఐఓఎస్‌ 18 డెవలపర్‌ బీటాపై క్లిక్‌ చేయాలి.
  • సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ పేజ్‌కు తిరిగి వెళ్లి డౌన్‌లోడ్‌ అవుతున్నట్లు కనిపించే వరకు వేచి ఉండాలి.
  • యాపిల్‌ నిబంధనలకు అంగీకారం తెలియజేసి డౌన్‌లోడ్‌ అయ్యేందుకు అనుమతించాలి.
  • ప్రక్రియ పూర్తి కాగానే ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్‌ అయిపోతుంది.

ఈ ఫోన్లలో..

ఐఓఎస్‌ 18 డెవలపర్‌ బీటా2 వెర్షన్‌ ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌, ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13 మినీ, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రో, ఐఫోన్‌ 12 మినీ, ఐఫోన్‌ 12 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ మ్యాక్స్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌ ఎస్‌ఈ ఫోన్లు ఉన్న యూజర్లలో ఎంపిక చేసినవారికి అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు