Peddireddy: పెద్దిరెడ్డీ.. ఇదేం పని?

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ‘ఘన’కార్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తిరుపతి ఎయిర్‌ బైపాస్‌ రోడ్డు సమీపంలోని రాయల్‌నగర్‌లో రూ.19 లక్షల కార్పొరేషన్‌ సొమ్ముతో ఇంటికి సీసీ రోడ్డు వేయించుకున్నారు.. అంతేకాకుండా మరెవరికీ ప్రవేశం లేదంటూ రెండు వైపులా గేట్లు పెట్టేశారు.

Updated : 05 Jul 2024 17:19 IST

ప్రజలు కాలు పెట్టకుండా గేట్లు
మూడెకరాల బుగ్గమఠం భూముల్లో సౌధం
కార్పొరేషన్‌ నిధులతో రోడ్డు
గేట్లు పెట్టి.. సొంత అవసరాలకు వినియోగం
విధేయత ఒలకబోస్తున్న నగరపాలక అధికారులు

రోడ్డుకు అడ్డంగా ఎవరూ రాకుండా ఏర్పాటు చేసిన గేటు

ఈనాడు, తిరుపతి: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ‘ఘన’కార్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తిరుపతి ఎయిర్‌ బైపాస్‌ రోడ్డు సమీపంలోని రాయల్‌నగర్‌లో రూ.19 లక్షల కార్పొరేషన్‌ సొమ్ముతో ఇంటికి సీసీ రోడ్డు వేయించుకున్నారు.. అంతేకాకుండా మరెవరికీ ప్రవేశం లేదంటూ రెండు వైపులా గేట్లు పెట్టేశారు. వైకాపా సర్కారు హయాంలో దీనికి అధికారగణం అడ్డంగా సహకరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వారంతా విధేయత చాటుకుంటూనే ఉన్నారు. దారి తెరవండి మహాప్రభో అని స్థానికులు మొరపెట్టుకుంటున్నా.. కార్పొరేషన్‌ నిధులతో రోడ్డు వేశారో లేదో పరిశీలించి రెండు రోజుల్లో చెబుతామంటూ అధికారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ వ్యవహారంపై జనసేన నేతలు ధర్నాకు దిగితే.. వారిని అక్కడ నుంచి తొలగించడంపై చూపిన శ్రద్ధ.. దారి తెరవడంపై మాత్రం పెట్టడం లేదు. బుగ్గ మఠం భూములను చెరబట్టి మూడెకరాల్లో సౌధం నిర్మించుకున్నారని.. జనసేన నాయకుడు కిరణ్‌రాయల్‌ ఆరోపించారు. 

మూడు ఎకరాల బుగ్గమఠం భూముల్లో

తిరుపతి రాయల్‌నగర్‌లో మూడుఎకరాల విస్తీర్ణంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి నివాసం ఉంది. ఇవి బుగ్గమఠం భూములని.. ఆక్రమించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీగా ఉన్న సమయంలో ఈ భూమి మధ్య నుంచి ఒక మట్టి రోడ్డు ఉండేది. కార్పొరేషన్‌లో విలీనమైన తర్వాత గ్రావెల్‌ రోడ్డు నిర్మించారు. వెస్ట్‌ చర్చితోపాటు ఎమ్మార్‌పల్లి వైపు నుంచి ఈ మార్గంలో రాకపోకలు సాగాయి. వైకాపా అధికారంలోకి రాగానే ఈ దారిని మూసేశారు. అటువైపు ఎవరూ రాకుండా కంచె వేసేశారు.


మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన క్షేత్రంలో నుంచి కార్పొరేషన్‌ అధికారులు నిర్మించిన సిమెంటు రోడ్డు 

టెండరు కూడా పిలవకుండా 

కార్పొరేషన్‌ నిధులతో తన ఇంటికి రోడ్డు వేయించుకునేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక ప్రజల్ని అడ్డం పెట్టుకున్నారు. రాకపోకలు సాగించేందుకు వీలుగా సీసీ రోడ్డు నిర్మించాలని వారి పేరుతో దరఖాస్తు ఇప్పించారు. దీంతో అధికారులు ఆఘమేఘాలపై కదిలారు. వెంటనే 400 మీటర్ల రోడ్డుకు అంచనాలు రూపొందించారు. నిబంధనల మేరకు రూ.10 లక్షలకు పైన వ్యయమయ్యే ఏ పని చేయాలన్నా టెండరు పిలవాలి. అయితే దీన్ని రెండు భాగాలుగా విభజించి.. (రూ.9.55 లక్షలు, రూ.9.50లక్షల చొప్పున) పనుల్ని నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టారు. మొత్తంగా పెద్దిరెడ్డి ఇంటికి రోడ్డు కోసం రూ.19.05 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ప్రజల అవసరాలను పక్కన పెట్టి రోడ్డుకు గేట్లు పెట్టి సొంతానికి మాత్రమే వినియోగించుకుంటున్నారు. కేవలం తన కుటుంబ సభ్యుల వాహనాలు తప్ప ఇతరులు ఎవరూ కూడా రాయల్‌నగర్‌ ప్రాంతం వైపు నుంచి వచ్చేందుకు అవకాశం లేకుండా చేశారు. 


గేట్లు తొలగించకుంటే బద్దలు కొడతాం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద జనసేన నేతల ఆందోళన 

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వద్ద ధర్నా నిర్వహిస్తున్న జనసేన నేతలు 

బుగ్గమఠం భూములను ఆక్రమించడమే కాకుండా అందులో నుంచి కార్పొరేషన్‌ సొమ్ముతో సీసీ రహదారిని నిర్మించి సామాన్య ప్రజలు ఎవరూ వెళ్లకుండా అడ్డుగా పెట్టిన గేట్లను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వద్ద జనసేన నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. రహదారికి అడ్డంగా వేసిన గేటును తొలగించాలంటూ జనసేన నేత కిరణ్‌ రాయల్, సుభాషిణి తదితరులు పెద్దిరెడ్డి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా గేటును తొలగించేందుకు చొచ్చుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. కార్పొరేషన్‌ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు