Home minister Anitha: గంజాయిని సమూలంగా నిర్మూలిస్తాం

హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో గంజాయి, ఇతర డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించడానికే పని చేస్తున్నానని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.

Published : 27 Jun 2024 04:44 IST

స్పష్టం చేసిన హోంమంత్రి అనిత  

విశాఖపట్నంలో అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న హోంమంత్రి అనిత. చిత్రంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, సీపీ రవిశంకర్, ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్, జేసీపీ ఫక్కీరప్ప

ఈనాడు, విశాఖపట్నం: హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో గంజాయి, ఇతర డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించడానికే పని చేస్తున్నానని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం విశాఖపట్నంలో ‘అవగాహన ర్యాలీ’ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారితో మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘విశాఖ పరిధిలో గంజాయి తనిఖీలకు కేవలం మూడు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని సీపీ రవిశంకర్‌ చెప్పడంపై ఆశ్చర్యపోయాను. వివిధ మార్గాల్లో జరుగుతున్న గంజాయి రవాణాను ఇలాంటి ఏర్పాట్లతో ఎంత వరకు నియంత్రించగలం? చెక్‌ పోస్టుల వద్ద సీసీ కెమెరాలను ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాం? యువత ఎవరైనా మాదక ద్రవ్యాల రవాణా అరికట్టడానికి యాప్‌ అభివృద్ధి చేయగలిగితే మా దృష్టికి తీసుకురండి’ అని పేర్కొన్నారు. గాజువాక ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్, జేసీపీ ఫక్కీరప్ప, డీసీపీ వెంకటరత్నం, డ్రగ్స్‌ నియంత్రణ విభాగ ఏడీ విజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు. 


డ్రగ్స్‌ నిర్మూలనకు కార్యాచరణ ప్రణాళిక

-డీజీపీ ద్వారకా తిరుమలరావు

డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని విజయవాడలో యువతతో ప్రతిజ్ఞ చేయిస్తున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు. 
వేదికపై డా.ఇండ్ల రామసుబ్బారెడ్డి, నగర సీపీ రామకృష్ణ, జాయింట్‌ డైరెక్టర్‌ (ప్రాసిక్యూషన్‌) రామకోటేశ్వరరావు

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో డ్రగ్స్‌ సరఫరాను వంద రోజుల్లో అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామని డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నగర పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో గంజాయి సాగు చేసే వారిని గుర్తించి, ఇతర ఆదాయ మార్గాలు చూపిస్తాం. గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెడతాం. ఇతర రాష్ట్రాలతోనూ సమన్వయం చేసుకుంటాం’ అని తెలిపారు. యువత, పాఠశాల విద్యార్థులు సైతం డ్రగ్స్‌కి అలవాటుపడటం విచారకరమని ఆయన అన్నారు. డీఎడిక్షన్, పునరావాస, అవగాహన కేంద్రాల సాయంతో మాదకద్రవ్యాల బాధితుల్లో మార్పు వచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగర సీపీ రామకృష్ణ, జాయింట్‌ డైరెక్టర్‌ (ప్రాసిక్యూషన్‌) రామకోటేశ్వరరావు, డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొని సూచనలు, సలహాలు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు