భారీ వర్షాలపై అప్రమత్తం

‘భారీ వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎల్లో అలర్ట్‌ జారీ చేశాం. ఐఎండీ అంచనాల ప్రకారం సాధారణంకంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

Updated : 29 Jun 2024 06:34 IST

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎల్లో అలర్ట్‌ జారీ
8 జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత వర్చువల్‌ సమావేశం

ఈనాడు డిజిటల్, అమరావతి: ‘భారీ వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎల్లో అలర్ట్‌ జారీ చేశాం. ఐఎండీ అంచనాల ప్రకారం సాధారణంకంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి’ అని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయాలని సూచించారు. విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధిక వర్షాలతో ప్రభావితమవుతున్న జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వర్చువల్‌గా సమీక్షించారు. ‘తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గోదావరి, వంశధార, నాగావళి తదితర నదుల్లోకి నీరు చేరుతోంది. లోతట్టు ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించాలి. గోదావరి, కృష్ణా నదీపరివాహక జిల్లాల్లో క్షేత్రస్థాయిలో వరద ప్రవాహాన్ని పరిశీలిస్తూ చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు. 


12 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం

‘జూన్‌లో ఇప్పటివరకు 12 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రెండు రోజుల్లో అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 184 మి.మీ. కురిసింది. తరచూ వరదలు సంభవించే ప్రాంతాల్లో చెరువులు, వాగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి’ అని మంత్రి అనిత సూచించారు. ‘రాష్ట్ర అత్యవసర నిర్వహణ కేంద్రాన్ని మంత్రి అనిత పరిశీలించారు. రాష్ట్ర విపత్తుల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని