Airtel: ఎయిర్‌టెల్‌ ఛార్జీలూ పెరిగాయ్‌

ప్రీపెయిడ్, పోస్ట్‌ పెయిడ్‌ మొబైల్‌ టారిఫ్‌లను 10-21 శాతం పెంచుతున్నట్లు శుకవ్రారం భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

Published : 29 Jun 2024 03:04 IST

ఇదే బాటలో వొడాఫోన్‌ ఐడియా

దిల్లీ: ప్రీపెయిడ్, పోస్ట్‌ పెయిడ్‌ మొబైల్‌ టారిఫ్‌లను 10-21 శాతం పెంచుతున్నట్లు శుకవ్రారం భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రధాన పోటీ సంస్థ అయిన రిలయన్స్‌ జియో ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించిన తర్వాతి రోజే భారతీ ఎయిర్‌టెల్‌ కూడా ప్రకటించడం గమనార్హం. అంతేకాకుండా రెండున్నరేళ్లలో టెలికాం కంపెనీలు ఇంత భారీగా ఛార్జీలను సవరించడం ఇదే మొదటిసారి. వివిధ పథకాలకు సంబంధించి పెరిగిన టారిఫ్‌ల వివరాలు ఇలా.. 

  • అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ పథకాల టారిఫ్‌లు 11% వరకు పెరిగాయి. రూ.179 ప్లాన్‌ ధర రూ.199కు; రూ.455 ప్లాన్‌ రూ.509కు; రూ.1,799 ప్లాన్‌ రూ.1,999కు పెరిగింది.
  • రోజువారీ డేటా పథకం విభాగంలో 56 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే రూ.479 పథకం ఛార్జీని రూ.579కు (20.8% పెంపు) పెంచారు. 
  • 28 రోజుల వర్తింపుతో రోజుకు 1 జీబీ డేటా లభించే పథకం ఛార్జీని రూ.265 నుంచి రూ.299కు, రోజుకు 1.5 జీబీ డేటా పథకం ఛార్జీని రూ.299 నుంచి రూ.349కు ఎయిర్‌టెల్‌ పెంచింది.  
  • అత్యధికంగా 84 రోజుల కాలపరిమితి ఉండే పథకాల కోసం ఇకపై చందాదార్లు రూ.140 అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. రోజుకు  1.5 జీబీ డేటా లభించే పథకానికి ఛార్జీ రూ.719 నుంచి    రూ.859కు; రోజుకు 2 జీబీ డేటా లభించే డేటా పథకానికి ఛార్జీ రూ.839 నుంచి రూ.979కు పెరిగింది. 
  • యాడ్‌ ఆన్‌ డేటా పథకాలు కూడా ప్రియమయ్యాయి. ఒక్క రోజు చెల్లుబాటు అయ్యే 1 జీబీ డేటా కోసం ఇకపై రూ.22తో రీఛార్జ్‌ చేసుకోవాలి. ఇంతకుముందు ఇది రూ.19గా ఉండేది. 2 జీబీ రీఛార్జీ ధర రూ.29 నుంచి రూ.33కు పెరిగింది. 65 రోజుల పాటు వర్తించే 4జీబీ యాడ్‌ఆన్‌ డేటా పథకం ధరను రూ.65 నుంచి రూ.77కు ఎయిర్‌టెల్‌ సవరించింది. 
  • పోస్ట్‌ పెయిడ్‌ ఛార్జీలు 10-20% మేర పెరగనున్నాయి. వినియోగదార్లు వాళ్లు ఎంచుకున్న పథకం, ప్రయోజనాల ఆధారంగా ఈ పెంపు రూ.50-200 మేర ఉండొచ్చు.
  • కొత్త టారిఫ్‌లు భారతీ హెగ్జాకామ్‌ లిమిటెడ్‌కున్న సర్కిళ్లతో పాటు అన్ని సర్కిళ్లకు వర్తిస్తాయని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. 
  • వొడాఫోన్‌ ఐడియా కూడా  మొబైల్‌ టారిఫ్‌లను జులై 4 నుంచి 11-24% వరకు పెంచుతున్నట్లు తెలిపింది. 28 రోజులు వర్తించే మొబైల్‌ సేవల ప్రారంభ స్థాయి ప్లానును రూ.179 నుంచి రూ.199కి పెంచింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని