TGHigh Court: జగన్‌ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణ

జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది.

Published : 04 Jul 2024 06:16 IST

తెలంగాణ హైకోర్టు ఆదేశం 
కేసుల్లో కదలిక లేకపోవడంపై అసంతృప్తి 
పురోగతిపై నివేదిక ఇవ్వాలని సీబీఐ కోర్టుకు ఆదేశం 

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది. జగన్‌కు వ్యతిరేకంగా నమోదైన కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసుల విచారణలో పురోగతిపై నివేదిక సమర్పించాలంటూ.. విచారణను 23కు వాయిదా వేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణను సత్వరం పూర్తి చేసేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే. కేసుల విచారణను నిందితులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, సత్వరం విచారణ పూర్తి చేసేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ధర్మాసనం గత విచారణ నుంచి ఇప్పటి వరకు ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.

ముందుకు సాగని కేసులు

ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంతోపాటు అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ కేసులో ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసుల సత్వర విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటై కేసుల విచారణను సమీక్షిస్తోంది. ప్రజాప్రతినిధుల్లో అత్యధిక కేసులను జగన్‌మోహన్‌రెడ్డి ఎదుర్కొంటున్నారు. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంపై 11 సీబీఐ కేసులు, 9 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసులు విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో ప్రధాన నిందితులైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు పలువురు నిందితులు దాదాపు 134 దాకా డిశ్ఛార్జి పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ గత ఏడాది డిసెంబరు 15న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉత్తర్వుల తయారీ ప్రక్రియ కొనసాగుతోందని, 13 వేల పేజీల రికార్డులు, అధిక సంఖ్యలో ఉన్న సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించడంలో జాప్యం జరుగుతోందని, దిద్దుబాట్లు తదితరాలకు ఏప్రిల్‌ 30 వరకు గడువు కావాలని సీబీఐ కోర్టు హైకోర్టుకు ఫిబ్రవరి 15న లేఖ రాసింది. దీనిపై విచారించిన హైకోర్టు డిశ్ఛార్జి పిటిషన్లను తేల్చడానికి ఏప్రిల్‌ 30 వరకు గడువిచ్చింది. అయితే ఏప్రిల్‌ 19న భారీ ఎత్తున చేపట్టిన 47 మంది జడ్జీల బదిలీల్లో భాగంగా సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి కూడా బదిలీ అయ్యారు. డిశ్ఛార్జి పిటిషన్లపై ఉత్తర్వులు వెలువరించి రిలీవ్‌ కావాల్సి ఉండగా, న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా డిశ్ఛార్జి పిటిషన్లపై ఉత్తర్వులు సిద్ధం కాకపోవడంతో పిటిషన్లను తిరిగి విచారణకు రీఓపెన్‌ చేసి వెళ్లారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ టి.రఘురాం తాజాగా ఈ పిటిషన్లపై విచారణ మొదలుపెట్టారు. వారం రోజులుగా రోజు విడిచి రోజు వాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు ఉత్తర్వులతో జగన్‌ కేసుల్లో విచారణ వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని