Polavaram project: పోలవరం విధ్వంసం.. రూ.వేల కోట్ల నష్టం

జగన్‌ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 29 Jun 2024 06:44 IST

ప్రాజెక్టు అంచనాలకు మించి దెబ్బతింది 
ఆ నిర్మాణాలను చూస్తే ఏడుపొచ్చింది 
జగన్‌ వల్లే పోలవరం సర్వనాశనమైంది
కేంద్ర జలసంఘమూ చేతులెత్తేసింది
కేంద్ర సాయం, అంతర్జాతీయ నిపుణుల సూచనలతో ముందుకెళతాం
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి 
పోలవరంపై శ్వేతపత్రం విడుదల 
ఈనాడు - అమరావతి 

పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసి మాట్లాడుతున్న చంద్రబాబు

గన్‌ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును ఇప్పుడు చూస్తే ఏడుపు వచ్చిందని.. బాధ, ఆవేదన కలిగిందని వాపోయారు. ఇంత విధ్వంసానికి బాధ్యులను ఏం చేయాలి? కేంద్ర ప్రాజెక్టును వారు చెప్పినట్లు వినకుండా రివర్స్‌ టెండర్లు నిర్వహించి గోదాట్లో ముంచెయ్యడం జగన్‌ చేసిన ద్రోహం కాదా? ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే అడిగేవారు ఉండరనుకుంటున్నారా అని నిలదీశారు. ఈ విధ్వంసంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. ఈ ద్రోహానికి బాధ్యులు రాజకీయాలకు అనర్హులని మండిపడ్డారు. కేంద్ర జలసంఘం కూడా ఏం చేయలేమని చేతులెత్తేయడంతో అంతర్జాతీయ నిపుణులను పిలిచారని, వారు అధ్యయనం చేసి డిసెంబరు నాటికి నివేదిక ఇస్తారని చెప్పారు. అన్ని సవాళ్లనూ అధిగమించి కేంద్ర సాయంతో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ముందుకెళతామని చంద్రబాబు చెప్పారు. అంతర్జాతీయ నిపుణులు, దేశీయ ఐఐటీ నిపుణులు, కేంద్ర జలసంఘం, కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో సవాళ్లను అధిగమిస్తామని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో డయాఫ్రం వాల్‌ నిర్మాణానికే మూడు, నాలుగు సీజన్లు పడుతుందన్నారు. ఆ తర్వాత ప్రధాన డ్యాం నిర్మించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న గుత్తేదారు ఏజెన్సీని మార్చడం పరిష్కారం కాదని, అన్ని కోణాల్లోనూ సమస్యను విశ్లేషించి ముందుకెళతామని చెప్పారు. జగన్‌ హయాంలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసంపై  వెలగపూడి సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 

పోలవరం ప్రాజెక్టు గురించి వివిధ సందర్భాల్లో జగన్‌ ఏమన్నారో వీడియో క్లిప్పింగ్‌లతో సహా వివరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పక్కన మంత్రి నిమ్మల రామానాయుడు  


అహంభావం ఫలితమిది

పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ) చెప్పినా వినకుండా జగన్‌ ప్రభుత్వం కక్షతో పాత గుత్తేదారును తొలగించి, కొత్త గుత్తేదారుకు ప్రాజెక్టును అప్పగించింది. ఆ క్రమంలో ఏడాదిన్నరపాటు ఎక్కడి పనులు అక్కడ వదిలేశారు. ఈలోపు వరదలొచ్చి డయాఫ్రంవాల్‌ కొట్టుకుపోయింది. ఎగువ, దిగువ కాఫర్‌డ్యామ్‌లు దెబ్బతిన్నాయి. గైడ్‌బండ్‌ కుంగిపోయింది. కేవలం జగన్‌ అహంభావం ఫలితమిది. 


దిక్కుతోచని స్థితిలో ప్రాజెక్టు

ర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ కట్టాల్సినచోట రూ.436 కోట్లతో నిర్మించిన డయాఫ్రంవాల్‌.. ఎగువ కాఫర్‌డ్యామ్‌ గ్యాప్‌లను ఏడాదిన్నరపాటు వదిలేయడం వల్ల 2020లో వచ్చిన వరదలకు కొంత భాగం కొట్టుకుపోయింది. దాన్ని ఇప్పుడు ఏం చేయాలో తేల్చలేని పరిస్థితి. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు సీపేజీ, ఇతర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. గైడ్‌బండ్‌ కుంగిపోయింది.


ఎనిమిదేళ్లు వృథా 

యాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా? కొత్తది కట్టాలా అన్నది తేల్చడానికే నిపుణుల కమిటీకి సంవత్సరం పట్టేలా ఉంది. ఆ తర్వాత దాని నిర్మాణానికి మరో నాలుగేళ్లు పడుతుంది. దెబ్బతిన్న కాఫర్‌ డ్యామ్‌లు, గైడ్‌బండ్‌లకూ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలి. ఇప్పటికే నాలుగేళ్లుగా ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం మూలన పెట్టింది. వీటన్నిటినీ పరిష్కరించి, పూర్తి చేయడానికి కనీసం నాలుగేళ్లు కావాలి. మొత్తంగా ఎనిమిదేళ్లు వృథా.


అదే అతి పెద్ద సవాల్‌

రూ.55,656 కోట్ల సవరించిన ప్రాజెక్టు అంచనాలకు కేంద్రం ఇంకా ఆమోదమే తెలపలేదు. ఇక ఈ ఖర్చులన్నీ ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడమే అతి పెద్ద సవాల్‌. రాష్ట్రానికి జీవనాడిగా మారాల్సిన పోలవరం ప్రాజెక్టుకు ఒక వ్యక్తి అహంభావం మరణశాసనం లిఖించింది.  


రూ.68 వేల కోట్ల భారం/ ఆదాయ నష్టం

- ముఖ్యమంత్రి చంద్రబాబు

కొత్త డయాఫ్రంవాల్‌ కట్టడానికే రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుంది. దాంతో పాటు కాఫర్‌డ్యామ్‌లు, గైడ్‌బండ్‌లకు మరమ్మతులు వంటి వాటికి మొత్తంగా రూ.4,900 కోట్లు ఖర్చవుతుంది. విద్యుత్‌ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయకపోవడంతో రూ.3,000 కోట్ల నష్టం జరిగింది. 2019 నాటికి సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,656 కోట్లు. ద్రవ్యోల్బణంతో 38 శాతం పెరిగితే మరో రూ.15,000 కోట్ల భారం. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంతో నీరు ఇవ్వకపోవడంతో రైతులు నష్టపోయింది రూ.45,000 కోట్లు. మొత్తంగా జగన్‌ ప్రభుత్వ మూర్ఖత్వం, అహంభావం వల్ల జరిగిన నష్టం, పడిన భారం సుమారు రూ.68 వేల కోట్లు. 


నష్టం అంతా ఇంతా కాదు

‘పోలవరం ప్రాజెక్టులో జగన్‌ చేసిన విధ్వంసం ఫలితం వేల కోట్ల నష్టం. ఇంకా పక్కా లెక్కలు తేలాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించకపోవడం వల్ల రూ.45 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ప్రాజెక్టుకు జరిగిన డ్యామేజ్, మరమ్మతు పనులకు అదనంగా రూ.4,900 కోట్లు ఖర్చవుతుంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం వల్ల పెరిగిన ధరలతో 38 శాతం మేర అదనపు భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్తు ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల రూ.3,000 కోట్ల నష్టం. ఇప్పుడు ప్రాజెక్టు పరిస్థితి చూస్తోంటే బాధ, ఆవేదన కలుగుతోంది. వైకాపా ఐదేళ్ల విధ్వంసంతో రాష్ట్రం ఎలా నష్టపోయిందో ప్రజల్లో కూలంకషంగా చర్చ జరగాలి. నీటిపారుదల ప్రాజెక్టుల విధ్వంసంపై ఒక వెబ్‌సైట్‌ ప్రారంభిస్తాం. అవాస్తవాలన్నిటికీ చెక్‌ పెట్టేలా నిజాలన్నీ ప్రజల ముందుంచుతాం.

కేంద్రం, పోలవరం అథారిటీ చెప్పినా జగన్‌ వినలేదు

జగన్‌ చేతకానితనం, అహంభావం వల్లే పోలవరం ప్రాజెక్టు దెబ్బతింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే ప్రాజెక్టు పనులు నిలిపివేశారు. అసలు ప్రాజెక్టు పరిస్థితి ఏమిటో కూడా ఆయన పరిశీలించలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే.. రివర్స్‌ టెండర్లంటూ నిర్మాణ సంస్థను మార్చేశారు. కేంద్రం, పోలవరం అథారిటీ ఎంత చెప్పినా వినలేదు. విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.. మాట వినాలని కోరారు. ప్రాజెక్టు నష్టపోతుందన్నారు. అప్పటి గుత్తేదారు పని తీరు సంతృప్తిగానే ఉంది, మార్చాల్సిన అవసరం లేదని పోలవరం అథారిటీ చెప్పింది. గుత్తేదారును మారిస్తే పనులు ఆలస్యమవుతాయని కూడా హెచ్చరించింది. ఒకే పని రెండు ఏజెన్సీలు చేస్తే నాణ్యత దెబ్బతింటుందని, ఎవరినీ బాధ్యులను చేయలేమని జల్‌శక్తిశాఖ కార్యదర్శికి కూడా లేఖ రాశారు. ఎవరెన్ని చెప్పినా, ఎంత విన్నవించినా జగన్‌ వినలేదు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదు. జగన్‌ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారు. అన్నీ తనకే తెలుసు అన్నట్లుగా వ్యవహరించారు. 

మేం చేసింది 72%.. వాళ్లు చేసింది 3.84%

పోలవరం ప్రాజెక్టులో తెదేపా హయాంలో 72 శాతం పనులు పూర్తయితే ఆ తర్వాత జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే చేసింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నిర్మాణంలో గిన్నిస్‌ రికార్డులు దక్కితే వైకాపా ప్రభుత్వానికి చీవాట్లు వచ్చాయి. కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ.3,385.58 కోట్లను కూడా జగన్‌ ప్రభుత్వం దారి మళ్లించింది. తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.11,762 కోట్ల విలువైన పనులు చేస్తే జగన్‌ హయాంలో కేవలం రూ.4,167 కోట్ల విలువైన పనులు మాత్రమే చేశారు. తెదేపా హయాంలో కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రమే రూ.4,908 కోట్లు అదనంగా వెచ్చించి పనులు చేసింది. తెదేపా హయాంలో అవినీతి జరగలేదని కేంద్ర జల్‌శక్తి శాఖ పార్లమెంటులోనే సమాధానం ఇచ్చింది. పిచ్చికుక్క అని ముద్ర వేసి కుక్కను చంపినట్లు.. మంచి ప్రాజెక్టుపై అవినీతి నెపం వేసి, విధ్వంసం చేశారు.

నిర్వాసితులను నిలువునా ముంచిన జగన్‌ 

జగన్‌ పోలవరం నిర్వాసితులను కూడా మోసం చేశారు. ఎకరానికి రూ.19 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లలో ఒక్కరికీ ఇవ్వలేదు. గతంలో భూమి ఇచ్చిన వారికి అదనంగా ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తామని ఇవ్వలేదు. ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వకపోగా లబ్ధిదారుల జాబితాలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారు. పునరావాసం కింద కొత్తగా ఒక్క ఇల్లూ నిర్మించలేదు. తెదేపా నిర్మించిన కాలనీల్లో మిగిలిన పనులు కూడా పూర్తి చేయలేదు. నిర్వాసితులు నాడు తెదేపా హయాంలో తీసుకున్న చర్యలతో సంతోషంగా ఉన్నారు. నిర్వాసితుల్లో తెలంగాణ నుంచి ఏపీలో విలీనం చేసిన మండలాల వారు మళ్లీ తెలంగాణ వెళ్లిపోతామనే పరిస్థితిని జగన్‌ తీసుకొచ్చారు. నిర్వాసితుల కోసం తెదేపా రూ.4,114 కోట్లు ఖర్చు చేస్తే జగన్‌ హయాంలో కేవలం రూ.1,687 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

అర్హతలేని వాళ్లకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది

అర్హత లేని వాళ్లకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది. కొందరు మమ్మల్ని తిట్టొచ్చు. విమర్శలు చేయొచ్చు. కాఫర్‌ డ్యామ్‌కు, డయాఫ్రం వాల్‌కు తేడా తెలియకుండా ప్రాజెక్టు వద్దకు వెళ్లి వెతుక్కునేవాళ్లు మాపై విమర్శలు చేశారు. కాఫర్‌ డ్యాంలు శాశ్వతం కాదు. నీటిని మళ్లించడానికే నిర్మించాం. వాటి కాలపరిమితి కూడా నాలుగేళ్లే. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పక్క రాష్ట్రాలకూ నీళ్లివ్వచ్చు. తెలంగాణకు కూడా సాగర్‌ కాల్వ ద్వారా నీళ్లు మళ్లించొచ్చు. నల్లమల అడవిలో టన్నెల్‌ తవ్వి బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమకు నీళ్లు అందించవచ్చు.

మన సమస్యలు కేంద్రం ముందు పెడదాం

ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలవాలని ఎన్నికల ముందు ప్రచారం చేశాం. ప్రజలు గెలిచారు. చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఇక రాష్ట్రాన్ని నిలబెట్టడంలో అందరూ భాగం కావాలి. మేం బాధ్యత తీసుకుంటాం. వైకాపా విధ్వంసంపై ఏడు శ్వేతపత్రాలు ఇస్తాం. 25 రోజుల్లోనే శ్వేతపత్రాలు ఇస్తాం. మన సమస్యలన్నీ కేంద్రం ముందు పెడదాం. కేంద్ర బడ్జెట్‌ కన్నా ముందే మనకేం కావాలో వాళ్లకు చెప్పాలి. నిధులు తెచ్చుకోవాలి. ప్రాజెక్టులు తెచ్చుకోవాలి. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లోనూ ఈ అంశాలు చర్చిద్దాం. అధికారులు, ఉద్యోగులు కూడా అదే అసహనంతో ఉన్నారు. ప్రజల కన్నా ఉద్యోగులే తెదేపాకు ఎక్కువ ఓట్లు వేశారు. మొత్తం మీద 57 శాతం ఓట్లు వేస్తే ఒక ఉద్యోగులే 63 శాతం ఓట్లు వేశారు. అధికారులు, ఉద్యోగులం అందరం కలిసి పని చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. క్రమశిక్షణతో పని చేద్దాం’ అని చంద్రబాబు చెప్పారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.


వైకాపా ప్రభుత్వ అసమర్థతతోనే నష్టం

నీతి ఆయోగ్‌ నియమించిన హైదరాబాద్‌ ఐఐటీ నిపుణుల కమిటీ కూడా జగన్‌ ప్రభుత్వ తప్పిదాలనే ఎత్తిచూపింది. ప్రభుత్వ అసమర్థ ప్రణాళిక వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు లీకవుతున్నాయి. డయాఫ్రం వాల్‌ ధ్వంసమయింది. అది బాగు చేయాలా? కొత్తది నిర్మించాలా అన్నది తేలాల్సి ఉంది. పోలవరం అనేది చాలా సున్నితమైన అంశం. జాగ్రత్తగా చేయకపోతే రెండు గోదావరి జిల్లాలు కొట్టుకుపోతాయి. సకాలంలో ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లను పూడ్చకపోవడం వల్లే 2020 వరదల్లో డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని ఐఐఐటీ కమిటీ తేల్చిచెప్పింది. డయాఫ్రం వాల్‌ను అప్పట్లో రూ.436 కోట్లతో నిర్మించాం. ఇప్పుడు కొత్తది నిర్మించాలంటే రూ.990 కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. నిర్మాణానికి కూడా మూడు, నాలుగు సీజన్లు పడుతుందంటున్నారు. జగన్‌ మూర్ఖత్వంతో చేసిన పనికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. డయాఫ్రం వాల్, ఎగువ దిగువ కాఫర్‌ డ్యాంలు, గైడ్‌బండ్‌ ఈ మూడు నష్టాలు కూడా జగన్‌ నిర్వాకం వల్లే జరిగాయి. దీంతో ప్రాజెక్టుతోపాటు విద్యుత్కేంద్రం నిర్మాణమూ ఆలస్యమవుతోంది. ప్రస్తుత సవాళ్లు అధిగమించకుండా పనులు ముందుకు సాగవు. ఇక్కడి ఇంజినీర్లు రిస్కు తీసుకోవాలన్నా భయపడుతున్నారు. కేంద్ర జలసంఘమూ చేతులెత్తేసింది. ప్రాజెక్టులో పైకి తెలిసిన డ్యామేజి కన్నా తెలియని డ్యామేజి చాలా ఉంది. 2020లోనే డయాఫ్రం వాల్‌ ధ్వంసమయినా కనీసం ఆ విషయాన్ని గుర్తించలేదు. అక్కడ సమస్య ఉన్నా 2022లోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామని 2023 నాటికి పూర్తి చేస్తామని చెబుతూ వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని