Today Stock Market: రికార్డుల పరుగుకు విరామం

మూడు రోజుల రికార్డుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్‌ షేర్లలో మదుపర్ల లాభాల స్వీకరణతో గరిష్ఠ స్థాయుల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ వెనక్కి వచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 83.34 వద్ద ముగిసింది.

Published : 29 Jun 2024 03:01 IST

సమీక్ష

మూడు రోజుల రికార్డుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్‌ షేర్లలో మదుపర్ల లాభాల స్వీకరణతో గరిష్ఠ స్థాయుల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ వెనక్కి వచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 83.34 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.89% లాభంతో 87.16 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

  • బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ జీవనకాల గరిష్ఠమైన రూ.439.24 లక్షల కోట్లు (5.26 లక్షల కోట్ల డాలర్లు)కు చేరింది.
  • సెన్సెక్స్‌ ఉదయం 79,457.58 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అనంతరం అదే జోరు కొనసాగిస్తూ.. ఇంట్రాడేలో 79,671.58 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. గరిష్ఠాల్లో అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్న సూచీ 78,905.89 పాయింట్లకు పడిపోయింది. చివరకు 210.45 పాయింట్ల నష్టంతో 79,032.73 వద్ద ముగిసింది. నిఫ్టీ 33.90 పాయింట్లు తగ్గి 24,010.60 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 24,174 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 నష్టపోయాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.61%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.05%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.80%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.60%, కోటక్‌ బ్యాంక్‌ 1.41%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.25%, మారుతీ 1.23%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.76% నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్‌ 1.86%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.31%, నెస్లే 0.98%, టైటన్‌ 0.62% రాణించాయి. బీఎస్‌ఈలో 2180 షేర్లు లాభపడగా,  1725 స్క్రిప్‌లు నష్టపోయాయి. 107 షేర్లలో ఎటువంటి మార్పులేదు.
  • గుజరాత్‌లో రెండు 200 మెగావాట్‌ సోలార్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు గుజరాత్‌ ఉర్జ వికాస్‌ నిగమ్‌ (జీయూవీఎన్‌ఎల్‌)తో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ, ఇంధన సొల్యూషన్స్‌ అందించే ఇంజీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 
  • 24 అంకుర సంస్థలకు తోడ్పాటు ఇచ్చేందుకు స్పేస్‌ యాక్సెలరేటర్‌ ప్రోగ్రామ్‌ను అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌(ఏడబ్ల్యూఎస్‌) శుక్రవారం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం కాలవ్యవధి 14 వారాలు. 
  • ఇండిక్‌ లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (ఎల్‌ఎల్‌ఎమ్‌) ప్రాజెక్ట్‌ ఇండస్‌ను టెక్‌ మహీంద్రా ఆవిష్కరించింది. మొదటి దశ ఇండస్‌ ఎల్‌ఎల్‌ఎమ్‌ను హిందీ భాష కోసం రూపొందించారు. 
  • హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లో అమెరికాకు చెందిన ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 0.46 శాతం వాటాకు సమానమైన రూ.1788 కోట్ల విలువైన షేర్లను శుక్రవారం బహిరంగ మార్కెట్‌ లావాదేవీల్లో విక్రయించింది. 

ఐపీఓ సమాచారం

  • అదరగొట్టిన స్టాన్లీ లైఫ్‌స్టైల్స్‌: లగ్జరీ ఫర్నీచర్‌ బ్రాండ్‌ స్టాన్లీ లైఫ్‌స్టైల్స్‌ షేర్లు అరంగేట్రంలో అదరగొట్టాయి. ఇష్యూ ధర రూ.369తో పోలిస్తే బీఎస్‌ఈలో షేరు 35.23% లాభంతో రూ.499 వద్ద నమోదైంది. ఇంట్రాడేలో 38.21% పెరిగి రూ.510 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 28.45% లాభపడి రూ.474 వద్ద ముగిసింది. తొలిరోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.2,702.62 కోట్లుగా నమోదైంది.
  • ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఐపీఓ జులై 3న ప్రారంభమై 5న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.960-1008 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.1,952 కోట్లు సమీకరించనుంది. జులై 2న యాంకర్‌ మదుపర్లు బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. రిటైల్‌ మదుపర్లు కనీసం 14 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • స్టీల్‌ వైర్‌ తయారీ సంస్థ బన్సల్‌ వైర్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ జులై 3-5 తేదీల్లో జరగనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.243- 256 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.745 కోట్లు సమీకరించనుంది. రిటైల్‌ మదుపర్లు కనీసం 58 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
  • వ్రజ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి 119 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 61,38,462 షేర్లను ఆఫర్‌ చేయగా, 73,07,13,312 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఎన్‌ఐఐల నుంచి 208.81 రెట్లు, క్యూఐబీ విభాగంలో 163.90 రెట్లు, రిటైల్‌ విభాగంలో 54.93 రెట్ల స్పందన వచ్చింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని