Vizag film nagar club: వైజాగ్‌ ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌పై వైకాపా పడగ

వైజాగ్‌ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ (వైజాగ్‌ ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌)పై వైకాపా స్వారీ చేస్తోంది. కల్చరల్‌ సెంటర్‌కు సాధారణంగా ఒకటే కమిటీ ఉంటుంది.

Published : 29 Jun 2024 06:24 IST

శాశ్వత ఛైర్మన్, సభ్యులుగా జగన్‌ సలహాదారుల తిష్ఠ 
రూ.38 కోట్ల క్లబ్‌ నిధులపై నీలినీడలు

వైజాగ్‌ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌  

ఈనాడు-విశాఖపట్నం: వైజాగ్‌ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ (వైజాగ్‌ ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌)పై వైకాపా స్వారీ చేస్తోంది. కల్చరల్‌ సెంటర్‌కు సాధారణంగా ఒకటే కమిటీ ఉంటుంది. ఇక్కడ మాత్రం శాశ్వత కమిటీ, మేనేజ్‌మెంట్‌ కమిటీ అని రెండిటిని గత ప్రభుత్వ హయాంలో వైకాపా నేతలు సృష్టించారు. శాశ్వత కమిటీ ఛైర్మన్‌గా, సభ్యునిగా జగన్‌ నియమించుకున్న ప్రభుత్వ సలహాదారులు సాగి దుర్గాప్రసాద్‌రాజు, లంకా శ్రీధర్‌లు ఉన్నారు. మిగిలిన సభ్యుల్లోనూ వైకాపా సానుభూతిపరులే ఎక్కువ. శాశ్వత కమిటీలో సభ్యులెవరైనా చనిపోతే వారి వారసులకే అవకాశం ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చి, క్లబ్‌పై శాశ్వతంగా పాగా వేశారు.

స్థలం, నిధులు ఎరవేసి 

రాష్ట్ర విభజన తర్వాత విశాఖకు సినీ పరిశ్రమ తరలివచ్చే అవకాశాలున్నాయని భావించి ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ను 2017లో ప్రారంభించారు. దీనికి గతంలో ఛైర్మన్‌గా కేఎస్‌ రామారావు వ్యవహరించారు. ఉత్తరాంధ్ర వైకాపా ఇన్‌ఛార్జిగా విజయసాయిరెడ్డి ఉన్న సమయంలో జగన్‌ సలహాదారు సాగి దుర్గాప్రసాద్‌రాజు రంగంలోకి దిగారు. ‘క్లబ్‌కు తెదేపా హయాంలో కేటాయించిన 5 ఎకరాలకు మరికొంత కలిపి మొత్తం 10 ఎకరాలు కేటాయిస్తాం. రూ.వంద కోట్ల నిధులు తెచ్చి వెంటనే క్లబ్‌ నిర్మాణం పూర్తి చేస్తాం. అందుకు కమిటీలో మేం చెప్పినవాళ్లను సభ్యులుగా చేర్చుకోవాలి’ అంటూ ఒత్తిడి తెచ్చి కేఎస్‌ రామారావుతోనే ఎమర్జెన్సీ జనరల్‌ బాడీ మీటింగ్‌ పెట్టించి అందరినీ ఒప్పించినట్లు సమాచారం. ఆ తర్వాత బైలాస్‌ మార్పుచేసి.. కేఎస్‌ రామారావును తప్పించి, శాశ్వత కమిటీని తెరపైకి తెచ్చారు. దానికి ఛైర్మన్‌గా సాగి దుర్గాప్రసాద్‌రాజును నియమించారు. అందులో శాశ్వత సభ్యులుగా విజయసాయిరెడ్డి అనుచరునిగా ముద్ర వేసుకున్న ఏసీఏ కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి, మారిటైం బోర్డు మాజీ ఛైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, జగన్‌ సలహాదారు లంకా శ్రీధర్, వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, హైదరాబాద్‌కు చెందిన మెహర్‌కుమార్, రాజశేఖరరెడ్డి, ఎంఎస్‌ఎన్‌ రాజు, శ్రీనివాసరాజులను నియమించుకున్నారు. మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడిగా విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌ను నియమించేందుకు.. క్లబ్‌లో సభ్యత్వం కట్టించి పావులు కదిపారు. ఈ వ్యవహారంపై పత్రికల్లో కథనాలు రావడంతో రోహిత్‌ను తప్పించి, కాయల వెంకటరెడ్డిని మేనేజ్‌మెంట్‌ కమిటీలో నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


భీమిలి భూముల్లో కమీషన్లకు పావులు 

క్లబ్‌కు భూములు ఇస్తామంటూ ఆశ చూపి వైకాపా పెద్దలు కమిటీలో తిష్ఠ వేసినా.. తరువాత ఆ ప్రయత్నమే చేయలేదు. భోగాపురం వద్ద 15 ఎకరాలు కేటాయిస్తామంటూ ఎన్నికల ముందు కొత్త పల్లవి అందుకున్నా, దాన్నీ పక్కన పెట్టారు. ప్రస్తుతం విశాఖలో క్లబ్‌ కోసం లీజుకు తీసుకున్న స్థలం వైకాపా తరఫున ఉండి నుంచి గత రెండు పర్యాయాలు పోటీ చేసిన నరసింహమూర్తి రాజుది. దానికి గతంలో రూ.4 లక్షల ఉన్న అద్దెను రూ.6 లక్షలకు పెంచి ఏటా రూ.72 లక్షలు జేబులో వేసుకొనేలా ప్రణాళిక రచించారు. ప్రశ్నించేవారు లేకపోవడంతో సాగి దుర్గాప్రసాద్‌రాజు, కాయల వెంకటరెడ్డి క్లబ్‌ నిధులు రూ.38 కోట్లతో భీమిలి వద్ద యాజమాన్య హక్కులు లేని భూమిని అధిక ధరకు కొనుగోలు చేయడానికి పావులు కదిపారు. అందులో రూ.11 కోట్లకుపైగా కమీషను రూపంలో తమ జేబుల్లో వేసుకునే ప్రయత్నాలు చేసినట్లుగా సమాచారం. క్లబ్‌ ప్రాంతంలో పోర్టికోలు నిర్మించి రూ.1.50 కోట్ల నిధులను ఇప్పటికే దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. 2019లో రామానాయుడు స్టూడియో దిగువన తెదేపా హయాంలో కేటాయించిన ఐదు ఎకరాల జీవో ఇంకా మనుగడలో ఉంది కనుక.. క్లబ్‌లో ఉన్న డబ్బులిస్తే ఆ పాత జీవోతో స్థలం తెస్తానంటూ హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఎన్‌ రాజు కొత్త నాటకానికి తెర తీశారంటూ క్లబ్‌ సభ్యులు కొందరు మండి పడుతున్నారు. ఇలా వైజాగ్‌ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ను చుట్టుముట్టిన కష్టాలకు కూటమి ప్రభుత్వంలోనైనా విముక్తి లభిస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని