AP and telangana: తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి

తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన గవర్నర్‌ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు.

Updated : 29 Jun 2024 06:42 IST

తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ 

తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న ఈవో రామారావు

ఈనాడు డిజిటల్, అమరావతి; విజయవాడ(ఇంద్రకీలాద్రి), న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన గవర్నర్‌ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం, ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబును అభినందించేందుకు వచ్చానన్నారు. అంతకుముందు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజన, డీసీపీ హరికృష్ణ, దుర్గగుడి ఈవో రామారావు ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. 

తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ను సత్కరించి, వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేస్తున్న సీఎం చంద్రబాబు 

సీఎం చంద్రబాబుతో భేటీ: ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ శుక్రవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లగా బాబు, మంత్రి లోకేశ్‌ రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేశారు. రాష్ట్ర, జాతీయ రాజకీయ పరిస్థితులు, విభజన సమస్యలు, రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్‌ ఉన్న అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. 

మంగళగిరి చేనేత శాలువాతో రాధాకృష్ణన్‌ను సత్కరించామని, మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. 


పీవీ... దేశానికి బలమైన ఆర్థిక పునాదులు వేశారు

-చంద్రబాబు 

ఈనాడు డిజిటల్, అమరావతి: విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేతమైన నిర్ణయాలతో దేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు మాజీ ప్రధాని  పీవీ నరసింహారావు బలమైన పునాదులు వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. శుక్రవారం పీవీ జయంతి సందర్భంగా ఎక్స్‌ వేదికగా నివాళి అర్పించారు. తెలుగు వెలుగు పీవీ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని