House sales: హైదరాబాద్‌ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి

హైదరాబాద్‌లో 2024 జనవరి-జూన్‌లో 18,573 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయమైనట్లు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక తెలిపింది.

Updated : 05 Jul 2024 07:16 IST

దేశంలో 11 ఏళ్ల గరిష్ఠానికి గృహ విక్రయాలు
జనవరి-జూన్‌పై నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక

దిల్లీ: హైదరాబాద్‌లో 2024 జనవరి-జూన్‌లో 18,573 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయమైనట్లు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక తెలిపింది. గతేడాది ఇదే సమయంలో విక్రయమైన ఇళ్ల సంఖ్యతో పోలిస్తే, ఈ సంఖ్య 21% అధికమని వివరించింది. ఇదే సమయంలో కార్యాలయ స్థలాలకు గిరాకీ 71% అధికమై 50 లక్షల చదరపు అడుగులకు చేరినట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగానూ స్థిరాస్తి విపణి ఉత్సాహంగా  ఉందని పేర్కొంది. హైదరాబాద్‌ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు, ఈ ఏడాది జనవరి-జూన్‌లో 11% పెరిగి 1.73 లక్షలకు చేరాయని పేర్కొంది. ఇది 11 ఏళ్ల గరిష్ఠ స్థాయి కావడం విశేషం. కార్యాలయాల స్థలాలకు గిరాకీ 33% పెరిగి, 3.47 కోట్ల చదరపు అడుగులకు చేరిందని   నివేదిక తెలిపింది.  ప్రీమియం గృహాల విక్రయాలు 2024 ప్రథమార్ధంలో 34% పెరిగాయి.  ‘దేశీయ స్థిరాస్తి విపణి కొన్ని త్రైమాసికాలుగా వృద్ధి పథంలో కొనసాగుతోంది. బలమైన ఆర్థిక మూలాలు, స్థిరమైన సామాజిక రాజకీయ పరిస్థితులు వృద్ధికి దోహదం చేస్తున్నాయి. అందుకే గృహ, కార్యాలయాల స్థలాలకు గిరాకీ గరిష్ఠ స్థాయిలకు చేరింద’ని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఛైర్మన్, ఎండీ శిశిర్‌ బైజాల్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని