Hanuma vihari: మళ్లీ ఆంధ్రా జట్టుకు ఆడతా: క్రికెటర్‌ హనుమ విహారి

మంత్రి నారా లోకేశ్‌ భరోసాతో మళ్లీ ఆంధ్రా క్రికెట్‌ జట్టు తరఫున ఆడాలని నిర్ణయించుకున్నానని మాజీ కెప్టెన్‌ హనుమ విహారి స్పష్టం చేశారు.

Updated : 26 Jun 2024 08:12 IST

మంత్రి లోకేశ్‌తో చర్చల అనంతరం ప్రకటన
వైకాపా ప్రభుత్వంలో తీవ్ర అవమానాలతో కెప్టెన్సీకి రాజీనామా 

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో క్రికెటర్‌ హనుమ విహారి

ఈనాడు డిజిటల్, అమరావతి: మంత్రి నారా లోకేశ్‌ భరోసాతో మళ్లీ ఆంధ్రా క్రికెట్‌ జట్టు తరఫున ఆడాలని నిర్ణయించుకున్నానని మాజీ కెప్టెన్‌ హనుమ విహారి స్పష్టం చేశారు. జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తానని మంగళవారం తెలిపారు. సచివాలయంలో మంత్రి లోకేశ్‌ను కలిసిన అనంతరం విహారి విలేకర్లతో మాట్లాడారు. ‘వైకాపా ప్రభుత్వంలో జరిగిన అవమానాలను లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లాను. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)తో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. మన జట్టును అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాలని చెప్పారు. గతంలో జట్టును ఆరుసార్లు సెమీస్‌కు తీసుకెళ్లాను. గత ప్రభుత్వం నా ప్రతిభను తొక్కేసింది. తాము చెప్పిన వారిని జట్టులో చేర్చుకోలేదని నాటి ఏసీఏ పెద్దలు కుట్ర పన్నారు. నేను ఉంటే వాళ్లకు ఇబ్బందని భావించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ గత పాలకులు నన్ను ఇబ్బందులు పెట్టారు. వైకాపా ప్రభుత్వంలో జరిగిన అవమానంతో ఆంధ్రా జట్టును వదిలేయడానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) కూడా తీసుకున్నాను. నేను ఇబ్బందులు పడినప్పుడు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేశ్‌ అండగా నిలిచారు’ అని తెలిపారు.

మంత్రి లోకేశ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న హనుమ విహారి

హనుమ విహారికి స్వాగతం: లోకేశ్‌ 

మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అవమానకరమైన పరిస్థితుల్లో ఆంధ్రా క్రికెట్‌ జట్టు కెప్టెన్సీని వదులుకున్న తెలుగుతేజం హనుమ విహారికి రాష్ట్ర ప్రభుత్వం విశేష గౌరవంతో స్వాగతం పలుకుతోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌  మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడైన శరత్‌చంద్రారెడ్డిని ఏసీఏ అధ్యక్షుడిగా నియమించిన గత ప్రభుత్వం.. క్రికెట్లో రాజకీయ క్రీడ మొదలుపెట్టింది. 17వ స్థానంలో ఉన్న వైకాపా నాయకుడి కుమారుడు కుంట్రపాక పృథ్వీరాజ్‌ను ప్రోత్సహించడానికి అసమాన ప్రతిభాపాటవాలున్న హనుమ విహారిని ఏసీఏ తీవ్రంగా వేధించింది. విహారి విశేషానుభవం ఇతరులకు అందకుండా అడ్డుపడింది. ఇతర రాష్ట్రాల జట్టుకు నేతృత్వం వహించేందుకు నిరభ్యంతర పత్రం ఇవ్వడానికి కూడా ఆయన్ను ఇబ్బంది పెట్టారంటే.. ఎంత కక్షపూరితంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు.’ అని తెలిపారు. 

ఉపముఖ్యమంత్రి పవన్‌ను కలిసిన హనుమ విహారి

 ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను ఆంధ్రా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ హనుమ విహారి కలిశారు. జనసేన కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వైకాపా హయాంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా పవన్‌కు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు