YSRCP: పిన్నెల్లి అరెస్టు

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు అరాచకం సృష్టించిన పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, తాజా ఎన్నికల్లో ఆ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు.

Updated : 27 Jun 2024 07:06 IST

ఈవీఎం ధ్వంసం, సీఐపై హత్యాయత్నం 
సహా మరో 2 కేసుల్లో చర్యలు
అంతకుముందే ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు 
బెయిలిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని వెల్లడి 
ఈనాడు - అమరావతి ఈనాడు డిజిటల్‌ - నరసరావుపేట

అరెస్టు అనంతరం పిన్నెల్లిని నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసు బలగాలు 

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు అరాచకం సృష్టించిన పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, తాజా ఎన్నికల్లో ఆ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. పిన్నెల్లి పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన గంటలోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్‌ రోజు రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన తెదేపా పోలింగ్‌ ఏజెంట్‌పై దాడి చేయడంపై రెంటచింతల పోలీసులు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. పోలింగ్‌ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసిన కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై కారంపూడి పోలీసులు కేసులు పెట్టారు. ఈ నాలుగింటిలోనూ పిన్నెల్లి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కానీ, ఇన్నాళ్లు అరెస్టు చేయకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మొదట జూన్‌ 6 వరకూ అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మే 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు ఇప్పటికే 3 సార్లు పొడిగించడంతో పిన్నెల్లి పోలీసుల ఆధీనంలో ఉంటూ ప్రతి రోజూ ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేస్తున్నారు. ఈ వెసులుబాటు గడువు ముగియడం, బెయిల్‌ పిటిషన్లనూ హైకోర్టు రద్దు చేయడంతో బుధవారం నరసరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్న ఆయన్ను నరసరావుపేట రూరల్‌ సీఐ మల్లికార్జున్‌ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీసు వాహనంలో కాకుండా పిన్నెల్లి సొంత కారులోనే ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఈ కేసులను విచారిస్తున్న గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు, కారంపూడి సీఐ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. నరసరావుపేట ప్రభుత్వ ప్రధాన ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బందోబస్తు మధ్య నరసరావుపేట నుంచి గురజాల మీదుగా మాచర్ల కోర్టుకు తరలించారు. అయితే.. అదుపులోకి తీసుకున్నాక ఎస్పీ కార్యాలయానికి తరలించే క్రమంలో పిన్నెల్లి సొంత వాహనం ఉపయోగించడం విమర్శలకు దారితీసింది.

వైద్య పరీక్షల కోసం పిన్నెల్లిని ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు

అలవాటుగా నేరాలకు పాల్పడుతున్నారు

అరెస్టుకు ముందు పిన్నెల్లి దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. నాలుగు కేసుల్లో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని పిన్నెల్లి హైకోర్టులో వ్యాజ్యాలు వేయగా.. బుధవారం మధ్యాహ్నం వాటన్నింటినీ న్యాయస్థానం కొట్టేసింది. బెయిలు మంజూరు చేస్తే నేర ఘటనలను పునరావృతం చేసే అవకాశముందని అభిప్రాయపడింది. బెయిలు మంజూరుకు సరైన కారణాలు లేవని తేల్చిచెప్పింది. నేర ఘటనల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పిటిషన్లను కొట్టేస్తున్నట్లు వెల్లడించింది. పిటిషనర్‌ మొత్తం 11 కేసుల్లో నిందితుడని, అలవాటు ప్రకారం నేరాలకు పాల్పడుతున్నారని, గత ఎన్నికల్లోనూ ఇదే తరహా నేరాలు చేశారని పోలీసులు వివరాలు సమర్పించారని తెలిపింది. బెయిలు ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, నిష్పాక్షిక దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఈ కేసుల్లో దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని తెలిపింది. మరోవైపు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలుందన్న కారణంతో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద పోలీసులు నిందితుడికి నోటీసు ఇవ్వడం తప్పనిసరి కాదంది. నోటీసులు ఇవ్వాలా లేదా అనేది దర్యాప్తు అధికారిదే విచక్షణాధికారం అని తేల్చిచెప్పింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని 4 పిటిషన్లను కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు తీర్పు ఇచ్చారు.

ముందస్తు బెయిలు కోసం పిన్నెల్లి  దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల హైకోర్టులో వాదనలు ముగియగా.. బుధవారం న్యాయమూర్తి నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ కేసుల్లో పోలీసుల తరఫున న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్, పిన్నెల్లి దాడి బాధితుల తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పిన్నెల్లి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

పటిష్ఠ బందోబస్తు మధ్య తరలింపు: నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో అదుపులోకి తీసుకున్న పిన్నెల్లిని పోలీసులు పటిష్ఠ బందోబస్తు మధ్య ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఎస్పీ కార్యాలయం లోపలికి పిన్నెల్లి కుమారుడు, ఒక న్యాయవాదిని మాత్రమే అనుమతించారు. అక్కడి నుంచి అంతే బందోబస్తుతో జిల్లా వైద్యశాలకు, తిరిగి ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఎనిమిది పోలీసు వాహనాల మధ్య గురజాల మీదుగా మాచర్ల కోర్టుకు తరలించారు. 

కోర్టులో హాజరు: బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు పిన్నెల్లిని మాచర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కోర్టు లోపలికి తీసుకెళుతున్న క్రమంలో పిన్నెల్లితో తెలుగు యువత కార్యదర్శి కొమెర శివ ఎదురుగా నిలబడి, కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన అసహనంతో శివ కడుపులో కొట్టారు. అంతకు ముందు నరసరావుపేట ఆసుపత్రిలో వైద్యపరీక్షలకు తీసుకెళుతుండగా వీడియో చిత్రీకరిస్తున్న స్థానికుణ్ని కూడా మాజీ ఎమ్మెల్యే నెట్టేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని