YS Jagan: జగన్‌ రక్షణకే 986 మంది

మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ భద్రతలో నిరంతరం ఎంతమంది పోలీసులు ఉంటారో తెలుసా? పదీ, ఇరవై కాదు.. ఏకంగా 986 మంది.

Updated : 25 Jun 2024 12:22 IST

ఇంట్లో ఉంటేనే ఇంతమంది.. బయటకెళ్తే రెండు, మూడింతలు 
ఐదేళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే రూ.296 కోట్లు
ప్యాలెస్‌ చుట్టూ అడుగడుగునా తనిఖీలు.. అత్యాధునిక రక్షణ పరికరాలు
తాడేపల్లి చుట్టూ పదుల సంఖ్యలో చెక్‌పోస్టులు
చుట్టుపక్కల ఇళ్లపై డ్రోన్లతో నిఘా  
ఆయన మాజీ సీఎం అయినా ఇప్పటికీ అదే భద్రత!
మాజీ సీఎంకు రెండు బుల్లెట్‌ప్రూఫ్‌ ల్యాండ్‌ క్రూయిజర్‌ కార్లు  
సీఎం చంద్రబాబుకు బుల్లెట్‌ప్రూఫ్‌ ఫార్చూనర్‌ వాహనమే
ఈనాడు - అమరావతి 

జగన్‌ బయటకు వచ్చారంటే చాలు.. ఇంత భారీ భద్రత, ఆర్భాటం నిత్యకృత్యం. 2023 సెప్టెంబరులో ‘వాహనమిత్ర’ నిధుల విడుదల సభకు వెళుతున్నప్పటి చిత్రం ఇది.

మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ భద్రతలో నిరంతరం ఎంతమంది పోలీసులు ఉంటారో తెలుసా? పదీ, ఇరవై కాదు.. ఏకంగా 986 మంది. అంటే ఒక చిన్న గ్రామ జనాభాతో సమానం! దక్షిణ భారతదేశంలోని ముఖ్యమంత్రులందరి ఇళ్ల దగ్గర ఉండే భద్రతాసిబ్బంది అందరినీ కలిపినా ఈ సంఖ్య చేరడం కష్టమే. వీరికి ఒక్కొక్కరికి నెలకు సగటున రూ.50 వేల లెక్కన చూసినా ఐదేళ్లలో చెల్లించిందే రూ.296 కోట్లు. ఆపైన ఆయన కోసం అత్యాధునిక రక్షణ పరికరాలు.. ప్యాలెస్‌ చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప గోడ (కంచె), బుల్లెట్‌ ప్రూఫ్‌ క్రూయిజర్‌ వాహనాలు.. ఇలా ఎన్నో! దేశంలో రాష్ట్రపతి, ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉండే వారి ఇళ్ల వద్ద కూడా ఈ స్థాయి భద్రత ఉండదేమో! తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూనే ఎప్పుడూ 310 మంది ఆయన రక్షణలో ఉంటారు. మూడు షిఫ్టుల్లో కలిసి ఈ సంఖ్య 934. ఇదంతా ఆయన ఇంట్లో ఉన్నప్పుడే. బయటకు అడుగుపెడితే భద్రతా సిబ్బంది సంఖ్య రెండు, మూడింతలు పెరుగుతుంది. కిలోమీటర్ల పొడవునా చెట్లు కొట్టేస్తారు. పరదాలు కట్టేస్తారు. దుకాణాలు మూయిస్తారు. రాకపోకలు నిలిపేస్తారు. జగన్‌మోహన్‌రెడ్డి కోసం ఆయన ఇంటి చుట్టుపక్కల వాళ్లు, ఆ మార్గంలో ప్రయాణించే వారైతే ఐదేళ్లుగా నరకమే చూస్తున్నారు. తమ ఇంటికి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా గుర్తింపుకార్డులు మెడలో వేసుకుని తిరగాల్సిందే. అడుగడుగునా పోలీసులు ఆపుతుంటే.. వారికి రుజువులు చూపించాలి. ఎవరైనా వస్తున్నారంటూ కొద్దిసేపు ఆగమంటే.. ఇంట్లో పనులు కూడా పక్కన పెట్టేసి చేతులు కట్టుకుని నిల్చోవాల్సిందే. ఇళ్లపై ఎగరేసే డ్రోన్ల ద్వారా వారి వ్యక్తిగత గోప్యతకూ ఐదేళ్లుగా భంగం వాటిల్లుతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి భద్రత ఉండాల్సిందే. అయితే ఇంత భారీ స్థాయిలోనా? అవసరానికి మించి ఉండాలా అనేదే ప్రశ్న. రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయి. తీవ్రవాదుల ఆనవాళ్లు లేవు. జగన్‌కు వారి నుంచి అంత ముప్పూ లేదు. అయినా ప్రత్యేక చట్టం తెచ్చి మరీ రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌కు ఇలా అసాధారణ భద్రత ఉంటుందని విన్నాం. కానీ జగన్‌ ఆయన్ను తలదన్నేస్తున్నారు.


అడుగడుగునా చెక్‌పోస్టులు 

తాడేపల్లిలో జగన్‌ భద్రత కోసం ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ప్యాలెస్‌ చుట్టూనే కాదు ఉండవల్లి గుహలు, సీతానగరం, వారధి, ప్రకాశం బ్యారేజి సహా అడుగడుగునా చెక్‌పోస్టులే. ఒక్కోచోట 10 నుంచి 16 మంది కాపు కాస్తుంటారు. వీరు కాకుండా ట్రాఫిక్‌ విధుల్లో సుమారు 30 మంది వరకు ఉంటారు. సీఎం రక్షణలో నిమగ్నమయ్యే బాంబ్‌ స్క్వాడ్, యాంటీ నక్సల్‌ స్క్వాడ్‌ బృందాలు అదనం. ఎస్‌ఎస్‌జీ బలగాలు కాకుండా.. చెక్‌పోస్టులు, ఇతర బాధ్యతల్లో ఉండేవారు సుమారు 555 మంది. గుంటూరు జిల్లా నుంచి ఎస్పీ ర్యాంకు అధికారితోపాటు ఏపీఎస్పీ బెటాలియన్స్‌ నుంచి ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు విధుల్లో ఉంటారు. మొత్తం 389 మంది భద్రతా సిబ్బందికి 50% అదనపు భత్యం చెల్లిస్తున్నారు.


379 మందితో కమాండో తరహా వ్యవస్థ..

దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని స్థాయిలో జగన్‌కు ప్రభుత్వం రక్షణ కల్పించింది. దీని కోసం ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ యాక్ట్‌ పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చారు. కమాండో తరహాలో స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ (ఎస్‌ఎస్‌జీ) ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 379 మంది ఎస్‌ఎస్‌జీ సిబ్బంది నిరంతరం ఆయన భద్రతలో నిమగ్నమై ఉంటారు. వీరు కాకుండా 491 మంది ఇతర దళాలు, 116 మంది ఇతరత్రా విధులు నిర్వహిస్తుంటారు. రాష్ట్రపతి, ప్రధానికి మించిన స్థాయిలో ఆయన చుట్టూ పోలీసు వలయం ఏర్పాటైంది. ఆయనతోపాటు భారతికి నలుగురు, తల్లి విజయమ్మకు నలుగురు చొప్పున భద్రతా సిబ్బంది ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌తోపాటు లోటస్‌పాండ్,  ఇడుపులపాయ, పులివెందుల ఇళ్ల వద్ద కూడా 52 మంది పోలీసులు నిరంతరం జగన్‌ కుటుంబానికి రక్షణ కల్పిస్తుంటారు. ఆయనతోపాటు కుటుంబసభ్యులకు కూడా దేశ, విదేశాల్లో భద్రత కల్పించేలా జగన్‌ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంతగా ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి దేశ చరిత్రలో మరెవరూ ఉండరేమో?


సాయుధ బలగాలతో నిత్యం యుద్ధవాతావరణం

తాడేపల్లి పెట్రోలు బంకు నుంచి భరతమాత విగ్రహం వరకు.. సర్వీస్‌రోడ్డులో పెద్దఎత్తున యూనిఫాంలో ఉండే సాయుధ పోలీసులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. రోజూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. రోడ్లను బ్లాక్‌ చేసి.. రాకపోకలు నిలిపేస్తుంటారు. ఐదేళ్లుగా అక్కడి ప్రజలు ఈ నిర్బంధంలో మగ్గుతున్నారు. జగన్‌ రక్షణ పేరుతో డ్రోన్‌ పహారా నిత్యకృత్యంగా తయారైంది. ఆయన ఇంటి చుట్టుపక్కల ఇళ్లలో ఉండేవారు ఏ క్షణం ఏం చేస్తున్నారో అంటూ పోలీసులు డ్రోన్ల ద్వారా గమనిస్తుంటారు. సొంత ఇంట్లోనూ స్వేచ్ఛగా బతకలేని పరిస్థితి కల్పించారనే ఆవేదన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. నివాస ప్రాంతాల్లో డ్రోన్ల ఎగరవేతపై ఆంక్షలున్నా.. జగన్‌ నివాసం దగ్గర మాత్రం అవన్నీ వర్తించవన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇలా ఎగరవేసిన డ్రోన్‌ ఒకటి నియంత్రణ కోల్పోయి, కనిపించకుండా పోవడంతో.. తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు కూడా నమోదు చేశారు.


మాజీ ముఖ్యమంత్రి.. అయినా అదే భద్రత

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్‌కు ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉందో ఓడి పోయినా ఇప్పుడూ అదే కొనసాగుతోంది. అక్కడి ప్రజల ఇబ్బందులు ఎంతమాత్రం తీరలేదు. వినతులు ఇవ్వగా, ఇవ్వగా..  ఇటీవల ప్యాలెస్‌ పక్క రోడ్డులో రాకపోకలకు అనుమతించారు. నిజానికి ఆయన ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్షనేత హోదా కూడా లేదు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా లేని స్థాయిలో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. గతంలో ఉన్న భద్రత ఎంతమాత్రం   తగ్గించలేదు. జగన్‌ కాన్వాయ్‌లో రెండు అత్యాధునిక ల్యాండ్‌ క్రూయిజర్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ కార్లు ఉండగా.. జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఎన్‌ఎస్‌జీ ఆధీనంలో ఉన్న చంద్రబాబుకు బుల్లెట్‌ప్రూఫ్‌ ఫార్చూనర్‌ వాహనం మాత్రమే అందుబాటులో ఉంచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని