YS Jagan: జగనన్న మోసం.. రూ.10 వేల కోట్లపైనే!

పంటల బీమా కంపెనీల ప్రీమియం బకాయి రూ. 1,252 కోట్లు.. అది కట్టకపోతే పరిహారం అందదు. సూక్ష్మ సేద్య పరికరాలు అమ్మిన కంపెనీలకు బకాయి రూ. 1,170 కోట్లు.. చెల్లించకపోతే రైతుకు పరికరాలందవు.

Updated : 04 Jul 2024 06:33 IST

ధాన్యం రైతులకు రూ.1,690 కోట్లివ్వాలి
పంటల బీమా ప్రీమియం బకాయిలే రూ.1,252 కోట్లు 
సూక్ష్మ సేద్య సంస్థలకు రెండేళ్లలో రూ.1,170 కోట్ల బాకీ 
రాయితీ పథకాల చెల్లింపుల్లోనూ రైతులకు మొండిచేయే
వ్యవసాయ, అనుబంధ శాఖలు, పౌరసరఫరాల సంస్థల్లో పరిస్థితి ఇది 

ఈనాడు, అమరావతి: పంటల బీమా కంపెనీల ప్రీమియం బకాయి రూ. 1,252 కోట్లు.. అది కట్టకపోతే పరిహారం అందదు. సూక్ష్మ సేద్య పరికరాలు అమ్మిన కంపెనీలకు బకాయి రూ. 1,170 కోట్లు.. చెల్లించకపోతే రైతుకు పరికరాలందవు. రబీలో ధాన్యం రైతులకు బకాయి రూ. 1,690 కోట్లు.. ఇవ్వకపోతే ఖరీఫ్‌ పెట్టుబడికి ఇబ్బందే. వ్యవసాయ, ఉద్యాన రైతులకు బకాయి రూ. 1,865 కోట్లు.. లేదంటే పథకాల అమలు కష్టమే! జగన్‌ ప్రభుత్వ ఘనకార్యం ఇది. వ్యవసాయ, అనుబంధ శాఖలతోపాటు పౌరసరఫరాలశాఖ పరిధిలోనే సుమారు రూ. 10 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారు. చివరకు రైతులకు ధాన్యం డబ్బులు కూడా ఇవ్వకుండా.. తన ఇంటి గుత్తేదారుల కోసం సర్కారు ఖజానా ఖాళీ చేశారు. మూడేళ్లపాటు సూక్ష్మసేద్యాన్ని అటకెక్కించిన వైకాపా ప్రభుత్వం చివరి రెండేళ్లు అంతంతమాత్రంగానే అమలు చేసింది. దానికీ రూ. 1,170 కోట్లు బకాయిలే. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వకపోగా.. కేంద్ర నిధులతో కలిపి రూ. 1,800 కోట్లకు పైగా మళ్లించారు. ఇంత పెద్ద ఎత్తున బకాయిలున్నాయని ఇప్పుడు నివేదికలిచ్చిన అధికారులే.. నెల కిందటి వరకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తోందని వెనకేసుకొస్తూ ప్రకటనలివ్వడం గమనార్హం. పంటల బీమా ప్రీమియం మొదలుకొని పశునష్టపరిహారం, సున్నా వడ్డీ రాయితీ తదితర పథకాల వరకు ఇదే రీతిన వ్యవహరించారు. ఇప్పుడేమో 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ బకాయిల్ని కూడా కలిపి లెక్కలు వల్లె వేశారు. 

వ్యవసాయశాఖలో రూ.3 వేల కోట్లకు పైనే 

వ్యవసాయశాఖ పరిధిలో మొత్తం బకాయిలు రూ.3 వేల కోట్లకు పైనే ఉన్నాయి. ఇందులో బీమా సంస్థలకు రాష్ట్ర వాటా, రైతు వాటా కింద రూ. 1,251 కోట్లు జమ చేయాలి. దీన్ని విడుదల చేస్తున్నామంటూ డిసెంబరులోనే అధికారులు వైకాపా సర్కారుకు వంత పాడినా నేటికీ ఇవ్వలేదు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్ర పథకాల కింద చెల్లించాల్సిన మొత్తం రూ. 1,385 కోట్ల బకాయిలున్నాయి. ఇందులో ఆర్‌కేవీవై, ఇతర పథకాల కింద చెల్లించాల్సిన మొత్తమే రూ. 378 కోట్లు. విత్తన రాయితీల కింద మొత్తం రూ. 685 కోట్లు బకాయిలు ఉండగా.. 2019-24 మధ్య ఇవ్వాల్సిందే రూ. 499 కోట్లు అని తేల్చారు. వ్యవసాయ యంత్ర పరికరాల రాయితీ కింద రూ.40 కోట్లతోపాటు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం కూడా నిలిచిపోయింది. ఎరువులకు సంబంధించి మొత్తం రూ. 250 కోట్ల వరకు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రైతుభరోసా కేంద్రాల ఫైబర్‌నెట్, విద్యుత్తు ఛార్జీలు, స్మార్ట్‌ టీవీల పేరుతో రూ. 50 కోట్లు బకాయిపడింది. రబీ కరవుకు సంబంధించి రూ. 164 కోట్లు చెల్లించాలి. 

ఉద్యాన శాఖలో సూక్ష్మ సేద్య బకాయిలే  రూ.1,167 కోట్లు

ఉద్యాన శాఖలో మొత్తం రూ. 1,645 కోట్లు బకాయిలు పెట్టారు. ఇందులో సూక్ష్మసేద్య బకాయిల కింద 2022-23 సంవత్సరానికి రూ. 560.50 కోట్లు, 2023-24కి రూ. 606.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆయిల్‌పామ్‌ రైతులకు రూ. 238.50 కోట్లు, ఎంఐడీహెచ్, ఆర్‌కేవీవై పథకాల కింద బకాయిలు రూ. 240 కోట్లు ఉన్నాయి. రైతులకు రాయితీలు కూడా విడుదల చేయకుండా సతాయించారు. 

పశుసంవర్ధకశాఖలో రూ.562 కోట్లు

పశుసంవర్ధకశాఖ పరిధిలో పశునష్టపరిహార పథకానికి రూ. 126 కోట్ల బకాయిలున్నాయి. 1962 పథకం కింద అంబులెన్స్‌ల నిర్వహణకు రూ. 111 కోట్లు, మందులకు రూ. 66 కోట్లు, వ్యాక్సిన్లకు రూ. 21 కోట్లు, మినీ గోకులాలకు రూ. 178 కోట్లతోపాటు గడ్డి విత్తనాలు, దాణా, సరఫరాదారులకు కూడా ప్రభుత్వం భారీగా బాకీ పడింది.

సహకార సంఘాలకు ధాన్యం కొనుగోలు కమీషన్‌ బకాయిలే రూ.947 కోట్లు 

ధాన్యం కొనుగోలుకు సంబంధించి సహకార పరపతి సంఘాలకు కమీషన్‌ చెల్లిస్తారు. దీనికిగాను పౌరసరఫరాల సంస్థ నుంచి రావాల్సిన బకాయిలు రూ. 947 కోట్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఇందులో 2019-20 నుంచి రూ.2023-24 మధ్య సేకరణకు సంబంధించి రూ. 821 కోట్లు ఇవ్వాల్సి ఉంది. సహకార సంఘాల కంప్యూటరీకరణకు సంబంధించి రూ. 40 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వడ్డీ రాయితీ, ఇతర పథకాల రూపంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీ మొత్తం రూ. 414 కోట్లు. ఇంటిగ్రేటెడ్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు (ఐసీడీపీ) కింద ఎన్‌సీడీసీ నుంచి విడుదలైన నిధుల్లో ఇంకా ఖర్చు చేయాల్సిన రూ. 261 కోట్లు కూడా ప్రభుత్వ ఖాతాల్లోనే చేరాయి. ఇవన్నీ ఇలా పక్కన పెట్టేసి.. వ్యవసాయ మౌలిక సౌకర్యాల నిధి కింద గోదాముల నిర్మాణానికి రూ. 313 కోట్ల విలువైన పనులు చేస్తే రూ. 240 కోట్లు చెల్లించేశారు. ఇవన్నీ వైకాపా గుత్తేదారులు, అందులోనూ వైకాపా నేతల సన్నిహితులు చేసిన పనులు కావడంతో ఆఘమేఘాలపై చెల్లించేశారు.


పౌరసరఫరాల సంస్థలో రూ.3,500 కోట్ల బాకీలు

పౌరసరఫరాల శాఖను వైకాపా సర్కారు అప్పులమయంగా మార్చింది. గత ఐదేళ్లలోనే సుమారు రూ.20 వేల కోట్ల అప్పులు తెచ్చింది. వీటితో కలిపి సంస్థ మొత్తం అప్పులు రూ.36 వేల కోట్లకు పైమాటే. ధాన్యం రైతులతోపాటు సరఫరాదారులకు చెల్లించాల్సింది రూ. 3,500 కోట్లు ఉంది. ఇందులో ధాన్యం బకాయిలే రూ. 1,700 కోట్లు. వాటిని సాధ్యమైనంత త్వరగా ఇవ్వకపోతే 83 వేల మంది రైతులు ఖరీఫ్‌ సాగుకు తీవ్ర ఇబ్బందులు పడతారు. సోమవారం నిర్వహించిన మీకోసం- ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అధిక శాతం వినతులు ధాన్యం రైతుల నుంచే వచ్చాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచే ఎక్కువ మంది ఫిర్యాదులు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అన్నదాతల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని