AP news: అరాచక అధికారులపై సర్కారు డేగకన్ను!

వైకాపా హయాంలో గత అయిదేళ్ల పాటు రాష్ట్రంలో కొనసాగిన దాష్టీకాలు, అరాచకాలు, అక్రమాలు, దాడులు, రాజకీయ హత్యలు, తప్పుడు కేసులకు బాధ్యులైన పోలీసు అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Published : 29 Jun 2024 06:17 IST

వైకాపా దాష్టీకాల్లో భాగస్వాములైన పోలీసుల జాబితా సిద్ధం!
గత ప్రభుత్వ హయాంలో నమోదైన అక్రమ కేసుల వివరాల సేకరణ
ముఖ్యమైన కేసుల్ని నిర్వీర్యం చేయటంపైనా ఆరా

ఈనాడు-అమరావతి: వైకాపా హయాంలో గత అయిదేళ్ల పాటు రాష్ట్రంలో కొనసాగిన దాష్టీకాలు, అరాచకాలు, అక్రమాలు, దాడులు, రాజకీయ హత్యలు, తప్పుడు కేసులకు బాధ్యులైన పోలీసు అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. చట్టాలు, నిబంధనల్ని లెక్క చేయకుండా వైకాపా బంటుల్లా పేట్రేగిన కొందరు పోలీసు అధికారులు వీటిల్లో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించింది. జగన్‌ జమానాలో పెద్దఎత్తున సాగిన అధికార దుర్వినియోగం, రాజకీయ ప్రేరేపిత హింసాత్మక ఘటనలు, వాటికి కారకులు, బాధితులకు అండగా ఉండకుండా.. రివర్స్‌లో వారిపైనే కేసులు బనాయించిన ఉదంతాలు, వాటికి బాధ్యులైన వారి వివరాలతో జాబితా సిద్ధం చేస్తోంది. వాటిపై సమగ్ర విచారణ జరిపించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. 

డాక్టర్‌ సుధాకర్‌ మరణం మొదలు.. అమర్‌నాథ్‌గౌడ్‌ హత్య వరకు

కరోనా వేళ మాస్క్‌ అడిగినందుకు దళిత వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ ప్రాణాలను బలి తీసుకున్న ఘటన మొదలు.. తన అక్కను వేధిస్తున్న వైకాపా మూకల్ని ప్రశ్నించినందుకు వారి చేతిలో హత్యకు గురైన పద్నాలుగేళ్ల బాలుడు అమర్‌నాథ్‌గౌడ్‌ కేసు వరకూ అన్నింటిపైనా రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటోంది. వైకాపా నాయకుడి కుమార్తె కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న చదువుల తల్లి మిస్బాను ఆత్మహత్య చేసుకునేలా వేధించటం, మాస్క్‌ పెట్టుకోలేదంటూ దళిత యువకుడు కిరణ్‌కుమార్‌ చావుకు కారణమవ్వటం, దొంగతనం కేసులో ఇరికించి.. హింసించి అబ్దుల్‌ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు బాధ్యులవ్వటం వంటి ఘటనలన్నింటిపైనా పోలీసు ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దళిత డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యాన్ని అంతమొందించి.. మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన కేసును ఎలా నీరుగార్చారు? దానికి ఎవరు బాధ్యులన్న సమాచారాన్నీ తీసుకుంటున్నారు. ప్రధానంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై సాగిన తీవ్ర అణచివేత, హింసాత్మక ఘటనలన్నింటినీ సమీక్షించి, వాటిల్లో చట్ట విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 

తెదేపా కార్యకర్తల హత్యలతోపాటు ఇతర కేసుల ప్రస్తుత స్థితిపై నివేదిక

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి జరిగి రెండున్నరేళ్లు అవుతున్నా.. ఒక్కర్ని కూడా ఎందుకు అరెస్టు చేయలేదు? సీసీ ఫుటేజీలో దాడులు చేసిన వారెవరో స్పష్టంగా తెలుస్తున్నా.. వారిని ఎందుకు గుర్తించలేదు? ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపైకి నాటి వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌ వందలాది మందితో దండయాత్రగా వెళ్లి దాడికి తెగబడితే.. ఏ ఒక్కర్నీ ఎందుకు అరెస్టు చేయలేదు? వీటి వెనక ఉన్న శక్తులెవరనే వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వీటితోపాటు గన్నవరం, మాచర్లలో తెదేపా కార్యాలయాలపై దాడి, దహనం చేసిన కేసులను ఎవరు నిర్వీర్యం చేశారనేది ఇప్పటికే గుర్తించింది. మాచర్లలో తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య సహా రాష్ట్రవ్యాప్తంగా గత అయిదేళ్లలో జరిగిన తెదేపా కార్యకర్తలు, నాయకుల హత్యలు.. దాడుల కేసుల పురోగతి, ప్రస్తుత స్థితిపై పోలీసు ఉన్నతాధికారులు ఆయా జిల్లాల ఎస్పీలను నివేదికలు అడిగారు. అవసరమైతే వాటిపై పునఃవిచారణ చేయించాలని భావిస్తున్నారు. 

ఆస్తులు, వ్యాపారాలు, గనులు లాక్కున్న వారిపైనా నివేదికలు

వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార యంత్రాంగాన్ని ప్రయోగించి ప్రైవేటు ఆస్తులు, గనులు, వ్యాపారాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. దీనిలో కొంతమంది అధికారులూ భాగస్వాములయ్యారు. నియోజకవర్గాల్లో పలువురు వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్దఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. వీటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా నివేదికలు సిద్ధం చేస్తోంది. వైకాపా ప్రభుత్వ బాధితులు కొంతమంది ఒక్కొక్కరుగా బయటకొచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. వాటిపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రజల ముందు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని