Chandra babu: ఎయిమ్స్‌కు నీటి సమస్య తీర్చకపోవడం బాధాకరం

వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌కు నీటి సమస్య తీర్చకపోవడంపై సీఎం చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు.

Published : 29 Jun 2024 03:51 IST

ఎయిమ్స్‌ను దేశంలోనే టాప్‌-3లో ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం
డైరెక్టర్‌ మాధవానంద కార్‌కు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబును కలిసిన మంగళగిరి ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మాధవానంద కార్‌ 

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌కు నీటి సమస్య తీర్చకపోవడంపై సీఎం చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. సాంకేతిక, ఆర్థిక సమస్యలతో ఎయిమ్స్‌కు తాగునీటి సరఫరా పనులు నిలిచిపోవడం సరికాదని, సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మంగళగిరి ఎయిమ్స్‌ డైరెక్టర్‌ మాధవానంద కార్‌ శుక్రవారం కలిశారు. నీటి కొరతతో సేవలను విస్తరించలేకపోతున్నామని, పైపులైన్‌ పనులు నిలిచిపోయాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రోజుకు ఏడు ఎంఎల్‌డీ నీరు అవసరం కాగా.. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా కేవలం రెండు ఎంఎల్‌డీలే వస్తున్నాయని తెలిపారు. ఎయిమ్స్‌ తాగునీటి సమస్యను గత ప్రభుత్వం ఐదేళ్లలో పట్టించుకోకపోవడంపై సీఎం చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. ఎయిమ్స్‌ను దేశంలోనే టాప్‌-3లో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. విద్యుత్తు సరఫరా విషయంలోనూ సమస్యలు ఉన్నాయని, 192 ఎకరాలకు గాను 182 ఎకరాలు ఇచ్చారని, మరో పదెకరాలు ఇస్తే విస్తరిస్తామని సీఎం దృష్టికి డైరెక్టర్‌ తెచ్చారు. ఎయిమ్స్‌లో సదుపాయాలను ఒకసారి వచ్చి పరిశీలించాలని సీఎం చంద్రబాబును డైరెక్టర్‌ ఆహ్వానించారు. తెదేపా ప్రభుత్వంలో రూ.1,618 కోట్ల కేంద్ర నిధులతో మంగళగిరిలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేశారు. నిర్మాణానికి అవసరమైన భూములు, అనుమతులు ఇచ్చిన నాటి తెదేపా ప్రభుత్వం.. వేగంగా పనులు పూర్తిచేయించింది. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక సంస్థను సమస్యలు చుట్టుముట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని