Hospitality sector: ఆతిథ్య రంగంలో 10 లక్షల ఉద్యోగాలు!

వచ్చే కొన్నేళ్లలో ఆతిథ్య రంగం సుమారు 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Published : 30 Jun 2024 03:13 IST

వచ్చే కొన్నేళ్లలో రావొచ్చని విశ్లేషకుల అంచనా

ముంబయి: వచ్చే కొన్నేళ్లలో ఆతిథ్య రంగం సుమారు 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి తర్వాత ఈ రంగం వేగంగా విస్తరిస్తోందని, అయితే ఈ రంగంలో ప్రతిభావంతుల కొరత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతిభావంతుల గిరాకీ-సరఫరా వ్యత్యాసం సుమారు 55-60 శాతం మధ్య ఉన్నట్లు అంచనా. 

  • ఆతిథ్య రంగంలో అవసరమైన మేరకు ప్రతిభావంతులు ఉండట్లేదని ప్రొఫెషనల్‌ టాలెంట్‌ సొల్యూషన్స్‌ ర్యాండ్‌స్టాడ్‌ ఇండియా డైరెక్టర్‌ సంజయ్‌ శెట్టి వెల్లడించారు. కొవిడ్‌ తర్వాత ఈ రంగంలో ఉద్యోగాలకు ఒక్కసారిగా గిరాకీ పెరగడంతోనే కొరత ఏర్పడిందని, వచ్చే కొన్నేళ్లపాటు ఈ ధోరణి కొనసాగుతుందని పేర్కొన్నారు. కనీసం 10 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. 
  • కొవిడ్‌ తర్వాత మొత్తం నియామకాలు నాలుగు రెట్లు పెరిగాయి. గత రెండేళ్లలో అత్యధికులు కోరినట్లుగా ప్రారంభ స్థాయి (ఎంట్రీ లెవెల్‌) ఉద్యోగాలు ఆవిర్భవించాయని పరిశ్రమ దిగ్గజాలు పేర్కొన్నారు.
  • కొన్ని కంపెనీలు ఇప్పటికే ఉన్న వారికి నైపుణ్యాలు అభివృద్ధి చేసి వారి ప్రతిభను పెంచుతున్నాయి. మరోవైపు కొరతను పూరించడానికి ఇతర పరిశ్రమల నుంచి నియమించుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు ప్రతిభావంతులను నిలుపుకోవడానికి పోటీ వేతనాలు, ప్రయోజనాలు అందిస్తున్నాయి.
  • ‘2023లో పర్యాటక, ఆతిథ్య పరిశ్రమ సుమారు 1.11 కోట్ల మందికి ఉపాధిని కల్పించింది. 2024 చివరకు 1.18 కోట్ల మంది అవసరమవుతారని అంచనా వేస్తున్నాం. 2028 నాటికి గిరాకీ 16.5 శాతం వార్షిక వృద్ధితో 1.48 కోట్లకు చేరుతుంద’ని టీమ్‌లీజ్‌ డిగ్రీ అప్రెంటిస్‌షిప్‌ వైస్‌ ప్రెసిడెంట్, బిజినెస్‌ హెడ్‌ ధృతి ప్రసన్న మహంత పేర్కొన్నారు. 
  • భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లు ప్రస్తుతం మానవ వనరులు లేవని స్టాఫింగ్‌ టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్, బిజినెస్‌ హెడ్‌ ఎ.బాలసుబ్రమణియన్‌ వెల్లడించారు. 2023లో టూరిజమ్‌ అండ్‌ హాస్పిటాలిటీ స్కిల్‌ కౌన్సిల్‌ (టీహెచ్‌ఎస్‌సీ) అందించిన గణాంకాల ప్రకారం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌లో అందుబాటులో ఉన్న సీట్లలో కొన్నింటిని మాత్రమే నింపారని పేర్కొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని