Andhra News: పలువురు వీసీల రాజీనామా

రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల ఉప కులపతులు సోమవారం రాజీనామాలు సమర్పించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నియామకాలు పొందిన వీసీల్లో పలువురు అనేక ఆరోపణలు మూటగట్టుకున్నారు.

Published : 02 Jul 2024 04:57 IST

రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల ఉప కులపతులు సోమవారం రాజీనామాలు సమర్పించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నియామకాలు పొందిన వీసీల్లో పలువురు అనేక ఆరోపణలు మూటగట్టుకున్నారు. వైకాపా నాయకులతో అంటకాగి వర్సిటీలను రాజకీయాలకు కేంద్రాలుగా మార్చారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. నూతన ప్రభుత్వంలో అలాంటి వారంతా వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. 

ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - ఆరోగ్య విశ్వవిద్యాలయం: విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి (వీసీ) డాక్టర్‌ కె.బాబ్జి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సోమవారం పంపించారు. వైకాపా అనుకూలుడైన బాబ్జీ వీసీగా వచ్చినప్పటి నుంచి విశ్వవిద్యాలయం సొమ్మును ఆడంబరాల కోసం ఖర్చు చేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు.

జేఎన్‌టీయూ-గురజాడ వీసీ 

ఈనాడు, విజయనగరం: విజయనగరంలోని జేఎన్‌టీయూ (గురజాడ) ఉపకులపతి వెంకటసుబ్బయ్య సోమవారం రాజీనామా చేశారు. ఈ లేఖను గవర్నర్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి పంపించారు. వైకాపా హయాంలో వీసీగా నియమితులైన వెంకట సుబ్బయ్యపై ప్రశ్నపత్రాల లీకేజీ, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టడం, అక్రమ వసూళ్లు, ప్రశ్నించిన వారిని సస్పెండ్‌ చేయడం వంటి ఆరోపణలున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బహిరంగంగానే వైకాపాకు మద్దతు తెలిపారనే విమర్శ ఎదుర్కొన్నారు.

ఆర్‌యూ వీసీ 

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: రాయలసీమ విశ్వవిద్యాలయం ఉప కులపతి సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేసినట్లు ఇన్‌ఛార్జ్‌ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్త వీసీ ఎవరన్న విషయం ఇంకా తెలియదని చెప్పారు. 

నాగార్జున వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌ 

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వైకాపా పాలనలో పరిపాలనా పదవులు పొందిన వారంతా రాజీనామా చేశారు. ఆ పార్టీ నేతలతో అంటకాగి వర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చారని కొద్దిరోజుల నుంచి విద్యార్థి సంఘాలు వారిపై భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రిజిస్ట్రార్‌ ఆచార్య కరుణ, రెక్టార్‌ ఆచార్య వరప్రసాదమూర్తి తదితరులు సోమవారం ఉదయాన్నే వర్సిటీకి చేరుకుని తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్‌ఛార్జ్‌ రిజిస్ట్రార్‌గా ఆచార్య సంధ్యాకోల్‌ను నియమించి వీసీ రాజశేఖర్‌ తన రాజీనామా లేఖ అందజేశారు. ఆ తర్వాత వివిధ విభాగాల్లో పని చేస్తున్న సమన్వయకర్తలు తమ రాజీనామా లేఖలను ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌కు సమర్పించారు. రాజీనామాల నేపథ్యంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యోగులు, వర్సిటీ పరిరక్షణ సమితి నాయకులు విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్దకు చేరుకుని టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.

జేఎన్‌టీయూకే వీసీ 

కాకినాడ (గాంధీనగర్‌), న్యూస్‌టుడే: జేఎన్‌టీయూకే ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు సోమవారం రాజీనామా చేశారు. ఈ వర్సిటీని గత ప్రభుత్వంలో వైకాపా కార్యకలాపాలకు నిలయంగా మార్చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వీసీ రాజానామా చేశారు. 

పద్మావతి మహిళా వర్సిటీ 

మహిళా వర్సిటీ (తిరుపతి), న్యూస్‌టుడే: శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఉపకులపతి ఆచార్య డి.భారతి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. సంబంధిత లేఖను గవర్నర్‌కు పంపించారు. వర్సిటీ సెరికల్చర్‌ విభాగం విశ్రాంత ఆచార్యురాలైన ఆమె గతేడాది జూన్‌ 15న వీసీగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని