Toll charges: విజయవాడ హైవేపై ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్‌

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్‌హెచ్‌ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్‌ వసూళ్లు ప్రారంభమయ్యాయి.

Published : 01 Jul 2024 08:14 IST

చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్‌హెచ్‌ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్‌ వసూళ్లు ప్రారంభమయ్యాయి. నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో రెండు వరుసలుగా ఉన్న జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా నిర్మించేందుకు రూ.1740 కోట్లకు జీఎమ్మార్‌ టెండర్‌ను దక్కించుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.5 కిలో మీటర్ల జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా నిర్మించింది. తెలంగాణలో పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలను నిర్మించింది. 2012 డిసెంబరు నుంచి టోల్‌ వసూళ్ల బాధ్యతతో పాటు హైవే పర్యవేక్షణను కూడా జీఎమ్మార్‌ చూసేది. అయితే తెలుగు రాష్ట్రాల విభజనతో ఇసుక లారీలు, రవాణా వాహనాలు తగ్గి రోజుకు రూ.20 లక్షల మేర..నెలకు రూ.6 కోట్ల వరకు నష్టం వస్తుందని జీఎమ్మార్‌ కోర్టును ఆశ్రయించగా..ఎన్‌హెచ్‌ఏఐ ఆ నష్టాన్ని రెండు విడతల్లో భర్తీ చేసేందుకు ఈ ఏడాది జూన్‌ నెలలో జీఎమ్మార్‌తో ఒప్పందం చేసుకొంది. 2025 జూన్‌ వరకు జీఎమ్మార్‌ సంస్థకు టోల్‌ వసూళ్ల అవకాశం ఉండగా ఎన్‌హెచ్‌ఏఐతో ఒప్పందం మేరకు ఏడాది ముందే ఈ బాధ్యతల నుంచి తప్పుకొంది. తాజాగా బాధ్యతలను స్వీకరించిన ఎన్‌హెచ్‌ఏఐ మూడు నెలల పాటు పంతంగి, కొర్లపహాడ్‌ వద్ద స్కైలాబ్‌ ఇన్‌ఫ్రా, చిల్లకల్లు వద్ద కోరల్‌ ఇన్‌ఫ్రా సంస్థలకు టోల్‌ వసూళ్ల బాధ్యతను అప్పగించింది. నిలిచిపోయిన ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనులకూ ఎన్‌హెచ్‌ఏఐ సెప్టెంబరులో టెండర్లు పిలిచే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాజాగా ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని