AP news: భోగాపురంలో భూబకాసురులు

వైకాపా ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం అనేది ఆ పార్టీ నేతలు, వారితో అంటకాగే కొంతమంది అధికారులు హక్కుగా భావించిన పరిస్థితి.

Updated : 29 Jun 2024 07:03 IST

డీ పట్టా, 22ఏ ఎసైన్డ్‌ భూములపై ఉన్నతాధికారులు, వైకాపా నేతల కన్ను
జగన్‌ హయాంలో అడ్డగోలుగా యజమానులతో ఒప్పందాలు

భోగాపురం కోస్టల్‌ కారిడార్‌ను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిలో జీడితోటలు

ఈనాడు, విజయనగరం - భోగాపురం, పూసపాటిరేగ, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం అనేది ఆ పార్టీ నేతలు, వారితో అంటకాగే కొంతమంది అధికారులు హక్కుగా భావించిన పరిస్థితి. అధికారమే అండగా భోగాపురం విమానాశ్రయం ప్రాంతంలోని డీ పట్టా, 22ఏ ఎసైన్డ్‌ భూములపై కన్నేశారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి సహకారం కూడా తోడవడంతో బరితెగించారు. విజయనగరం జిల్లాలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న భూముల స్వాధీనానికి పావులు కదిపారు. 

గతేడాది మే నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూముల పరిశీలన వంకతో వచ్చిన కొందరు ఉన్నతాధికారులు తమకు అనుకూలమైన డి-పట్టా భూములు చూసుకున్నారు. వీరికి స్థానిక అధికారులు సహకరించారు. విజయనగరం జిల్లా సరిహద్దులోని విశాఖ జిల్లా భీమిలి రెవెన్యూ పరిధిలో అన్నవరం నుంచి చేపలుప్పాడ వరకు 630 ఎకరాల 22-ఎ భూముల యజమానులతో చర్చలు జరిపారు. వారిని ఒప్పించిన ఉన్నతాధికారి కుటుంబ వ్యాపార భాగస్వామి ఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అడ్వాన్స్‌లు చెల్లించారు. ఆ తర్వాత భోగాపురం మండలం వైపు తూడెం, దిబ్బలపాలెం, పిన్నింటిపాలెం, రామచంద్రపేట, చింతపల్లి, బర్రిపేట, కందివలస వరకు వందలాది ఎకరాల డి-పట్టా భూములకు గాలం వేశారు. స్థానిక వైకాపా నాయకుల మధ్యవర్తిత్వం, స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో ఒప్పంద పత్రాలు రాయించారు. 

పూసపాటిరేగలో డి-పట్టా భూముల మధ్యలో ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో నిర్మించిన రహదారి

ప్రభుత్వం మారడంతో బెదిరింపులు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో.. ముందుగా ఒప్పందం చేసుకున్న వారెవరైనా మాటమార్చితే తమ  ‘ప్రతాప’ం చూపుతామంటూ రైతులను బెదిరిస్తున్నట్లు తెలిసింది. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో అధిక సంఖ్యలో డి-పట్టా భూములకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి ఎక్కడ తిరుగుతున్నారో జాడలేదని, చరవాణుల్లో తమను బెదిరిస్తున్నట్లు వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పూసపాటిరేగ మండలం కందివలస గ్రామానికి చెందిన రైతులు తమ డి-పట్టా భూముల్లో సరుగుడు తోటలు పెంచారు. వాటి ఫలసాయం అందుకునే దశలో భూములు స్వాధీనం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఈ విషయం ఎక్కడైనా బయటపెడితే మూల్యం చెల్లించుకుంటారని వారిని బెదిరిస్తున్నట్లు తెలిసింది. అప్పట్లో ఈ రెండు మండలాల్లో పనిచేసిన రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు బ్రోకర్లకు అన్ని విధాలా సహకరించారు. అప్పటి డీజీపీ స్థాయి అధికారి ఏరికోరి తమ వారికి అన్నివిధాలా అండగా నిలిచే అధికారులనే ఈ ప్రాంతంలో నియమించారు.

ఆ వంద ఎకరాల మాటేమిటి?

భోగాపురం మండలం కంచేరు రెవెన్యూలో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి జీడితోటలతో నిర్మానుష్యంగా ఉండేది. ఈ భూమిపై అప్పట్లో వైకాపా నాయకులు కొందరు కన్నేశారు. వాటాలు వేసుకొని హద్దులు పాతేశారు. అప్పట్లో ఇది ప్రభుత్వ భూమి అంటూ అధికారులు నాలుగైదు రోజులు హడావుడి చేశారు. ఈ సమాచారం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారికి తెలిసింది. ఈ భూమిని విమానాశ్రయ వాణిజ్య అవసరాలకు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రాంతంపై కన్నేసిన ఐఏఎస్‌ అధికారి ఒకరు ఇది భవిష్యత్తులో బీచ్‌ కారిడార్‌కు అనుకూలంగా ఉంటుందని భావించారు. ఆయన వెళ్లిన తర్వాత మరికొందరు ఐఏఎస్‌ అధికారులు వచ్చి ఈ ప్రాంతంలో రెండు రోజులు పర్యటించారు. ఎలాగైనా ఈ భూమిని చేజిక్కించుకోవాలని పథకం రచించినా ప్రభుత్వం మారడంతో తాత్కాలికంగా అందరూ గప్‌చుప్‌గా ఉన్నారు.

ఎవరి కోసం ఈ రోడ్డు?

గత ప్రభుత్వాలు పూసపాటిరేగ మండలంలో అత్యధికంగా పేదలకు డి-పట్టా భూములు పంపిణీ చేశాయి. అందులో జాతీయ రహదారి పక్కనే సుమారు 400 ఎకరాలు ఉన్నాయి. వీటిని ఆక్రమించుకునేందుకు వైకాపా పెద్దలు, కొందరు అధికారులు కన్నేశారు. కొంత మంది రైతులతో ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌ చెల్లించి స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములకు భవిష్యత్తులో విలువ పెరుగుతుందని ఎంపీ ల్యాడ్స్‌ నిధులు విడుదల చేయించారు. చోడమ్మ అగ్రహారం నుంచి పొట్టసోములు కల్లాల వరకు, అక్కడి నుంచి సమీపంలోని ఓ ప్రైవేటు పరిశ్రమ వెనుకభాగం వరకు రెండు బిట్లుగా సుమారు రూ.10 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు పొడవునా గ్రామమే కాదు ఒక్క ఇల్లు కూడా లేకపోయినా, ఎంపీ ల్యాడ్స్‌ నిధులు మంజూరు చేయడం అక్రమార్కుల ముందుచూపునకు అద్దం పడుతోంది.


ఐబీ అధికారుల ఆరా

భోగాపురం మండలంలో ఇటీవల కేంద్ర నిఘా సంస్థ అధికారులు పర్యటించారు. విమానాశ్రయం పనులు ఎలా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో డి-పట్టా భూముల లావాదేవీలపై పత్రికల్లో వచ్చిన కథనాలు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆరా తీసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని